అనారోగ్యంతోనే పద్మ మృతి: డీసీపీ
హైదరాబాద్: అసిఫ్ నగర్లో పద్మ అనే మహిళది లాకప్ డెత్ కాదని.. అనారోగ్యంతోనే మరణించిందని డీసీపీ సత్యానారాయణ అన్నారు. పద్మపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించలేదని పోలీసులు వివరణ ఇచ్చారు. అనారోగ్యంగా ఉన్న పద్మను విచారణలోకి తీసుకున్న ఎస్ఐపై చర్యలు తీసుకుంటామని డీసీపీ సత్యనారాయణ ఈ సందర్భంగా తెలిపారు. ఓ ఆసుపత్రిలో చోరీకి పాల్పడినట్లు సీసీటీవీ ఫుటేజీ ఆధారాలున్నాయంటూ.. అసిఫ్ నగర్ పోలీసులు పద్మను వారం రోజుల క్రితం అదుపులోకి తీసుకున్నారు. అప్పటి నుంచి చోరీకి సంబంధించి ఆమెను తీవ్రంగా హింసించారనే ఆరోపణలు ఉన్నాయి.
ఈ క్రమంలోనే పోలీసుల వేధింపులు తాళలేక శనివారం అర్ధరాత్రి ఆమె అపస్మారక స్థితికి చేరుకుంది. దీంతో పోలీసులు గుట్టుచప్పుడు కాకుండా బాధిత మహిళను హుటాహుటిన ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందింది. పోలీసుల విచారణలోనే పోలీస్ స్టేషన్లో పద్మ మృతి చెందిందని.. అనంతరం ఉస్మానియాకు తరలించారని సమాచారం. అయితే.. పద్మది లాకప్ డెత్ కాదని, అనారోగ్యంతోనే మృతిచెందిందని పోలీసులు వివరణ ఇచ్చారు.