అత్యాచారాలపై మాట్లాడడం లేదు
బాలలపై అత్యాచారాల గురించి వేదికలపై ఎవరూ మాట్లాడడంలేదు, తాను మాత్రం వాటి గురించి గొంతెత్తుతానని నటి నమిత వ్యాఖ్యానించారు. అమ్మా అప్పా సినీ క్రియేషన్‌స పతాకంపై పళనీవేల్ కథ, కథనం, మాటలు, పాటలు, దర్శకత్వం, నిర్మాణ బాధ్యతలు నిర్వహిస్తున్న చిత్రం ఛాయ. నటి సోనియా అగర్వాల్ పోలీస్ అధికారిణిగా ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రానికి పార్తిబన్ ఛాయాగ్రహణం, ఏసీ.జాన్ పీటర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం సాయంత్రం స్థానిక వడపళనిలోని ఆర్‌కేవీ.స్టూడియోలో జరిగింది. నటుడు శ్రీకాంత్ అతిథిగా పాల్గొని చిత్ర ఆడియో ను ఆవిష్కరించారు.
మరో అతిథిగా పాల్గొన్న నమిత మాట్లాడుతూ సమాజానికి ఏదైనా మంచి సందేశం ఇవ్వాలంటే రెండే మార్గాలన్నారు. ఒకటి సినిమా, రెండు రాజకీయాలు.అందుకే తాను రాజకీయాలపై ఆసక్తి చూపుతున్నానన్నారు. సమాజంలో పిల్లలపై అత్యాచారాలు అధికం అవుతున్నాయన్నారు. వాటి గురించి ఏ వేదికపైనా ఎవరూ మాట్లాడడం లేదని, తాను అలాంటి చర్యలను ఖండిస్తూ గొంతెత్తుతానని అన్నారు. ఇక ఈ ఛాయ చిత్రం విషయానికి వస్తే ఇది పిల్లలకు, తల్లిదండ్రులకు చక్కని సందేశం ఇచ్చే కథా చిత్రం అని విన్నానన్నారు.
తల్లిదండ్రులు పిల్లలకు మంచి విద్యను మాత్రం అందిస్తే చాలదన్నారు. వారితో సన్నిహితంగా మెలుగుతూ సమాజం గురించి తెలియజేయాలన్నారు. తనకు ముగ్గురు పిల్లలు ఉన్నారని, అదే విధంగా తన సోదరుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారని వారి బాధ్యతలు తానే చూసుకుంటానని నమిత తెలిపారు.