మెగా లోక్‌అదాలత్ సాక్షరత రథయాత్ర ప్రారంభం
రాయచూరు, న్యూస్‌లైన్ : నగరంలో మెగా లోక్ అదాలత్ న్యాయసేవా సాక్షరత రథయాత్రను ఆదివారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవ ప్రాధికారం అధ్యక్షుడు,జిల్లా జడ్జి పీ.కృష్ణభట్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎక్కడికక్కడే తమ కేసులను పరిష్కరించుకునే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దేశ వ్యాప్తంగా లోక్ అదాలత్ జరుగుతోందన్నారు.
న్యాయమూర్తులు, సిబ్బంది కొరత కారణంగా పెండింగ్‌లో ఉన్న ఎన్నో కేసులు పరిష్కారానికి నోచుకోవడం హర్షనీయమన్నారు. జిల్లాలో 35 శాతం ప్రజలు వెనుకబడిన వర్గాలకు చెందిన వారేనని, నిరుపేదలైన వీరికి చట్టంపై అవగాహన కల్పించడం చాలా అవసరమన్నారు. న్యాయం, చట్ట పరిజ్ఞానాన్ని అందించేందుకు ఈజాతాను ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటికే లింగసూగూరు, దేవదుర్గలలో అభియాన్ పూర్తయింది. ప్రస్తుతం రాయచూరులో ప్రారంభమైందని, జిల్లాలో 15 రోజుల పాటు అభియాన్ కొనసాగుతుందన్నారు. చట్ట పరిజ్ఞానం ఉంటే వివిధ సమస్యలను పరిష్కరించుకునేందుకు అవకాశం కలుగుతుందన్నారు. అస్కిహాళ్, గోనాళ్, యక్లాసపూర్లో ఆదివారం రథయాత్ర జరిగింది.
జిల్లా సెషన్స్ న్యాయమూర్తి సతీష్‌సింగ్, న్యాయమూర్తి మహ్మద్ ముజాయిద్ ఉల్లా, అదనపు న్యాయమూర్తి సత్యనారాయణచార్, ప్రభుత్వ న్యాయవాది రాఘవేంద్ర, జిల్లా న్యాయాధీశుల సంఘం అధ్యక్ష, కార్యధ్యక్షులు భానుజ్, ప్రభుదేవ్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు.