'పక్కింటి అబ్బాయి'గా చుట్టాలబ్బాయి..
ఇటీవల 'చుట్టాలబ్బాయి'గా ప్రేక్షకులను పలకరించిన ఆది త్వరలో 'పక్కింటి అబ్బాయి'గా అలరించనున్నాడు. సోమవారం హైదరాబాద్లో జరిగిన 'చుట్టాలబ్బాయి' సినిమా ప్లాటినమ్ డిస్క్ ఫంక్షన్లో ఈ విషయాన్ని వెల్లడించారు. ఫ్యామిలీ ఎంటర్టెయినర్గా తెరకెక్కిన చుట్టాలబ్బాయి సినిమా ఆదికి చెప్పుకోదగ్గ హిట్ ఇచ్చింది.
అదే ఉత్సాహంతో ఇప్పుడు 'పక్కింటి అబ్బాయి'ని తెరకెక్కించే ప్రయత్నంలో ఉన్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడించలేదు. 'పక్కింటి అబ్బాయి'ని స్వయంగా తానే నిర్మిస్తానని ఆది తండ్రి, ప్రముఖ నటుడు సాయికుమార్ తెలిపారు. ఇదివరకు ఆది హీరోగా వచ్చిన 'గరం' సినిమాకు సాయి కుమారే నిర్మాతగా వ్యవహరించారు.