14 ఏళ్ల క్రితం వెళ్లాడు.. చివరికి శవమై
హైదరాబాద్: పొట్టకూటి కోసం 14 ఏళ్ల క్రితం ఎడారి దేశం వెళ్లాడు.. అక్కడ బాగా సంపాదించి సొంత ఊరికి వస్తాడనుకుంటే శవమై తిరిగి వచ్చాడు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్ కు చెందిన పాలమాకుల సత్తయ్య రజక వృత్తి చేసుకునేవాడు. అయితే ఉన్న ఊళ్లో ఉపాధి కరువైంది. దీంతో భార్య, పిల్లలను వదిలి 14 ఏళ్ల క్రితం ఉపాధి కోసం ఒమన్ లోని మస్కట్ వెళ్లాడు. ఈ క్రమంలో 2008 లో సత్తయ్య పాస్పోర్టు గడువు ముగియడంతో అక్కడ నిబంధనల ప్రకారం సత్తయ్య అక్రమ నివాసిగా మారాడు. క్షమాభిక్ష అవకాశమున్నా సత్తయ్య తిరిగి స్వగ్రామానికి రాలేకపోయాడు. సత్తయ్య కోసం గత 14 ఏళ్లుగా భార్య కనకమ్మ, కూతుళ్లు స్వప్న, శైలజ, కుమారుడు రమేష్ ఎదురుచూస్తునే ఉన్నారు.
అప్పటి నుంచి అక్కడే ఉండిపోయిన సత్తయ్య అనారోగ్యంతో గతనెల జులై 31 న మృతి చెందాడు. పాస్ పోర్టు గడువు ముగిసి పోవడంతో అతని మృతదేహాన్ని ఇండియా పంపడానికి సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో మస్కట్ లోని తెలంగాణ రాష్ట్రానికి చెందిన సామాజిక వేత్త పోల్సాని లింగయ్య ఇండియన్ ఎంబసీ సహాయంతో కుటుంబసభ్యులకు మృతదేహాన్ని పంపేందుకు కృషి చేశారు.
అంతేకాక సత్తయ్య మృత దేహాన్ని స్వగ్రామానికి తెప్పించేందుకు కావలసిన పత్రాలను సమకూర్చడంలో తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షులు నంగి దేవేందర్ రెడ్డి సహకరించారు. ఈ మేరకు ఆయన విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, తెలంగాణ ఎన్నారై మంత్రి కేటీఆర్, మస్కట్ లోని ఇండియన్ ఎంబసీకి విజ్ఞప్తి చేశారు. దీంతో సత్తయ్య మృతదేహం గురువారం శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకుంది. అక్కడ నుంచి రాష్ట్ర ప్రభుత్వం అంబులెన్స్ ఏర్పాటు చేసి మృత దేహాన్ని అతని కుటుంబ సభ్యులకు అందజేసింది.
గల్ఫ్ మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ఇవ్వాలి
గత మూడేళ్ళలో గల్ఫ్ దేశాల నుంచి తెలంగాణ వలస కార్మికులకు చెందిన 600 కు పైగా మృతదేహాలు కలిగిన శవపేటికలు శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్నట్టు రిజిస్టర్ ప్రకారం తెలుస్తోందని దేవేందర్ రెడ్డి అన్నారు. గల్ఫ్ దేశాలలో చనిపోయిన కార్మికుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. గల్ఫ్ దేశాలలో ఇబ్బందుల్లో ఉన్నవారు సహాయం కోసం, సలహాల కోసం తమ హెల్ప్ లైన్ నెంబర్ 81435 88886 సంప్రదించవచ్చని ఆయన తెలిపారు.