padmavathi temple
-
ప్రైవేటు భక్తి!
తిరుమల శ్రీవారితో పాటు తిరుచానూరు పద్మావతి అమ్మవారి దర్శనం కోసం తిరుపతికి వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. సామాన్య భక్తులు సాధారణంగా టీటీడీ వసతి సముదాయాల్లో బస చేసేందుకు మొగ్గు చూపుతారు. రద్దీ పెరిగిపోవడంతో వసతి దొరక్క ఇప్పటికే సామాన్య భక్తులు అవస్థలు పడుతున్నారు. ఈ తరుణంలో టీటీడీ తాజా నిర్ణయం పలు విమర్శలకు తావిస్తోంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా, అత్యాధునిక సదుపాయాలతో నిర్మించిన పద్మావతి నిలయాన్నిప్రైవేటు నిర్వహణకు అప్పగించాలనుకోవడంపై భక్తులు మండిపడుతున్నారు. ‘సామాన్య భక్తుల సేవే పరమావధి’ అంటూ ఉపన్యాసాలు ఇస్తున్న టీటీడీ వ్యాపార ధోరణితోవ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. చిత్తూరు, తిరుమల: వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన టీటీడీ తాజాగా తీసుకున్న నిర్ణయం భక్తుల ఆగ్రహానికి గురవుతోంది. రూ.కోట్లతో భక్తుల సౌకర్యార్థం నిర్మించిన వసతి సముదాయాన్ని ప్రైవేటు నిర్వహణకు అప్పగించేందుకు రంగం సిద్ధం చేసింది. ఆదాయమే పరమావధిగా టీటీడీ వ్యవహరిస్తోందంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సామాన్య భక్తుల వసతి కోసం తిరుచానూరు సమీపంలో సుమారు రూ.75 కోట్లతో శ్రీపద్మావతి అతిథి గృహాన్ని టీటీడీ నిర్మించింది. ఐదు అంతస్థులతో పాటు నాలుగు డార్మిటరీ హాళ్లు, 200 గదులతో ఈ భవనాన్ని ఏర్పాటుచేసింది. భవనాన్ని ప్రారంభించేందుకు టీటీడీ సన్నాహాలు కూడా చేసింది. ఎన్నికల కోడ్ రావడంతో ఈ కార్యక్రమాన్ని తాత్కాలికంగా పెండింగ్‌లో ఉంచింది. అంతకు ముందే గదులకు అద్దెను సైతం టీటీడీ పాలకమండలి నిర్ణయించింది. అనూహ్యంగా ప్రైవేటీకరణ మొగ్గు ప్రపంచంలో టీటీడీ అతి పెద్ద ఆధ్యాత్మిక సంస్థగా పేరుగాంచింది. భక్తుల సేవే భగవంతుని సేవగా భావించి సామాన్య భక్తుల సౌకర్యాల కోసం కోట్లాది రూపాయలు వెచ్చి స్తోంది. తాజాగా వ్యాపార దృక్పథంతో వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే విష్ణు నివాసం, శ్రీనివాసం లాంటి అతిపెద్ద వసతి సముదాయాలను టీటీడీనే నిర్వహణ బాధ్యతలను చూస్తోంది. పద్మావతి నిలయాన్ని మాత్రం ప్రైవేటీకరణ చేయడంపై పలు అనుమానాలకు తావిస్తోంది. మొదటి నుంచి పద్మావతి భవనం ద్వారా భక్తులకు మరింత మెరుగైన సేవలు అందిస్తామని టీటీడీ అధికారులు చెప్పుకొచ్చారు. అనూహ్యంగా అధికారులు ఇలా ప్రైవేటు నిర్వహణ వైపు మొగ్గుచూపడంపై పలు సందేహాలు తలెత్తుతున్నాయి. అధికార పార్టీ నాయకులకు లబ్ధి చేకూర్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆరోపణలు కూడా ఉన్నాయి. అసాంఘిక కార్యక్రమాలకు అడ్డా.. పద్మావతి నిలయాన్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే ఏడాదికి రూ.3.84కోట్ల ఆదాయం వస్తుందని టీటీడీ అంచనా వేస్తోంది. వీటి నిర్వహణ కోసం టెండర్లను కూడా పిలిచింది. భక్తుల కానుకల ద్వారా కోటానుకోట్ల ఆదాయం పొందుతున్న టీటీడీ, సౌకర్యాల కల్పనలో వ్యాపార దృక్పథంలో యోచించడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయంతో భవనం అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారడంతో పాటు సామాన్య భక్తులకు తగిన ప్రాధాన్యం లభించదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శాంతి భద్రతలకు విఘాతం పద్మావతి నిలయాన్ని ప్రైవేట్ వ్యక్తుల చేతి లో పెడితే టీటీడీ పరుపుపోవడం ఖాయమని ఆధ్యాత్మిక సంఘాల ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోట్ల రూపాయలను వెచ్చించి టెండరు దక్కించుకునే వ్యక్తి తన ఆదాయాన్ని పెంచుకోవడానికే ప్రాధాన్యం ఇస్తాడని వారు చెబుతున్నారు. ఒక్కసారి టీటీడీ నుంచి భవనం ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి వెళ్తే, టీటీడీ కీర్తిప్రతిష్టలు వారి చేతిలోకి వెళ్లినట్టేనంటున్నారు. ఆధ్యాత్మిక క్షేత్రంలో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారే ప్రమాదమూ లేకపోలేదని వారు హెచ్చరిస్తున్నారు. భక్తుల కోసం నిర్మించిన భవనాన్ని టీటీడీ నిర్వహించాలే తప్ప, ఇలా ఆదాయం కోసం ప్రైవేటు నిర్వహణకు అప్పగిస్తే ఉద్యమిస్తామని వారు స్పష్టంచేస్తున్నారు. -
పసందుగా పదేళ్లు!
... కంప్లీట్ అయ్యాయి... హీరోయిన్గా దీపికా పదుకోన్ బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి. ఫరా ఖాన్ దర్శకత్వంలో షారుక్‌ఖాన్ హీరోగా నటించిన ‘ఓం శాంతి ఓం’ ద్వారా ఈ సొట్టబుగ్గల సుందరి హిందీ తెరపై మెరిసిన విషయం గుర్తుండే ఉంటుంది. ఆ సినిమా తర్వాత ఈ సౌత్ బ్యూటీ వెనక్కి తిరిగి చూసుకోలేనంత బిజీ అయ్యారు. 2007 నవంబర్ 9న ఆ చిత్రం విడుదలైంది. హీరోయిన్గా పదేళ్లు కెరీర్ విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా దీపిక తిరుపతి వెళ్లారు. వెంకటేశ్వరుడి ఆశీస్సులు పొందారు. దీపిక తిరుమల వెళ్లిన ఫొటోను ఇన్సెట్లో చూడొచ్చు. తిరుపతిలోని పద్మావతి టెంపుల్ని కూడా సందర్శించారామె. లేటెస్ట్గా సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వంలో దీపికా పదుకోన్, రణ్వీర్ సింగ్, షాహిద్ కపూర్ ముఖ్యపాత్రల్లో రూపొందిన ‘పద్మావతి’ని డిసెంబర్ 1న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. పద్మావతి పేరుతో సినిమా చేశారు కాబట్టి, ప్రత్యేకంగా ఆ అమ్మవారి గుడికి వెళ్లి ఉంటారని ఊహించవచ్చు. ఆ సంగతి పక్కన పెడితే... గడచిన పదేళ్లలో ‘లవ్ ఆజ్ కల్, హౌస్‌ఫుల్, రేస్ 2, చెన్నై ఎక్స్‌ప్రెస్, పీకూ, బాజీరావ్ మస్తానీ’ వంటి హిట్ చిత్రాల్లో ఆమె నటించారు. గతేడాది ‘ట్రిపులెక్స్: రిటర్న్ ఆఫ్ గ్జాండర్ కేజ్’ చిత్రం ద్వారా ఆమె హాలీవుడ్‌కి ఎంట్రి ఇచ్చిన సంగతి తెలిసే ఉంటుంది. రణబీర్ కపూర్‌తో లవ్, బ్రేకప్ తర్వాత కొంత డిప్రెషన్‌కి గురయ్యారు. ఆ సమయంలో సైకాలజిస్ట్‌ని కలసి, డిప్రెషన్ నుంచి బయటపడ్డారు. ఏమైతేనేం.. ప్రొఫెషనల్‌గా... పర్సనల్‌గా ఇప్పుడు దీపిక మంచి స్పేస్‌లో ఉన్నారు. -
వైభవంగా ప్రారంభమైన పవిత్రోత్సవాలు
– శాస్త్రోక్తంగా పవిత్ర ప్రతిష్ట తిరుచానూరు : తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో 3రోజుల పాటు నిర్వహించే వార్షిక పవిత్రోత్సవాలు బుధవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఏడాది పొడవునా ఆలయంలో నిర్వహించే నిత్యకైంకర్యాలు, వార, మాస, వార్షిక ఉత్సవాలు, ఇతరత్రా పూజాధి కార్యక్రమాల్లో తెలిసో తెలియకో జరిగిన తప్పుల వల్ల ఏర్పడ్డ దోష నివారణకు పవిత్రోత్సవాలు నిర్వహించడం అనాదిగా వస్తున్న ఆచారం. ఇందులో భాగంగా బుధవారం ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొల్పి నిత్యకైంకర్యాలు నిర్వహించారు. ఉదయం 7గంటలకు శ్రీకృష్ణస్వామి ముఖమండపంలో ఏర్పాటుచేసిన ప్రత్యేక యాగశాలకు శ్రీపద్మావతి అమ్మవారు, రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణుడు, శ్రీదేవి భూదేవి సమేత శ్రీసుందరరాజస్వామి, విశ్వక్సేనులు, చక్రతాళ్వార్లను వేంచేపుగా తీసుకొచ్చి కొలువుదీర్చారు. ఉదయం 8.30గంటలకు యాగశాలలో పవిత్ర జలంతో నిండిన కలశాన్ని ఆలయ అర్చకులు నెలకొల్పి, పాంచరాత్ర ఆగమ శాస్త్రోక్తంగా ద్వారతోరణ ద్వజకుంభ ఆవాహనం, చక్రాది మండలపూజ, చతుస్థానార్చన, అగ్నిప్రతిష్ట, హోమం, పవిత్ర ప్రతిష్ట చేశారు. మధ్యాహ్నం 2గంటలకు శ్రీపద్మావతి అమ్మవారికి పాలు, పెరుగు, తేనె కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో ఆలయ అర్చకులు స్నపన తిరుమంజనం నిర్వహించారు. సాయంత్రం 5 నుంచి రాత్రి 8గంటల వరకు యాగశాలలో హోమాధి కార్యక్రమాలు నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో ఆలయ డెప్యూటీ ఈవో చిన్నంగారి రమణ, పేష్కార్ రాధాకృష్ణ, సూపరింటెండెంట్లు రవి, మాధవకుమార్, ఆర్జితం ఇన్స్పెక్టర్ గురవయ్య, ఏవీఎస్వో రామకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు. పవిత్రోత్సవాల్లో నేడు : పవిత్రోత్సవాల్లో భాగంగా రెండవరోజైన గురువారం ఉదయం 7నుంచి 11.30గంటల వరకు యాగశాలలో హోమపూజలు, 11.30గంటలకు పవిత్ర సమర్పణ, సాయంత్రం 5నుంచి 8గంటల వరకు హోమ పూజలు జరుగుతాయి. -
తిరుమల తరహాలో ఆర్జిత సేవా టికెట్లు
– అధికారులతో తిరుపతి జేఈవో తిరుపతి అర్బన్ : టీటీడీ పరిధిలోని తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో కూడా తిరుమల తరహాలో ఆర్జిత సేవా టికెట్లను జారీ చేయనున్నట్టు తిరుపతి జేఈవో పోలా భాస్కర్ వెల్లడించారు. తిరుపతిలోని ఏడీ బిల్డింగ్‌లో గురువారం ఆయన అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్జిత సేవల టికెట్లతో పాటు తిరుచానూరులో నిర్వహిస్తున్న నిత్యపూజలు, వారపు సేవలు, వార్షిక సేవలు భక్తులకు అందుబాటులో ఉండేలా ఈ–దర్శన్ కౌంటర్లలో టికెట్లను విక్రయించనున్నట్టు తెలిపారు. ఇందుకోసం అధికారులు ఐటీ అప్లికేషన్‌ను రూపొందించుకోవాలని సూచించారు. అమ్మవారి సేవల సమగ్ర సమాచారాన్ని టీటీడీ వెబ్సైట్లో ఉంచాలన్నారు. ఆమేరకు ఆలయం ముందు ప్రదర్శన బోర్డులను ఏర్పాటు చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. వచ్చే గురువారం నుంచి అమ్మవారి ఆలయంలో నిర్వహించే తిరుప్పావడ సేవకు సంబంధించిన టికెట్లను బుధవారం ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో తిరుచానూరు ఆలయ డిప్యూటీ ఈవో చిన్నంగారి రమణ, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ వేణుగోపాల్, డిప్యూటీ ఈఈ ఉమాశంకర్, సీఏవో రవిప్రసాద్, ఏవీఎస్వో రామకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
అమ్మవారి ఆలయం వద్ద ముమ్మర తనిఖీలు
తిరుచానూరు : స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యగా పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయ పరిసరాల్లోని దుకాణాలు, వాణిజ్య సముదాయాల వద్ద తిరుచానూరు సీఐ కేవీ.సురేంద్రనాయుడు, ఎస్ఐ చిరంజీవి ఆధ్వర్యంలో బాంబు, డాగ్ స్క్వాడ్ సిబ్బంది తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమల, తిరుచానూరు తదితర ఆలయాలకు తీవ్రవాదుల ముప్పు ఉన్న నేపథ్యంలో తిరుపతి అర్బన్ ఎస్పీ ఆర్.జయలక్ష్మి ఆదేశాల మేరకు తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. ఆలయ పరిసరాల్లో అనుమానితులు కనబడినా, బ్యాగులు వంటివి గుర్తించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని దుకాణాదారులకు ఆయన విజ్ఞప్తి చేశారు.