అయ్యయ్యో... నోరు జారె!
‘పెదవి దాటని మాటకు ప్రభువు నీవు. పెదవి దాటిన మాటకు బానిసవు నీవు’ అనే సామెత తెలిసే ఉంటుంది. ప్రస్తుతం ప్రియాంకా చోప్రా ఎదుర్కొంటోన్న విమర్శలకు ఈ సామెత అక్షరాలా సరిపోతుంది. పెదవి నుంచి వచ్చే ప్రతి మాటా బ్యాలెన్డ్స్‌గా ఉండాలి. నోరు జారామా? అంతే సంగతులు. ప్రియాంకా చోప్రా ఈ తప్పే చేశారు. ఆ విషయంలోకి వస్తే... సిక్కిం నుంచి వలస వెళుతున్న క్రమంలో ఇద్దరు చిన్నారుల మనోభావాల నేపథ్యంలో ఆమె ‘పహూనా’ అనే సినిమా తీశారు.
ఈ చిత్రాన్ని టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించారు. ఉద్వేగపూరితంగా సాగే ఈ సినిమాకి ప్రశంసలు దక్కాయి. మంచి సినిమా నిర్మించారని ప్రియాంకను అక్కడివాళ్లు అభినందించారు. ఆ తర్వాత ఈ బ్యూటీ ప్రెస్మీట్లో పాల్గొన్నారు. ‘‘సిక్కిం రాష్ట్రంలో అల్లర్లు ఎక్కువ. అల్లకల్లోలంగా ఉంటుంది. మేం ఎంతో కష్టపడి ఈ సినిమా తీశాం. సిక్కింలో సినిమాలు నిర్మించే వసతి లేదు. అసలిక్కడ ఫిల్మ్ ఇండస్ట్రీయే లేదు.
ఈ ప్రాంతం నుంచి వచ్చిన తొలి సినిమా మాదే కావడం హ్యాపీగా ఉంది’’ అని ఆ మీడియా సమావేశంలో అన్నారు ప్రియాంక. అంతే... దుమారం రేగింది. ప్రశాంతతకు కేరాఫ్ అడ్రస్‌లాంటి సిక్కిం అల్లకల్లోలంగా ఉంటుందా? అని అక్కడివాళ్లు సోషల్ మీడియా సాక్షిగా ఆమెపై మాటల తూటాలు విసిరారు. సిక్కింలో ఫిల్మ్ ఇండస్ట్రీ లేదని ఎవరన్నారు? ఇప్పటికే మంచి సినిమాలు బోలెడన్ని వచ్చాయి. మీది ఫస్ట్ మూవీయా? అంటూ మరో వివాదం. నిజమే. అక్కడ కథ, ఆచార్య వంటి మంచి చిత్రాలు రూపొందాయి. ఈ ఏడాది విడుదలైన సినిమాల్లో ‘ధోక్బు’ పలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శితమైంది.
మరి.. ఇండియా టు హాలీవుడ్ దాకా ఎదిగిన ప్రియాంక ఈ విషయం ఎందుకు తెలుసుకోలేకపోయారో? ఏదేమైనా సిక్కిం ప్రజల మనోభావాలను ఆమె కించపరిచారు. ప్రియాంక మాటలకు సిక్కిం ప్రభుత్వం కూడా నొచ్చుకుంది. టూరిజమ్ మీద ఆధారపడే సిక్కింలాంటి రాష్ట్రం గురించి ప్రియాంక చేసిన వ్యాఖ్యలు సరికావని టూరిజమ్ మినిస్టర్ ఉగెన్ పేర్కొన్నారు. ఆమె క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ప్రియాంకా చోప్రా తల్లి మధు చోప్రా ఫోన్ ద్వారా క్షమాపణలు తెలియజేశారని సమాచారం. ఇ–మెయిల్ ద్వారా ప్రియాంక స్పందించారని భోగట్టా.