‘రియల్ బాహుబలి’
హైదరాబాద్ : ఫొటోలోని వ్యక్తిని చూశారా?. అతని కంటే ఎక్కువ బరువుండే గున్న ఏనుగును ఎలా మోసుకెళ్తున్నారో. ఆయన పేరు పళనిచామీ శరత్‌కుమార్. తమిళనాడులో ఫారెస్ట్ గార్డుగా విధులు నిర్వహిస్తున్నారు. గత వారం ఓ ఏనుగు పిల్ల అడవిలో లోయలో పడిపోయింది. దీంతో దాని తల్లి అటవీ ప్రాంతంగా గుండా వెళ్లే రోడ్డు మార్గంపై అడ్డుగా నిల్చుంది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.
కొందరు వ్యక్తులు ఏనుగును రోడ్డు మార్గం నుంచి తరిమేందుకు ప్రయత్నించగా.. గుంతలో పడి ఉన్న గున్న ఏనుగు కనిపించింది. దీంతో వారు ఫారెస్టు సిబ్బందికి సమాచారం అందించారు. అప్పటికే నైట్ డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్తున్న శరత్.. ఏనుగు రక్షించేందుకు గుంతలోకి దిగారు. ఆయనకు కొందరు సాయం చేశారు. గున్న ఏనుగును భుజాలపై ఎత్తుకున్న శరత్.. దాన్ని ఆసుపత్రికి తరలించి వైద్యం చేయించారు.
అనంతరం తల్లి చెంతకు చేర్చారు. అతను ఏనుగు పిల్లని ఎత్తుకుని తీసుకెళుతున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. శరత్‌కుమార్ ఫొటోను చూసిన తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కే తారక రామారావు ‘రియల్ బాహుబలి’ అంటూ ట్వీట్ చేశారు.