పెయిడ్ హాలిడే ఇవ్వకుంటే చర్యలు’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని దుకాణాలు, సంస్థలలోని ఉద్యోగులు, కార్మికులు పార్లమెం టు ఎన్నికల్లో వారి ఓటు హక్కు వినియోగించుకోవడానికి వీలుగా గురువారం (నేడు) ‘పెయిడ్ హాలిడే’ (వేతనాలతో కూడిన సెలవుదినం)గా ప్రకటిస్తూ రాష్ట్ర కార్మిక, ఉపాధి విభాగం ఈనెల 1వ తేదీన జీవో జారీ చేసింది. ప్రజా ప్రాతినిధ్య చట్టం–1951లోని నిబంధనలకు అనుగుణంగా కార్మిక కమిషనర్ కూడా ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. దుకాణాలతో పాటూ, ఐటీ, ఐటీఈ ఎస్ (ఔట్ సోర్సింగ్) కంపెనీలు కూడా ఏప్రిల్ 11ను పెయిడ్ హాలిడేగా ప్రకటించాల్సి ఉంటుంది. అలా ప్రకటించకుండా లేదా సంస్థలను మూసివేయకుండా ఓటు హక్కు వినియోగించుకోవడానికి అవకాశం లేకుండా చేస్తున్నట్లు ప్రధాన ఎన్నికల అధికారికి, లేబర్ కమిషనర్‌కు లేదా డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్‌కు ఫిర్యాదులు అందిన పక్షంలో వాటిని తీవ్రంగా పరిగణిస్తారు. వీటిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని సీఈవో రజత్ కుమార్ హెచ్చరించారు.