ప్చ్‌.. పవన్‌ మెడలు వంచిన చంద్రబాబు | Sakshi
Sakshi News home page

ప్చ్‌.. పవన్‌ మెడలు వంచిన చంద్రబాబు

Published Wed, Apr 10 2024 7:29 AM

Pawan Kalyan Again Did It With Palakonda Candidate - Sakshi

జనసేన అభ్యర్థులుగా టీడీపీ నేతలు

ముందే ఫిక్స్‌ అయిన పవన్‌ కల్యాణ్‌

హెవీ కాంపిటీషన్‌.. ఐవీఆర్‌ఎస్‌ సర్వేలంటూ కొన్ని నియోజకవర్గాల్లో హడావిడి

చివరకు.. చివరి నిమిషంలో కండువా కప్పుకున్న సైకిల్‌ నేతలకే ఆ సీట్లు

మన్యం, సాక్షి: పాపం.. పవన్ కల్యాణ్ జనసేనకు దక్కిన 21 సీట్లకు కూడా అభ్యర్థులకు దిక్కులేక ఎంత సతమతం అవుతున్నారో!.. ఇది ఏపీ ప్రజల్లో కొందరి అభిప్రాయం. కానీ, చంద్రబాబు నాయుడి రాజకీయాలు అర్థం చేసుకునేవాళ్లెవరైనా పవన్‌ను పాపం అని కాదు కదా.. ఛీ కొట్టి తిరస్కరిస్తారు. పాలకొండ అభ్యర్థి విషయంలో రాత్రి పూట పవన్‌ చేసిన ప్రకటనే ఇందుకు కారణం.  

చంద్రబాబు నాయుడు రాజకీయం ఎంత ఘోరంగా ఉంటుందో ఈ దఫా ఎన్నికల టైంలో స్పష్టంగా కనిపిస్తోంది. పేరుకు పొత్తు, కూటమి అంటూ ఇటు జనసేనకు, అటు బీజేపీకి సీట్లు ఇచ్చారే గానీ, ఆ సీట్లలో కూడా తన వాళ్లనే పోటీ చేయిస్తున్నారు. కాకపోతే.. వారికి సైకిలు గుర్తు ఉండదు. బీజేపీ, జనసేన బీఫాంల మీద పోటీకి దిగబోతున్నారు.. అంతే!

బీజేపీలో, జనసేనల అభ్యర్థుల జాబితాను చంద్రబాబు దాదాపుగా తన మనుషులతో నింపేశారు. ఈ క్రమంలో ఆ రెండు పార్టీల్లో మొదటి నుంచి ఉన్న సీనియర్లకు అన్యాయం జరిగిందనే చెప్పొచ్చు. బీజేపీ అభ్యర్థుల్లో.. ఆదినారాయణరెడ్డి, కామినేని శ్రీనివాస్, సుజనా చౌదరి, రోషన్న, సీఎం రమేష్‌ లాంటివాళ్లే కాకుండా ఏపీ బీజేపీ చీఫ్‌ దగ్గుబాటి పురంధేశ్వరి కూడా చంద్రబాబు మనిషేనని వైఎస్సార్‌సీపీ ఆరోపిస్తోంది. ఇది చాలదన్నట్లు పురంధేశ్వరి పేరు చెప్పుకుని..  రూ. 3 కోట్లు ఇస్తే సీటు వదిలేస్తానని టీడీపీ నేతకు ఓ బీజేపీ నేత ఆఫర్ ఇచ్చినట్టు ఓ ఆడియో లీక్ కావడం, బీజేపీ-టీడీపీ చీకటి ఒప్పందాలకు ఊదాహరణ అనే చెప్పొచ్చు. ఇది చాలదన్నట్లు మరికొన్ని చోట్లా అభ్యర్థుల్ని మార్చుకునేందుకు ఆ రెండు పార్టీలు తీవ్రంగా యత్నిస్తున్నాయి.  

మరోవైపు జనసేన పరిస్థితి ఇంతే!. దక్కిన 21 సీట్లలోనూ అభ్యర్థుల్ని నింపేందుకు పవన్‌ తెగ ఇబ్బంది పడిపోయారు. పవన్‌లోని ఆ గందరగోళాన్ని చంద్రబాబు ఎంచక్కా క్యాష్‌ చేసుకున్నారు. ఒకవైపు వైఎస్సార్‌సీపీ నుంచి పార్టీ ఫిరాయించిన వంశీకృష్ణ యాదవ్‌, అరణి శ్రీనివాసులకు టికెట్లు ఇవ్వడం కూటమిలో మంట రాజేసింది. ఇది చాలదన్నట్లు భీమవరం, అవనిగడ్డ, ఇప్పుడు పాలకొండకు టీడీపీ నుంచి వచ్చిన అభ్యర్థుల్ని ఖరారు చేయడం, ఈ మధ్యలో రైల్వే కోడూరు అభ్యర్థిని తప్పించి మరీ టీడీపీ మనిషి అయిన అరవ శ్రీధర్‌కు టికెట్‌ ఇవ్వడం చూస్తే చంద్రబాబు పవన్‌ మెడల్ని ఏమేర వంచి తాను అనుకున్నది చేశారో స్పష్టం అవుతోంది.   

వాస్తవానికి పాలకొండ విషయంలో మాజీ ఎమ్మెల్యే నిమ్మక గోపాలరావు తనయుడు జయకృష్ణ ఎంపిక జనసేన శ్రేణుల్ని ఏమాత్రం సహించని విషయమే. ఎందుకంటే.. గతంలో పోటీ చేసిన ప్రతీసారి ఆయన విజేతలకు కనీస పోటీ ఇవ్వలేకపోయారు. ఈసారి టీడీపీ తరపున టికెట్ ఆశించారు. అదే సమయంలో పడాల భూదేవీ కూడా పోటీ చేయాలనుకున్నారు. కానీ, పొత్తులో భాగంగా జనసేనకు టికెట్‌ వెళ్లడంతో.. ఈ ఇద్దరూ అందులో చేరి టికెట్‌ దక్కించుకోవాలని తీవ్రంగా ప్రయత్నించారు.  ఈలోపు జనసేన నాగేశ్వరరావుకు మంగళగిరి నుంచి పిలుపు రావడంతో జనసేన శ్రేణులు తమ అభ్యర్థే పోటీ చేయబోతున్నట్లు సంబురాలకు ఏర్పాట్లు చేసుకున్నారు.

చివరకు.. బాబు కుట్ర రాజకీయమే ఫలించి టీడీపీ నుంచి చేరిన జయకృష్ణకే టికెట్‌ దక్కింది. పోటీ చేయడానికి జనసేనలో సరైన అభ్యర్థులే లేరా?.. తెలుగుదేశం వారిని జనసేనలో చేర్చుకుని మరీ వారికి పవన్‌ టికెట్లు ఇవ్వడాన్ని ఎలా అర్థం చేసుకోవాలని జనసేన నేతలు ఇప్పుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఆ నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్థిత్వానికి విపరీతమైన కాంపిటీషన్ ఉన్నదని చెబుతూ.. ఐవీఆర్‌ఎస్‌ సర్వేలు నిర్వహించడం టైం పాస్‌ వ్యవహారమేనని పవన్‌ చేష్టలతో ఇప్పుడు అర్థమవుతోంది కదా!.

Advertisement
 
Advertisement
 
Advertisement