Palanivel
-
వడ్డీ లేకుండా రూ.లక్ష కోట్ల రుణం ప్లీజ్!
సాక్షి, చెన్నై: తమిళనాడుకు వడ్డీ లేకుండా రూ.లక్ష కోట్లు రుణం ఇవ్వాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు రాష్ట్ర మంత్రి పళణి వేల్ త్యాగరాజన్ విజ్ఞప్తి చేశారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా శనివారం ఉదయం చెన్నై నుంచి ఢిల్లీకి పళణి వేల్ వెళ్లారు. పార్లమెంట్ హాల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను ఆమె చాంబర్లో కలిశారు. తమిళనాడుకు రావాల్సిన నిధులు, బకాయిలపై చర్చించారు. అలాగే, వడ్డీ లేని రుణం, జీఎస్టీ నిల్వ తదితర అంశాలతో కూడిన వినతి పత్రాన్ని, తమిళనాడులో సాగుతున్న ప్రాజెక్టులతో వినతి పత్రాన్ని, నివేదికను ఆమెకు అందజేశారు. అనంతరం వెలుపల మీడియాతో పళణి వేల్ త్యాగరాజన్ మాట్లాడారు. తమిళనాడుకు సంబంధించి అనేక అంశాలు, ప్రాజెక్టులపై పూర్తిస్థాయి నివేదికను అందించినట్లు తెలిపారు. చదవండి: (భిక్షగాడిగా మారిన మాజీ వ్యవసాయ అధికారి దీనగాథ.. 26 ఏళ్ల తరువాత న్యాయం) మదురైలో జీఎస్టీ సమావేశం నిర్వహించాలని విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. చెన్నైలో జరుగుతున్న రెండో విడత మెట్రో పథకం కోసం రుణపత్రాలకు ఆమోదం ఇవ్వాలని కోరామని చెప్పారు. వడ్డీ లేకుండా రూ.లక్ష కోట్ల మేర రుణం ఇవ్వాలని కోరామని, దీనిపై నిర్మాలా సీతారామన్ సానుకూలంగా స్పందించాలని వెల్లడించారు. అలాగే, తమ విజ్ఞప్తి మేరకు ఆప్టిక్ కేబుల్ పనులకు రూ. 184 కోట్లు, గ్రామీణాభివృద్ధి, రహదారుల పనులకు రూ.3,263 కోట్లు విడుదల చేశారని తెలిపారు. అలాగే, ఐటీ ఈపీఎఫ్‌ఓలకు డేటా విడుదల చేయాలని కోరినట్లు వెల్లడించారు. మదురైలో నైబర్ పథకం గురించి ప్రస్తావించగా, దానిని కేంద్రం పక్కన పెట్టినట్టు మంత్రి వివరణ ఇచ్చారని పళణివేల్ త్యాగరాజన్ పేర్కొన్నారు. -
అత్యాచారాలపై మాట్లాడడం లేదు
బాలలపై అత్యాచారాల గురించి వేదికలపై ఎవరూ మాట్లాడడంలేదు, తాను మాత్రం వాటి గురించి గొంతెత్తుతానని నటి నమిత వ్యాఖ్యానించారు. అమ్మా అప్పా సినీ క్రియేషన్స పతాకంపై పళనీవేల్ కథ, కథనం, మాటలు, పాటలు, దర్శకత్వం, నిర్మాణ బాధ్యతలు నిర్వహిస్తున్న చిత్రం ఛాయ. నటి సోనియా అగర్వాల్ పోలీస్ అధికారిణిగా ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రానికి పార్తిబన్ ఛాయాగ్రహణం, ఏసీ.జాన్ పీటర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం సాయంత్రం స్థానిక వడపళనిలోని ఆర్కేవీ.స్టూడియోలో జరిగింది. నటుడు శ్రీకాంత్ అతిథిగా పాల్గొని చిత్ర ఆడియో ను ఆవిష్కరించారు. మరో అతిథిగా పాల్గొన్న నమిత మాట్లాడుతూ సమాజానికి ఏదైనా మంచి సందేశం ఇవ్వాలంటే రెండే మార్గాలన్నారు. ఒకటి సినిమా, రెండు రాజకీయాలు.అందుకే తాను రాజకీయాలపై ఆసక్తి చూపుతున్నానన్నారు. సమాజంలో పిల్లలపై అత్యాచారాలు అధికం అవుతున్నాయన్నారు. వాటి గురించి ఏ వేదికపైనా ఎవరూ మాట్లాడడం లేదని, తాను అలాంటి చర్యలను ఖండిస్తూ గొంతెత్తుతానని అన్నారు. ఇక ఈ ఛాయ చిత్రం విషయానికి వస్తే ఇది పిల్లలకు, తల్లిదండ్రులకు చక్కని సందేశం ఇచ్చే కథా చిత్రం అని విన్నానన్నారు. తల్లిదండ్రులు పిల్లలకు మంచి విద్యను మాత్రం అందిస్తే చాలదన్నారు. వారితో సన్నిహితంగా మెలుగుతూ సమాజం గురించి తెలియజేయాలన్నారు. తనకు ముగ్గురు పిల్లలు ఉన్నారని, అదే విధంగా తన సోదరుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారని వారి బాధ్యతలు తానే చూసుకుంటానని నమిత తెలిపారు.