Palakonda Assembly Constituency
-
యథా సీఎం..తథా కళావతి
పాలకొండ రూరల్: సిద్ధం, మేమంతా సిద్ధం సభలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలతో ఎలా మమేకమై..ఎంత ఆప్యాయంగా కలిసిపోతున్నారో రాష్ట్రప్రజలందరికీ విదితమే. యథా రా జా తథా ప్రజా అన్నట్లు తమ నాయకుడి బాటలోనే వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా ఎన్నికల ప్రచారంలో ప్రజలతో మమేకమైపోతున్నారు. వారి కష్టాలను విని చలించిపోతున్నారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి వెళ్తున్న వైఎస్సార్సీపీ పాలకొండ నియోజకవర్గం అభ్యర్థి విశ్వాసరాయి కళావతికి ప్రజల నుంచి అపూర్వ ఆదరణ లభిస్తోంది. ఈ మేరకు శుక్రవారం ఆమె పాలకొండ మండలంలోని తంపటాపల్లి గ్రామంలో ప్రచారం చేస్తున్న క్రమంలో వృద్ధురాలు పడాల కామమ్మ కళావతి చేతిలో ఉన్న జగనన్న చిత్రపటాన్ని చూసి దగ్గరకు వచ్చింది. తనకు జగన్ బాబు మనుమడని, ఆయన వల్లనే పింఛన్ వస్తోందంటూ సంతోషం వెలిబుచ్చింది. వలంటీర్లు లేకపోవడంతో రెండు నెలులుగా పింఛన్ కోసం తాను పడుతున్న ఇబ్బందులను వివరించింది. దీంతో చలించిపోయిన కళావతి సదరు వృద్ధురాలిని ఆలింగనం చేసుకున్నారు. ప్రతిపక్షాల కుట్రే ఈ పరిస్థితికి కారణమని, మీరంతా జగనన్నను, తనను నిండు మనసుతో ఆశీర్వదించాలని కోరారు. మళ్లీ జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకుందామని, సంక్షేమం మీ గడప వద్దకే వలంటీర్ల ద్వారా అందిస్తామని చెప్పారు. ప్రజల సమక్షంలో కామమ్మను సన్మానించి, పాధాభివందనం చేశారు. అనుకోని ఈ ఘటనతో కళావతి సున్నిత మనస్తత్వానికి చప్పట్లతో స్థానికులు హర్షం తెలిపారు. జై జగన్ నినాదంతో ప్రజలు ఆ ప్రాంతాన్ని హోరెత్తించారు. -
ప్చ్.. పవన్ మెడలు వంచిన చంద్రబాబు
మన్యం, సాక్షి: పాపం.. పవన్ కల్యాణ్ జనసేనకు దక్కిన 21 సీట్లకు కూడా అభ్యర్థులకు దిక్కులేక ఎంత సతమతం అవుతున్నారో!.. ఇది ఏపీ ప్రజల్లో కొందరి అభిప్రాయం. కానీ, చంద్రబాబు నాయుడి రాజకీయాలు అర్థం చేసుకునేవాళ్లెవరైనా పవన్‌ను పాపం అని కాదు కదా.. ఛీ కొట్టి తిరస్కరిస్తారు. పాలకొండ అభ్యర్థి విషయంలో రాత్రి పూట పవన్ చేసిన ప్రకటనే ఇందుకు కారణం. చంద్రబాబు నాయుడు రాజకీయం ఎంత ఘోరంగా ఉంటుందో ఈ దఫా ఎన్నికల టైంలో స్పష్టంగా కనిపిస్తోంది. పేరుకు పొత్తు, కూటమి అంటూ ఇటు జనసేనకు, అటు బీజేపీకి సీట్లు ఇచ్చారే గానీ, ఆ సీట్లలో కూడా తన వాళ్లనే పోటీ చేయిస్తున్నారు. కాకపోతే.. వారికి సైకిలు గుర్తు ఉండదు. బీజేపీ, జనసేన బీఫాంల మీద పోటీకి దిగబోతున్నారు.. అంతే! బీజేపీలో, జనసేనల అభ్యర్థుల జాబితాను చంద్రబాబు దాదాపుగా తన మనుషులతో నింపేశారు. ఈ క్రమంలో ఆ రెండు పార్టీల్లో మొదటి నుంచి ఉన్న సీనియర్లకు అన్యాయం జరిగిందనే చెప్పొచ్చు. బీజేపీ అభ్యర్థుల్లో.. ఆదినారాయణరెడ్డి, కామినేని శ్రీనివాస్, సుజనా చౌదరి, రోషన్న, సీఎం రమేష్ లాంటివాళ్లే కాకుండా ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి కూడా చంద్రబాబు మనిషేనని వైఎస్సార్సీపీ ఆరోపిస్తోంది. ఇది చాలదన్నట్లు పురంధేశ్వరి పేరు చెప్పుకుని.. రూ. 3 కోట్లు ఇస్తే సీటు వదిలేస్తానని టీడీపీ నేతకు ఓ బీజేపీ నేత ఆఫర్ ఇచ్చినట్టు ఓ ఆడియో లీక్ కావడం, బీజేపీ-టీడీపీ చీకటి ఒప్పందాలకు ఊదాహరణ అనే చెప్పొచ్చు. ఇది చాలదన్నట్లు మరికొన్ని చోట్లా అభ్యర్థుల్ని మార్చుకునేందుకు ఆ రెండు పార్టీలు తీవ్రంగా యత్నిస్తున్నాయి. మరోవైపు జనసేన పరిస్థితి ఇంతే!. దక్కిన 21 సీట్లలోనూ అభ్యర్థుల్ని నింపేందుకు పవన్ తెగ ఇబ్బంది పడిపోయారు. పవన్‌లోని ఆ గందరగోళాన్ని చంద్రబాబు ఎంచక్కా క్యాష్ చేసుకున్నారు. ఒకవైపు వైఎస్సార్సీపీ నుంచి పార్టీ ఫిరాయించిన వంశీకృష్ణ యాదవ్, అరణి శ్రీనివాసులకు టికెట్లు ఇవ్వడం కూటమిలో మంట రాజేసింది. ఇది చాలదన్నట్లు భీమవరం, అవనిగడ్డ, ఇప్పుడు పాలకొండకు టీడీపీ నుంచి వచ్చిన అభ్యర్థుల్ని ఖరారు చేయడం, ఈ మధ్యలో రైల్వే కోడూరు అభ్యర్థిని తప్పించి మరీ టీడీపీ మనిషి అయిన అరవ శ్రీధర్‌కు టికెట్ ఇవ్వడం చూస్తే చంద్రబాబు పవన్ మెడల్ని ఏమేర వంచి తాను అనుకున్నది చేశారో స్పష్టం అవుతోంది. వాస్తవానికి పాలకొండ విషయంలో మాజీ ఎమ్మెల్యే నిమ్మక గోపాలరావు తనయుడు జయకృష్ణ ఎంపిక జనసేన శ్రేణుల్ని ఏమాత్రం సహించని విషయమే. ఎందుకంటే.. గతంలో పోటీ చేసిన ప్రతీసారి ఆయన విజేతలకు కనీస పోటీ ఇవ్వలేకపోయారు. ఈసారి టీడీపీ తరపున టికెట్ ఆశించారు. అదే సమయంలో పడాల భూదేవీ కూడా పోటీ చేయాలనుకున్నారు. కానీ, పొత్తులో భాగంగా జనసేనకు టికెట్ వెళ్లడంతో.. ఈ ఇద్దరూ అందులో చేరి టికెట్ దక్కించుకోవాలని తీవ్రంగా ప్రయత్నించారు. ఈలోపు జనసేన నాగేశ్వరరావుకు మంగళగిరి నుంచి పిలుపు రావడంతో జనసేన శ్రేణులు తమ అభ్యర్థే పోటీ చేయబోతున్నట్లు సంబురాలకు ఏర్పాట్లు చేసుకున్నారు. చివరకు.. బాబు కుట్ర రాజకీయమే ఫలించి టీడీపీ నుంచి చేరిన జయకృష్ణకే టికెట్ దక్కింది. పోటీ చేయడానికి జనసేనలో సరైన అభ్యర్థులే లేరా?.. తెలుగుదేశం వారిని జనసేనలో చేర్చుకుని మరీ వారికి పవన్ టికెట్లు ఇవ్వడాన్ని ఎలా అర్థం చేసుకోవాలని జనసేన నేతలు ఇప్పుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఆ నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్థిత్వానికి విపరీతమైన కాంపిటీషన్ ఉన్నదని చెబుతూ.. ఐవీఆర్ఎస్ సర్వేలు నిర్వహించడం టైం పాస్ వ్యవహారమేనని పవన్ చేష్టలతో ఇప్పుడు అర్థమవుతోంది కదా!. -
పాలకొండ టికెట్ జనసేనకే..!
పార్వతీపురం మన్యం: పార్వతీపురం మన్యం జిల్లాలోని పాలకొండ నియోజకవర్గం టీడీపీలో టికెట్ ఎవరికి ఇస్తారో తెలియని గందరగోళం నెలకొంది. ముఖ్యంగా ఇక్కడ టీడీపీ గ్రూపుల గోలతో తరచూ రచ్చకెక్కుతుండడం అధిష్టానానికి తలనొప్పిగా మారింది. దీంతో ఇక్కడ టీడీపీ అభ్యర్థి ఎవరనేది ప్రశ్నార్ధకంగా మారింది. పాలకొండ టీడీపీలో ఎప్పటి నుంచో ఉన్న వర్గ పోరు గతేడాది జూలై 12న చంద్రబాబు చేపట్టిన బస్సుయాత్రలో బహిర్గతమైంది. బస్సు యాత్రకు వచ్చిన చంద్రబాబు వీరఘట్టం అంబేడ్కర్ జంక్షన్లో బహిరంగ సభలో మాట్లాడారు. టీడీపీ అభ్యర్థిగా నిమ్మక జయకృష్ణ పేరు ప్రకటిస్తారని అతని వర్గీయులు ఆశించారు. అయితే చంద్రబాబు కనీసం జయకృష్ణ పేరు ప్రస్తావించకపోవడం అప్పట్లో చర్చనీయాంశమైంది. దీంతో నియోజకవర్గంలో ఉన్న నిమ్మక జయకృష్ణ, పడాల భూదేవి వర్గీయులు చాపకింద నీరులా ఒకరిపై ఒకరి కత్తులు దూసుకుంటున్నారు. వేర్వేరుగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ టీడీపీలో వీరు వర్గపోరుకు బీజం పోస్తున్నారని టీడీపీ సీనియర్ నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ వర్గ పోరుకు టీడీపీ అధిష్టానం చెక్ పెట్టేందుకు ఇక్కడ ప్రత్యామ్నాయంగా జనసేన అభ్యర్థికి టికెట్ ఇస్తారనే ప్రచారం ముమ్మరంగా జరుగుతుంది. తమ అభ్యర్థులకు వ్యతిరేకత ఉన్నచోట జనసేనకు టికెట్లు ఇచ్చే యోచనలో టీడీపీ అధిష్టానం ఉన్నట్టు టీడీపీ నాయకులే చెబుతుండడం గమనార్హం. ఇక్కడ జనసేనకే టికెట్ ఇస్తే ఇన్నాళ్లు టీడీపీని నమ్ముకున్న నిమ్మక జయకృష్ణకు నిరాశ తప్పదని, భూధేవికి భంగపాటే మిగులుతుందని ప్రజలు చర్చించుకుంటున్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఏది ఏమైనా పాలకొండ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి విశ్వాసరాయి కళావతి గెలుపు తథ్యమని, ఈమె హ్యట్రిక్ విజయం సాధించడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈమె హయాంలోనే పాలకొండ నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందని స్థానికులు పేర్కొంటున్నారు. ఫోన్ కాల్స్ కలకలం పాలకొండ టీడీపీ టికెట్ ఎవరికిస్తే బాగుంటుందని ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వాయిస్‌తో వచ్చిన ఫోన్ కాల్స్ టీడీపీలో కలకలం రేపాయి. ఇవి బోగస్ ఫోన్స్ కాల్స్ అని టీడీపీలో ఓ వర్గం కొట్టిపడేసింది. ఇదిలా ఉండగా 2004 నుంచి వరుసగా నాలుగుసార్లు ఇక్కడ టీడీపీ అభ్యర్థులు ఓడిపోయారు. ఇందులో 2004, 2009లో మాజీ ఎమ్మెల్యే దివంగత నిమ్మక గోపాలరావు టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత వరుసగా 2014, 2019లలో జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి, ప్రస్తుత ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతిపై గోపాలరావు తనయుడు జయకృష్ణ టీడీపీ తరఫున పోటీచేసి ఓడిపోయారు. ఇక 2024లో వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి విశ్వాసరాయి కళావతి గెలుస్తుందని సర్వే రిపోర్టులు చెబుతున్నాయి. -
పాలకొండలో సామాజిక జైత్రయాత్ర