P Rama Mohana Rao
-
సీఎం వివరణ ఇవ్వాలి: స్టాలిన్
చెన్నై: ఇప్పటికీ తానే తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని అంటూ సీనియర్ ఐఏఎస్ అధికారి పి.రామ్మోహనరావు చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్ష డీఎంకే నేత ఎంకే స్టాలిన్ స్పందించారు. ఈ వ్యవహారంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలని అన్నారు. ఇప్పటికే తానే సీఎస్ గా ఉన్నానని రామ్మోహనరావు చెబుతున్నారని, దీనిపై ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆదాయపన్ను శాఖ కేంద్రం పరిధిలో ఉంటుందని, ఐటీకి సొంతంగా అధికారులు ఉన్నారని అన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నివాసాల్లో గతంలోనూ ఐటీ సోదాలు జరిగాయని స్టాలిన్ పేర్కొన్నారు. జయలలిత తనను ప్రధాన కార్యదర్శిగా నియమించారని, తను బదిలీ చేస్తూ ఇంతవరకు ఉత్తర్వులు ఏమీ ఇవ్వలేదని రామ్మోహనరావు అంతకుముందు అన్నారు. జయలలిత బతికుంటే తన ఇల్లు, కార్యాలయంలోకి ఐటీ అధికారులు ప్రవేశించేవారా అని ప్రశ్నించారు. -
ఎవరీ చీఫ్ సెక్రటరీ? ఏమా కథ?
సరిగ్గా ఐదేళ్ల కిందటి ముచ్చట ఇది. 2011 ఎన్నికల్లో విజయం సాధించి మరోసారి తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత పగ్గాలు చేపట్టారు. ఆ వెంటనే పీ రామ్మోహనరావు ఆమె కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. ఐదేళ్ల తర్వాత జయలలిత మరోసారి అధికారంలోకి వచ్చారు. ఈసారి ఆయన ఏకంగా యావత్ అధికార వర్గాలను విస్మయపరుస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)గా అత్యంత కీలక పగ్గాలు చేపట్టారు. తమిళనాడు ప్రభుత్వం యంత్రాంగ పరంగానే కాదు అధికార కేంద్రపరంగానూ ఆయనను అత్యంత కీలక వ్యక్తిగా భావిస్తారు. జయలలిత మరణం తర్వాత ఆమె పాదాల వద్ద కీలకంగా ప్రముఖంగా కనిపించింది కూడా రామ్మోహనరావే. ఈ నేపథ్యంలో సహజంగానే రామ్మోహనరావు లక్ష్యంగా ఐటీ దాడులు జరగడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపింది. నిజానికి మరో ఏడు నెలల్లో ఆయన రిటైర్ కాబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల భారీ నల్లధనంతో పట్టుబడ్డ టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు శేఖర్‌రెడ్డితో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో రామ్మోహనరావు ఇళ్లపై ఐటీ దాడులు జరగడం ప్రకంపనలు రేపుతోంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రామ్మోహనరావు 1985 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. 1987లో ఆయన తొలిసారి సబ్ కలెక్టర్‌గా సర్వీసులో చేరారు. గత జూలై 8న ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పగ్గాలు చేపట్టారు. జయలలిత పార్టీ అన్నాడీఎంకే అధికారంలోకి వచ్చిన 15 రోజుల్లోనే అప్పటి సీఎస్ కే జ్ఞానదేశికన్‌ను అర్ధంతరంగా తొలగించి.. రామ్మోహనరావును సీస్‌గా నియమించడం పెద్ద చర్చనీయాంశమైంది. ఆయన ఎప్పుడు కేంద్ర సర్వీసులలోకి డిప్యూటేషన్ మీద వెళ్లలేదు కానీ, 2001-03 మధ్యకాలంలో గుజరాత్ మారిటైమ్ బోర్డ్ వైస్ చైర్మన్‌గా పగ్గాలు చేపట్టేందుకు డిప్యూటేషన్ మీద వెళ్లారు. ఐఏఎస్ అధికారిగా పలు హోదాల్లో సేవలు అందించిన ఆయన దివంగత ముఖ్యమంత్రి జయలలితకు, ఆమె నెచ్చెలి శశికళ, ప్రస్తుత సీఎం పన్నీర్ సెల్వంకు కూడా వ్యక్తిగత ఆర్థిక సలహాదారుగా కూడా వ్యవహరించారని చెప్తారు.