సింగిల్ గ్రిడ్
నల్లగొండ : జిల్లా వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టు అంచనాలు తారుమారయ్యాయి. తొలుత ప్రతిపాదించిన ప్రకారం కాకుండా, గ్రిడ్ స్వరూపాన్ని పూర్తిగా మార్చారు. నాలుగు గ్రిడ్లకు బదులుగా సింగిల్ (ఒక్కటే) గ్రిడ్‌ను ఏర్పాటు చేయాలనే నిర్ణయానికి వచ్చారు. పాలేరు, ఉదయసముద్రం, అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్..ఈ మూడింటిని కేంద్రంగా చేసుకుని నాలుగు గ్రిడ్లు ఏర్పాటు చేయాలని తొలుత ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అక్కంపల్లి నుంచి జంటనగరాలకు నీటి సరఫరా జరుగుతుండగా, పాలేరు జలాలు ఖమ్మం పట్టణవాసులకే సరిపోవడం లేదు. అదీగాక ఉదయసముద్రం రిజర్వాయర్‌కు రావాల్సిన నీటికేటాయింపులే పూర్తిస్థాయిలో అందడంలేదు. ముఖ్యంగా జంటనగరాలకు భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఐకేబీఆర్లో నీటి కేటాయింపులు చేశారు.
ఇక్కడి నుంచి నీటిని వాటర్‌గ్రిడ్‌కు తరలిస్తే జంటనగరవాసులతో పాటు, ఉదయసముద్రం కింద ఉన్న మండలాలకు కూడా తీవ్ర నీటిసమస్య ఎదురయ్యే ప్రమాదం ఉందంటూ ప్రభుత్వం పునరాలోచించింది. నాగార్జునసాగర్‌లో నీటి నిల్వలు పుష్కలంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ మూడు రిజర్వాయర్ల్లో నీటినిల్వలు గరిష్టస్థాయికి చేరుకుంటాయి. దీంతో జిల్లా ప్రజాప్రతినిధులు, సాగునీటి రంగ నిపుణుల నుంచి సలహాలు, సూచనలు తీసుకున్న తర్వాత రాష్ట్రప్రభుత్వం నాగార్జునసాగర్ నుంచి కాకుండా శ్రీశైలం నుంచి కృష్ణాజలాలు నల్లగొండ జిల్లాకు తీసుకురావాలని నిర్ణయించింది. దీనిలో భాగంగానే అధికారులు సరికొత్తగా ప్రణాళికలు రూపొందించి ప్రభుత్వానికి సమర్పించారు. ఈ ప్రతిపాదనలనే ప్రభుత్వం కూడా ఆమోదించేందుకు సిద్ధమైంది.
శ్రీశైలం టు నల్లగొండ
శ్రీశైలం బ్యాక్‌వాటర్ సమీపంలో ఉన్న ఎల్లూరు నుంచి మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్ వరకు 18 కిలోమీటర్ల మేర భారీ పైప్‌లైన్ నిర్మిస్తారు. కొల్లాపూర్ సమీపంలో వన్యప్రాణి కేంద్రానికి సంబంధించి అటవీ ప్రాంతం ఉంది. ఇక్కడ 600 మీటర్లు ఎత్తయిన గుట్టపైన జీఎల్‌బీఆర్ (గ్రౌండ్ లెవల్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్) నిర్మిస్తారు. ఇక్కడి నుంచి రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాలతో పాటు నల్లగొండకు జిల్లాకు పైప్‌లైన్ ఏర్పాటు చేస్తారు. కొల్లాపూర్ నుంచే వచ్చే పైప్‌లైను డిండి ద్వారా నుంచి మన జిల్లాలోకి ప్రవేశిస్తుంది. శ్రీశైలం నుంచి డిండి వరకు 50 కి.మీ మేర పైప్‌లైను నిర్మించి కృష్ణాజలాలు తీసుకొస్తారు. మన జిల్లాలోకి ప్రవేశించిన తర్వాత తొలుత చింతపల్లి మండలం గొడకొండ్ల వద్ద ప్రతిపాదించిన ట్రీట్మెంట్ ప్లాంట్‌లోకి నీటిని పంపింగ్ చేస్తారు. ఇదే పైప్‌లైన్ ద్వారానే భువనగిరి, సూర్యాపేట మండలం ఉండ్రుకొండ, మునగాల మండలం బరాఖత్‌గూడెం వద్ద ప్రతిపాదించిన వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లకు నీటిని చేరుస్తారు. ఈ ప్లాంట్లలో నిల్వ ఉంచిన నీటిని ప్రస్తుతం కొనసాగుతున్న తాగునీటి సరఫరా ట్యాంకులకు ఎక్కించి పైప్లైన్ల ద్వారా గ్రామాలకు నీరందిస్తారు. శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి 8 టీఎంసీల నీటిని జిల్లా తాగునీటి అవసరాలకు తరలిస్తారు.
పెరగనున్న అంచనాలు
తొలుత ప్రతిపాదించిన నాలుగు గ్రిడ్ల నిర్మాణాలకు రూ.2 వేల కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు. దీనికి అదనంగా మరో నాలుగైదు కోట్లు పన్నులు, జీతాలు, వగైరా వంటి ఖర్చులు కూడా ఉన్నాయి. కాగా ప్రస్తుతం శ్రీశైలం నుంచి ప్రారంభమయ్యే పైప్‌లైన్ జిల్లా మొత్తం ఏర్పాటు చేయాల్సి వస్తుండడంతో పైప్‌లైన్ ఖర్చు భారీగా ఉంటోంది. కావు న అంచనా వ్యయం కూడా మూడు వేల కోట్ల రూపాయలు దాటే అవకాశముందని అధికాారులు చెబుతున్నారు. పూర్తి అంచనా వ్యయం లెక్కలు చివరి దశలో ఉన్నాయని వారు పేర్కొన్నారు.
ఆ పథకాలు నిర్మించాలనే ఆలోచన!
ఇదిలా ఉంటే గ్రిడ్ కారణంగా వివిధ నియోజక వర్గాల్లో తొలుత రద్దు చేయాలనుకున్న తాగునీటి పథకాలను తిరిగి వాటిని నిర్మించాలనే ఆలోచన ప్రభుత్వం చేస్తోంది. వాటర్ గ్రిడ్ నుంచి మినహాయించిన 16 మండలాల్లో కృష్ణాజలాలు సరఫరా అయ్యేందుకు పథకాలు ఉన్నందున వీటి ద్వారానే మిగిలిన అన్ని గ్రామాలకు నీటి సరఫరా చేయనున్నారు.
ఈ 16 మండలాలు మినహాయింపు...
శాలిగౌరారం మోత్కూరు కట్టంగూరు నకిరేకల్ కేతేపల్లి రామన్నపేట నార్కట్‌పల్లి చిట్యాల తిప్పర్తి నల్లగొండ కనగల్ మఠంపల్లి
మేళ్లచెర్వు మోతె త్రిపురారం చందంపేట
మంచినీటి రిజర్వాయర్లు, కృష్ణానది తీరానికి సమీపంలో ఉన్న ఈ మండలాలను గ్రిడ్ నుంచి మిన హాయించారు. వీటి పరిధిలో కొనసాగుతున్న తాగునీటి పథకాల ద్వారానే అన్ని గ్రామాలకు మంచినీటిని సరఫరా చేయనున్నారు.