వెంకట్‌రెడ్డి కుటుంబీకులకే!
పాలేరు టికెట్‌పై పీసీసీ నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: పాలేరు అసెంబ్లీ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికలో సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే దివంగత రాంరెడ్డి వెంకట్‌రెడ్డి కుటుంబసభ్యుల్లోనే ఒకరిని అభ్యర్థిగా ఆ పార్టీ ప్రకటించనుంది. కుటుంబంలో ఎవరిని పోటీకి నిలుపుతారో నిర్ణయించుకోవాలంటూ వెంకట్‌రెడ్డి సతీమణి సుచరితకు పీసీసీ ఇప్పటికే సూచించింది. పాలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు ఉన్న అనుచరవర్గం, వెంకట్‌రెడ్డికి ఉన్న పేరు దృష్ట్యా ఆయన భార్యగా సుచరిత వైపే పీసీసీ మొగ్గు చూపుతోంది. వెంకట్‌రెడ్డి సోదరులు, ఆయన కుమార్తెలతో చర్చించాకే అభ్యర్థి ఎవరన్నది తేలనుంది.
టీఆర్ఎస్కు దీటుగా వ్యూహరచన
టీఆర్ఎస్ అభ్యర్థిగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బరిలోకి దిగుతుండటంతో కాంగ్రెస్ కూడా దీటుగా వ్యూహరచన చేయాలని భావిస్తోంది. ప్రజా పద్దుల సంఘం (పీఏసీ) చైర్మన్‌గా ఉంటూ అకాలమరణం చెందిన వెంకట్‌రెడ్డి స్థానంలో ఆయన కుటుంబీకులకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశమివ్వాలని టీపీసీసీ గతంలోనే ప్రతిపాదించింది. కానీ అధికార టీఆర్ఎస్ స్పందించలేదు. కాంగ్రెస్ నేతలు విజ్ఞప్తి చేయడం, తాను కాదనడం, ఇదంతా ఎందుకనే యోచనతోనే సీఎం కేసీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఇప్పుడు కా్రంగెస్నేతలు మిగతా పార్టీల మద్దతుకోసం యోచిస్తున్నారు. సీపీఐ, సీపీఎం, టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలతో మాట్లాడుతున్నారు.