మంత్రి విశ్వరూప్ రాజీనామా!
హైదరాబాద్: రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమాభివృద్ధి శాఖా మంత్రి పినిపే విశ్వరూప్ తన పదవికి రాజీనామా చేశారు. గురువారం మధ్యాహ్నం రాజభవన్ లో గవర్నర్ నరసింహన్ ను కలిసిన విశ్వరూప్ రాజీనామాను అందచేశారు. తన రాజీనామాను ఆమోదించాలని గవర్నర్ ను మంత్రి విశ్వరూప్ కోరినట్టు సమాచారం.
రాష్ట్ర విభజనను ఉప సంహరించుకుంటూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రకటన విడుదల చేయాలని సెప్టెంబర్ 7 తేదిన భీమవరంలో పినిపే విశ్వరూప్ డిమాండ్ చేశారు. సమైక్యాంధ్ర ఉద్యమ నేతల నుంచి రాజీనామాకు ఒత్తిడి పెరగడం, విభజనకే కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపుతోందనే వార్తల నేపథ్యంలో మంత్రి విశ్వరూప్ రాజీనామా తాజాగా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
గతంలో విశ్వరూప్ మాట్లాడుతూ నవంబర్ 1 లోగా విభజన ఉపసంహరణ ప్రకటన వెలువడకపోతే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, పదవులకు రాజీనామా చేస్తానని తెలిపిన సంగతి తెలిసిందే. సమైక్యాంధ్ర ప్రకటన వస్తుందని, అప్పటి వరకూ వేచి చూడాలని ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి చేసిన విజ్ఞప్తి మేరకు కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం కోసం వేచి చూశారు. అయితే కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఎటువంటి సిగ్నల్ రాకపోవడంతో రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.