ఆలయంలోని యాగశాలలో హోమ పూజలు చేస్తున్న ఆలయ అర్చకులు
– శాస్త్రోక్తంగా పవిత్ర ప్రతిష్ట
తిరుచానూరు :
తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో 3రోజుల పాటు నిర్వహించే వార్షిక పవిత్రోత్సవాలు బుధవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఏడాది పొడవునా ఆలయంలో నిర్వహించే నిత్యకైంకర్యాలు, వార, మాస, వార్షిక ఉత్సవాలు, ఇతరత్రా పూజాధి కార్యక్రమాల్లో తెలిసో తెలియకో జరిగిన తప్పుల వల్ల ఏర్పడ్డ దోష నివారణకు పవిత్రోత్సవాలు నిర్వహించడం అనాదిగా వస్తున్న ఆచారం. ఇందులో భాగంగా బుధవారం ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొల్పి నిత్యకైంకర్యాలు నిర్వహించారు. ఉదయం 7గంటలకు శ్రీకృష్ణస్వామి ముఖమండపంలో ఏర్పాటుచేసిన ప్రత్యేక యాగశాలకు శ్రీపద్మావతి అమ్మవారు, రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణుడు, శ్రీదేవి భూదేవి సమేత శ్రీసుందరరాజస్వామి, విశ్వక్సేనులు, చక్రతాళ్వార్లను వేంచేపుగా తీసుకొచ్చి కొలువుదీర్చారు. ఉదయం 8.30గంటలకు యాగశాలలో పవిత్ర జలంతో నిండిన కలశాన్ని ఆలయ అర్చకులు నెలకొల్పి, పాంచరాత్ర ఆగమ శాస్త్రోక్తంగా ద్వారతోరణ ద్వజకుంభ ఆవాహనం, చక్రాది మండలపూజ, చతుస్థానార్చన, అగ్నిప్రతిష్ట, హోమం, పవిత్ర ప్రతిష్ట చేశారు. మధ్యాహ్నం 2గంటలకు శ్రీపద్మావతి అమ్మవారికి పాలు, పెరుగు, తేనె కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో ఆలయ అర్చకులు స్నపన తిరుమంజనం నిర్వహించారు. సాయంత్రం 5 నుంచి రాత్రి 8గంటల వరకు యాగశాలలో హోమాధి కార్యక్రమాలు నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో ఆలయ డెప్యూటీ ఈవో చిన్నంగారి రమణ, పేష్కార్ రాధాకృష్ణ, సూపరింటెండెంట్లు రవి, మాధవకుమార్, ఆర్జితం ఇన్‌స్పెక్టర్ గురవయ్య, ఏవీఎస్‌వో రామకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.
పవిత్రోత్సవాల్లో నేడు :
పవిత్రోత్సవాల్లో భాగంగా రెండవరోజైన గురువారం ఉదయం 7నుంచి 11.30గంటల వరకు యాగశాలలో హోమపూజలు, 11.30గంటలకు పవిత్ర సమర్పణ, సాయంత్రం 5నుంచి 8గంటల వరకు హోమ పూజలు జరుగుతాయి.