padagaya
-
తప్పు తప్పే.. పెద్ద తప్పే..
ముక్కంటి మన్నించు! పాదగయ క్షేత్రంలో అపచారం నిజమే ఒప్పుకున్న అర్చకులు ఆగ్రహం వ్యక్తం చేసిన పాలకమండలి కుక్కుటేశ్వరుడినికి ప్రాయశ్చిత పూజలు పిఠాపురం : ప్రముఖ పుణ్యక్షేత్రం పాదగయ కుక్కుటేశ్వరస్వామి వారి దేవాలయంలో వందేళ్ల సంప్రదాయాన్ని పాటించకుండా అపచారం చేశామని ఆలయ అధికారులు అర్చకులు ఒప్పుకున్నారు. అపచారం ప్రక్షాళన కోసం స్వామివారికి సంప్రోక్షణ, ప్రాయశ్చిత పూజలు నిర్వహించారు. ‘పాదగయ క్షేత్రంలో అపచారం’ అనే శీర్షికన ‘సాక్షి’ ప్రధాన సంచికలో మంగళవారం ప్రచురితమైన వార్తకు ఆలయ అధికారులు స్పందించారు. ఆలయ ట్రస్టుబోర్డు చైర్మన్ కొండేపూడి ప్రకాష్ అధ్యక్షతన ఆలయ వేదపండితులు ద్విభాష్యం సుబ్రహ్మణ్య శర్మ మంగళవారం ఆలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో జరిగిన అపచారంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు చోటుచేసుకోకుండా తగిన చర్యలు తీసుకుంటామని అర్చకుల తరఫున అధికారులకు హామీ ఇచ్చారు. కొన్ని వందల ఏళ్లుగా ఈ ఆలయంలో గ్రహణం రోజున స్వామివారికి పట్టు స్నానం చేయించి అనంతరం అభిషేకాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. దేశంలో అన్ని ఆలయాలు గ్రహణం సందర్భంగా మూసివేసినా కాళహస్తి ఆలయంతో పాటు ఈ ఆలయం మాత్రం తెరిచి ఉంచి గ్రహణం ఉన్నంత సేపు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించాల్సి ఉందన్నారు. గ్రహణం పూర్తయిన అనంతరం విడుపు స్నానం చేయించి ప్రత్యేక పూజల అనంతరం భక్తులకు స్వామివారి దర్శనం కల్పించాల్సి ఉందన్నారు. అయితే ఆలయ అర్చకులు ఈ విషయాన్ని అనివార్య కారణాల వల్ల పట్టించుకోలేదన్నారు. జరిగిన అపచారానికి చింతిస్తున్నామని, స్వామివారికి ప్రాయశ్చితపూజలు సంప్రోక్షణలు నిర్వహించామన్నారు. ఆలయ ఈఓ చందక దారబాబు జరిగిన అపచారానికి తాను పూర్తి బాధ్యత వహిస్తున్నానన్నారు. ఆలయ అర్చకులు ఈ విషయాన్ని తమ దృష్టికి తీసుకురావాల్సి ఉందని వారు నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. ఆలయ ట్రస్టుబోర్టు చైర్మన్ కొండేపూడి ప్రకాష్ మాట్లాడుతూ పూర్వం నుంచి వస్తున్న ఆచారాన్ని మంటగలపడం దారుణమన్నారు. ఈ విషయంపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్టు ఆయన తెలిపారు. -
పాదగయ.. అద్భుతమయా!
ఈ ఏడాది ఆదాయం రూ.1.41 కోట్లు పెరిగిన భక్తుల సంఖ్య ఇక నుంచి ‘ఏసీ స్థాయి హోదా’ పిఠాపురం : ప్రముఖ పుణ్యక్షేత్రం పాదగయ ఆదాయంలో ప్రముఖ ఆలయాల చెంతకు చేరింది. దేవాదాయ ధర్మాదాయ చట్టం 6(ఏ) నిబంధనల ప్రకారం గత మూడేళ్ల నుంచి రూ. కోటికి పైగా ఆదాయం ఆర్జించడంతో కార్యనిర్వహణాధికారి స్థాయి నుంచి అసిస్టెంట్ కమిషనర్ స్థాయికి చేరినట్టు ఈఓ చందక దారబాబు తెలిపారు. జిల్లాలో ఏసీ స్థాయి ఆలయాల్లో అంతర్వేది, తలుపులమ్మలోవ, మందపల్లి, అప్పనపల్లి ఆలయాలు ఉండగా ఈ ఏడాది నుంచి పిఠాపురం పాదగయ క్షేత్రం వాటి సరసన చేరింది. మూడేళ్ల క్రితం వరకు రూ.90 లక్షలు దాటని ఆదాయం.. వరుసగా మూడేళ్ల నుంచి రూ.కోటి దాటడంతో పాటు స్వామివారిని దర్శించుకునే భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. 2013– 2014 వార్షికాదాయం రూ.90 లక్షల వరకు ఉండగా.. 2014–2015 నుంచి ఆదాయం ఒక్కసారిగా పెరగడం ప్రారంభమైంది. గత ఏడాది వార్షికాదాయం ఏకంగా రూ.1.63 కోట్లు లభించింది. వీటిలో హుండీల ద్వారా రూ.40 లక్షలు, టికెట్ల ద్వారా రూ.60 లక్షలు లభించగా మరో రూ.63 లక్షలు ఇతర మార్గాల ద్వారా లభ్యమైనట్టు అధికారులు తెలిపారు. అలాగే 2013– 2014లో 15 నుంచి 18 లక్షల మంది వరకు ఉండే భక్తులు 2014–2015 నుంచి ఒక్కసారిగా పెరిగి.. ఈ ఏడాది సుమారు 24 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్టు అధికారులు తెలిపారు. గత ఐదేళ్ల నుంచి ఆలయ వివరాలతో వెబ్సైట్ ప్రాంభించడంతో దేశ, విదేశాల నుంచి భక్తుల రాక పెరిగింది. తమిళనాడు, మహారాష్ట్ర, ఒడిశా, కేరళ, కర్నాటక తదితర రాష్ట్రాల నుంచి భక్తులు అధికంగా తరలివస్తుండడంతో ఆదాయం అనుకోని రీతిలో పెరిగినట్టు ఆలయ ఈఓ చందక దారబాబు తెలిపారు. ఆదాయం పెరుగుదల ఇలా 2013– 2014– రూ 89,92,000 2014– 2015– రూ 1,10,60,639 2015– 2016– రూ 1,63,29,819 2016–2017– రూ 1.41,47,766 పెరిగిన శ్రీసంస్థానం ఆదాయం పిఠాపురానికి చెందిన శ్రీసంస్థానం సత్రం ఆదాయం మూడేళ్లుగా పెరిగింది. 2013–2014లో రూ.11.50 లక్షలు ఉండే ఆదాయం 2014– 2015లో రూ.49 లక్షలకు చేరుకోగా, 2015–2016 రూ.25 లక్షలు, 2016- 2017లో రూ.29 లక్షలు లభించిందని అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటి వరకు 6బీ కేటగిరిలో ఉండే ఈసత్రం గత ఏడాది నుంచి 6ఏ కేటగిరిలోకి వచ్చిందని ఈఓ చందక దారబాబు తెలిపారు. ఈ సంస్థానానికి సంబంధించి తొండంగి మండలంలో సుమారు 500 ఎకరాలకు పైగా భూములు ఉండగా వాటి ద్వారా శిస్తు రూపంలో ఆదాయం లభిస్తోంది. -
పాదగయ గోశాలకు రక్షణ కరువు
పిఠాపురం : స్థానిక పాదగయ కుక్కుటేశ్వరస్వామి దేవస్థానంలో గోశాలలో అప్పుడే పుట్టిన లేగదూడలు కుక్కల బారిన పడి ప్రాణాలు వదులుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాదగయ పుష్కరిణికి తూర్పు వైపున ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన షెడ్లలో గోశాల నిర్వహిస్తున్నారు. వీటిలో సుమారు 16 గోవులు ఉన్నాయి. వీటి పోషణకు భక్తులు రూ.లక్షల్లో విరాళాలు సమర్పిస్తుంటారు. పలు పర్వదినాలలో సైతం ఈ గోవులకు పూజలు చేస్తుంటారు. రాత్రిళ్లు కాపలా ఉండేవారు నిర్లక్ష్యం వహిస్తుండడంతో కుక్కలు ఆలయ పరిసరాలు, గోశాలలోకి ప్రవేశించి లేగదూడలను పీక్కు తీనేస్తున్నాయి. ఇప్పటివరకూ మూడు దూడలు చనిపోయినట్టు గోసంరక్షణ సమితి సభ్యులు గుర్తించారు. ఈ విషయంపై ఆలయ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని గోదాతలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు లేగదూడల మరణాలపై విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుని గోవులకు రక్షణ కల్పించాలని భక్తులు కోరుతున్నారు. ఇది వాస్తవమే... ఈ విషయంపై ఆలయ ఈఓ చందక దారబాబును వివరణ కోరగా లేగదూడలను కుక్కలు పీక్కుతినడం వాస్తవమేనని అంగీకరించారు. ఈ విషయం తన దృష్టికి వచ్చిందని, విచారణ చేసి చర్యలు తీసుకుంటామన్నారు. -
పాదగయక్షేత్రంలో క్రికెటర్
పిఠాపురంలోని చారిత్రక ప్రాశస్త్యం కలిగిన పాదగయక్షేత్రాన్ని ప్రముఖ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ సోమవారం సందర్శించారు. కుక్కుటేశ్వరస్వామి వారికి కుటుంబసభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ పూజారులు వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు.