పాదగయ.. అద్భుతమయా!
పాదగయ.. అద్భుతమయా!
Published Wed, Apr 12 2017 10:55 PM | Last Updated on Thu, Sep 27 2018 4:42 PM
ఈ ఏడాది ఆదాయం రూ.1.41 కోట్లు
పెరిగిన భక్తుల సంఖ్య
ఇక నుంచి ‘ఏసీ స్థాయి హోదా’
పిఠాపురం : ప్రముఖ పుణ్యక్షేత్రం పాదగయ ఆదాయంలో ప్రముఖ ఆలయాల చెంతకు చేరింది. దేవాదాయ ధర్మాదాయ చట్టం 6(ఏ) నిబంధనల ప్రకారం గత మూడేళ్ల నుంచి రూ. కోటికి పైగా ఆదాయం ఆర్జించడంతో కార్యనిర్వహణాధికారి స్థాయి నుంచి అసిస్టెంట్ కమిషనర్ స్థాయికి చేరినట్టు ఈఓ చందక దారబాబు తెలిపారు. జిల్లాలో ఏసీ స్థాయి ఆలయాల్లో అంతర్వేది, తలుపులమ్మలోవ, మందపల్లి, అప్పనపల్లి ఆలయాలు ఉండగా ఈ ఏడాది నుంచి పిఠాపురం పాదగయ క్షేత్రం వాటి సరసన చేరింది. మూడేళ్ల క్రితం వరకు రూ.90 లక్షలు దాటని ఆదాయం.. వరుసగా మూడేళ్ల నుంచి రూ.కోటి దాటడంతో పాటు స్వామివారిని దర్శించుకునే భక్తుల సంఖ్య భారీగా పెరిగింది.
2013– 2014 వార్షికాదాయం రూ.90 లక్షల వరకు ఉండగా.. 2014–2015 నుంచి ఆదాయం ఒక్కసారిగా పెరగడం ప్రారంభమైంది. గత ఏడాది వార్షికాదాయం ఏకంగా రూ.1.63 కోట్లు లభించింది. వీటిలో హుండీల ద్వారా రూ.40 లక్షలు, టికెట్ల ద్వారా రూ.60 లక్షలు లభించగా మరో రూ.63 లక్షలు ఇతర మార్గాల ద్వారా లభ్యమైనట్టు అధికారులు తెలిపారు. అలాగే 2013– 2014లో 15 నుంచి 18 లక్షల మంది వరకు ఉండే భక్తులు 2014–2015 నుంచి ఒక్కసారిగా పెరిగి.. ఈ ఏడాది సుమారు 24 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్టు అధికారులు తెలిపారు. గత ఐదేళ్ల నుంచి ఆలయ వివరాలతో వెబ్‌సైట్ ప్రాంభించడంతో దేశ, విదేశాల నుంచి భక్తుల రాక పెరిగింది. తమిళనాడు, మహారాష్ట్ర, ఒడిశా, కేరళ, కర్నాటక తదితర రాష్ట్రాల నుంచి భక్తులు అధికంగా తరలివస్తుండడంతో ఆదాయం అనుకోని రీతిలో పెరిగినట్టు ఆలయ ఈఓ చందక దారబాబు తెలిపారు.
ఆదాయం పెరుగుదల ఇలా
2013– 2014– రూ 89,92,000
2014– 2015– రూ 1,10,60,639
2015– 2016– రూ 1,63,29,819
2016–2017– రూ 1.41,47,766
పెరిగిన శ్రీసంస్థానం ఆదాయం
పిఠాపురానికి చెందిన శ్రీసంస్థానం సత్రం ఆదాయం మూడేళ్లుగా పెరిగింది. 2013–2014లో రూ.11.50 లక్షలు ఉండే ఆదాయం 2014– 2015లో రూ.49 లక్షలకు చేరుకోగా, 2015–2016 రూ.25 లక్షలు, 2016- 2017లో రూ.29 లక్షలు లభించిందని అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటి వరకు 6బీ కేటగిరిలో ఉండే ఈసత్రం గత ఏడాది నుంచి 6ఏ కేటగిరిలోకి వచ్చిందని ఈఓ చందక దారబాబు తెలిపారు. ఈ సంస్థానానికి సంబంధించి తొండంగి మండలంలో సుమారు 500 ఎకరాలకు పైగా భూములు ఉండగా వాటి ద్వారా శిస్తు రూపంలో ఆదాయం లభిస్తోంది.
Advertisement