టీఆర్ఎస్ విలీనమయ్యే ప్రసక్తేలేదు
జోగిపేట, న్యూస్‌లైన్: కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ విలీనమయ్యే ప్రసక్తేలేదని, ఈ విషయంలో కార్యకర్తలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మాజీ ఎంపీ, టీఆర్ఎస్ నాయకుడు పి.మాణిక్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం జోగిపేటలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ తెలంగాణ విభజనపై కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసినప్పటికీ ఆంధ్ర, రాయల సీమలో జరుగుతున్న ఆందోళనలు సర్దుకునేందుకు మరికొద్ది కాలం పట్టే అవకాశం ఉందన్నారు. కమిటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ మరికొంత కాలం జాప్యం చేయడం ఖాయమన్నారు. హైదరాబాద్‌పై కేంద్రమంత్రి చిరంజీవి చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు.
అందోలులో బలంగా ఉన్నాం
నియోజకవర్గంలో ఇటీవల జరిగిన గ్రామ పంచాయితీ ఎన్నికల్లో సర్పంచ్ స్థానాల సంఖ్యను పెంచుకోలేకపోయినా ఓట్ల శాతాన్ని మాత్రం పెంచుకోగలిగామన్నారు. డబ్బుతో ఓటర్లను ఎవరూ కొనలేరని, ప్రజాబలం టీఆర్ఎస్కే ఉందన్నారు.
3న హరీష్‌రావు పర్యటన
నియోజకవర్గంలోని పుల్కల్, రేగోడ్, అల్లాదుర్గం, అందోలు మండలాల్లో టీఆర్ఎస్ఎల్పీ ఉపనేత హరీష్‌రావు పర్యటించనున్నారని మాణిక్‌రెడ్డి తెలిపారు. మండలాల్లో ముఖ్య నాయకులతో సమావేశం కావడంతోపాటు పార్టీలో చేరికలు కూడా ఉంటాయన్నారు. ముందుగా పుల్కల్ మండలంలో ఉదయం 10.30 గంటలకు పర్యటన ప్రారంభమవుతుందన్నారు.
పంచాయతీ ఎన్నికల్లో మంచి ఫలితాలు
ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో నియోజకవర్గంలో మంచి ఫలితాలే వచ్చాయని సమావేశానికి అధ్యక్షత వహించిన నియోజకవర్గ ఇన్చార్జి పి.కిష్టయ్య పేర్కొన్నారు. నియోజకవర్గంలో చాలా చోట్ల గట్టిపోటీ ఇవ్వగలిగామన్నారు. ఎమ్మెల్యే హరీష్‌రావు పర్యటన ఖరారయితే ముందుకు వెళ్లే పరిస్థితి ఉంటుందన్నారు. హరీష్‌రావు పర్యటనతో టీడీపీ ఖాళీ కావడం ఖాయమన్నారు. టీఆర్ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి డీబీ నాగభూషణం మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల సమయంలో రాష్ట్ర స్థాయి నాయకులు నియోజకవర్గంలో పర్యటిస్తే 50 స్థానాల వరకు గెలుచుకునే వారమన్నారు. సమావేశానికి టీజేఏసీ చెర్మైన్ శివరాజ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రమేశ్ బస్వరాజ్, బ్రహ్మం, వినోద్, జిల్లా నాయకులు బి.నాగభూషణం ముదిరాజ్, బొడ్మట్‌పల్లి మొగులయ్య, మోహన్ రాథోడ్, స్థానిక నాయకులు డాకూర్ గ్రామ సర్పంచ్ ఎ.శంకరయ్య, సీహెచ్.వెంకటేశం, ఎండీ ఖాజా, ఏ గోపాల్ తదితరులు పాల్గొన్నారు.