ప్రభుత్వాస్పత్రుల్లో ఓపీ, ఓటీలు యథావిధిగా సేవలు
విశాఖపట్నం-మెడికల్, న్యూస్‌లైన్: సీమాంధ్ర జిల్లాల పరిధిలోని అన్ని ప్రభుత్వాస్పత్రుల్లో ఓపీలు, ఆపరేషన్ థియేటర్లు సోమవారం నుంచి యథావిధిగా తెరుచుకోనున్నాయి. పేదలు, ఆరోగ్యశ్రీ రోగుల కష్టాలను దృష్టిలో ఉంచుకొని ఓపీ, ఓటీ విధుల బహిష్కరణను తాత్కాలికంగా విరమిస్తున్నట్టు సమైక్యాంధ్ర మెడికల్ జేఏసీ కన్వీనర్, ప్రభుత్వ వైద్యుల సంఘం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ పి.శ్యామ్‌సుందర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వైద్య కళాశాలలో వైద్య విద్యార్థులకు పాఠ్యాంశ బోధనలు కూడా సోమవారం నుం చి కొనసాగనున్నట్టు పేర్కొన్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా వివిధ రూపా ల్లో రోజూ నిరసన కార్యక్రమాలను ఆస్పత్రుల ఎదుట కొనసాగిస్తామన్నారు. ఈ నెల 21 నుంచి రాష్ట్ర విభజన నిరసిస్తూ చేపట్టనున్న ఆమరణ నిరాహార దీక్షలను తాత్కాలికంగా వాయిదా వేసినట్టు తెలిపారు.
రాష్ట్ర విభజన ప్రకట నకు నిరసనగా పదిహేను రోజులకు పైగా మెడికల్ జేఏసీ సీమాంధ్ర పరిధిలోని 13 జిల్లాల్లో అన్ని ప్రభుత్వాస్పత్రుల్లో ఓపీలు, ఆపరేషన్లను బహిష్కరించిన విషయం తెలిసిందే. దీంతో అన్ని ఆస్పత్రుల్లో ఓపీ, ఓటీ వైద్యసేవలు స్తంభించాయి. ప్రస్తుతం తమ విధుల బహిష్కరణను విరమించడంతో సోమవారం నుంచి అన్ని పీహెచ్సీ, సీహెచ్‌సీ, ఏరియా, జిల్లా ఆస్పత్రులతోపాటు ఈఎస్ఐ ఆస్పత్రుల్లో కూడా వైద్య సేవలు యథావిధిగా ప్రారంభం కానున్నాయి. కేజీహెచ్‌తోపాటు ఆంధ్రవైద్య కళాశాల పరిధిలోని అనుబంధ ఆస్పత్రులన్నింటిలో ఓపీ, ఓటీ విధులు సోమవారం నుంచి ప్రారంభం కానున్నట్టు కేజీ హెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.మధుసూదన్‌బాబు తెలిపారు. రోగులు యథావిధిగా ప్రభుత్వాస్పత్రులకు వైద్యసేవల కోసం హాజరు కావాలని ఆయన కోరారు.