ఇంధనం ఆదా...దేశానికే సేవ
♦ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ
♦ ముఖ్య కార్యదర్శి సునీల్‌శర్మ
♦ ఇంధన పొదుపు పక్షోత్సవాల్లో
♦ ఉత్తమ డ్రైవర్లకు అవార్డులు
సాక్షి, హైదరాబాద్: ముడి చమురులైన పెట్రో ల్, డీజిల్ పొదుపు చేసిన వారు యావత్ దేశానికి సేవ చేసిన వారవుతారని రాష్ట్ర రోడ్లు భవనాలశాఖ ముఖ్య కార్యదర్శి సునీల్‌శర్మ అన్నారు. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ ఆర్టీసీ) ఇంధన పొదుపు పక్షోత్సవాల సందర్భంగా శుక్రవారమిక్కడ ఉత్తమ డ్రైవర్లకు అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల నుంచి ఉత్తమ కె.ఎం.పి.ఎల్ సాధించిన 11 మంది డ్రైవర్లను ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో సునీల్‌శర్మ మాట్లాడుతూ.. దేశ అవసరాల కోసం దాదాపు 70శాతానికి పైగా విదేశాల నుంచే ముడి చమురు దిగుమతి చేసుకోవాల్సి వస్తోందని, తద్వారా దేశ సంపద అధికశాతం వీటికే వెచ్చించాల్సి వస్తోందన్నారు. చమురు ఆదా చేయడం ద్వారా డబ్బులు మిగల్చుకోవడంతో పాటు కాలుష్యం తగ్గించవచ్చన్నారు. ముఖ్యంగా ఆర్టీసీ డ్రైవర్లు 0.1 కేఎంపీఎల్ పెంచితే ఏడాదికి సంస్థకు రూ.20 కోట్లు ఆదా చేసినవారవుతారన్నారు.
సంస్థలో ఇప్పటికే 80శాతం డ్రైవర్లు 5.0 కేఎంపీఎల్‌ను అధిగమించారని, మిగతా 20శాతం సిబ్బంది కూడా ఇదే దారిలో నడిచి ఆర్టీసీ ఉన్నతికి పాటుపడాలన్నారు. అలాగే ఆర్టీసీలో కొత్తగా వస్తున్న సాంకేతికతను వినియోగించుకొని మరింత ముందడుగు వేయాలన్నారు. ఆర్టీసీ జేఎండీ జి.వి.రమణారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ ఎం.రవీందర్, హిందుస్థాన్ పెట్రోలియం సంస్థ ప్రతినిధి సువేందుగుప్త తదితరులు పాల్గొన్నారు.
ఉత్తమ డ్రైవర్లు వీరే...
ఎం.వెంకన్న (వరంగల్-1), ఎస్.హనుమయ్య (ఖమ్మం), కె.బుచ్చయ్య (పరిగి), ఎం.డి.గౌస్ (మహబూబ్‌నగర్), పి.ఎమ్.ఎమ్.రావ్ (సంగారెడ్డి), ఎం.డి. హబీబ్(యాదగిరిగుట్ట), వి.ఎస్.కుమార్ (నిజామాబాద్-1), పి.విరేశం (కరీంనగర్-1), కె.గోపాల్‌రెడ్డి (హయత్‌నగర్-2), జి.కిష్టారెడ్డి (రాణిగంజ్-2), ఎస్.ఆర్.రావు (మంచిర్యాల)