ఒక్కడి కోసం వెయ్యి మందిని వదిలిపెట్టి..
పాలస్తీనా ఉగ్ర సంస్థ హమాస్- ఇజ్రాయెల్ సైన్యం మధ్య కొనసాగుతున్న భీకరపోరు పదో రోజు దాటింది. హమాస్‌ను తుడిచిపెట్టడమే లక్ష్యంగా గాజాస్ట్రిప్‌పై ఇజ్రాయెల్ రక్షణ బలగాలు విరుచుకుపడుతున్నాయి.ఇప్పటి వరకు వైమానిక దాడులు చేసిన ఇజ్రాయెల్ దళాలు.. ఏ క్షణమైనా గాజాలో గ్రౌండ్ ఆపరేషన్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. ప్రతిగా ఇజ్రాయెల్ పౌరుల్ని బందీలుగా చేసుకుని దాడుల నుంచి తప్పించుకోవాలని హమాస్ ప్రయత్నిస్తోంది. అయితే.. ఇది ఇక్కడికే పరిమితం కాలేదు.
తాజాగా తమ చెరలో 199 మంది ఇజ్రాయెల్ పౌరులు(కొందరు విదేశీయలు కూడా) హమాస్ ప్రకటించుకుంది. అందులో చిన్నారులు, మహిళలు, వృద్ధులు కూడా ఉన్నారని ఇజ్రాయెల్ మిలిటరీ ప్రతినిధి డానియల్ హగారే చెబుతున్నారు. తొమ్మిది నెలల పాప, ఆటిజంతో బాధపడుతున్న చిన్నారులు, యువతులు, గుండె, కిడ్నీ సంబంధిత వ్యాదులు కలిగిన వృద్ధులు ఉన్నట్లు ప్రకటించారు. అయితే.. ఇంత భారీ సంఖ్యలో ఇజ్రాయెల్స్‌ను బందీలుగా పట్టుకోవడం హమాస్‌కు ఇదే తొలిసారి. కానీ, ఈ బందీల వంకతో తమ డిమాండ్లు నెరవేర్చుకోవడం మాత్రం ఇదే తొలిసారి కాదు.
1948లో ఇజ్రాయెల్ దేశంగా ఏర్పడినప్పటి నుంచి యుద్ధ తరహా సంక్షోభాలెన్నింటినో ఎదుర్కొంది. ముఖ్యంగా.. 1955 నుంచి ఇప్పటిదాకా పలు సందర్భాల్లో తమ దేశ పౌరులను విడిపించుకునేందుకు ఖైదీల పరస్పర మార్పిడి చేపడుతోంది. ఇందులో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది.. 2011లో జరిగిన ఘటన గురించి.. ఒక్క సైనికుడి కోసం ఏకంగా వెయ్యి మంది ఖైదీల్ని విడిచిపెట్టింది ఇజ్రాయెల్.
కార్పొరల్ గిలాద్ షలిత్(19) వెళ్తున్న ట్యాంక్‌పై దాడి చేసిన హమాస్ సభ్యులు.. అతన్ని బందీగా చేసుకున్నారు. ఐదేళ్లపాటు హమాస్ చెరలో ఉన్న షలిత్‌ను విడిపించాలని బెంజిమన్ నెతన్యాహు ప్రభుత్వం మీద ప్రజలు ఒత్తిడి చేశారు. దీంతో.. షలిత్కి బదులుగా ఏకంగా 1,027 మంది పాలస్తీనా ఖైదీల్ని ఇజ్రాయెల్ విడుదల చేసింది. అందులో 78 మంది ఉగ్రవాదులు కూడా ఉన్నారు.
1955లో.. నలుగురు సైన్య సిబ్బంది కోసం(మరొకరు బందీగా ఉన్నప్పుడే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. అతని మృతదేహం కోసం కూడా..) 40 మంది సిరియా పౌరుల్ని ఇజ్రాయెల్ విడిచిపెట్టింది. 1983లో పాలస్తీనియన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ ఆధీనంలో ఉన్న ఆరుగురు ఇజ్రాయెల్ ఖైదీల్ని విడిపించుకునేందుకు 4,700 మంది పాలస్తీనా-లెబనీస్ ఖైదీల్ని ఇజ్రాయెల్ విడిచిపెట్టింది. అందులో మరణశిక్షలు పడ్డ ఉగ్రవాదులు ఉన్నారు. 1985లో ముగ్గురి కోసం మరో 1,150 మంది పాలస్తీనియన్లను ఇజ్రాయెల్ వదిలిపెట్టింది. 2004 నుంచి 2008 మధ్య కూడా.. ఖైదీల పరస్సర మార్పిడి జరిగింది. అలా.. ఇజ్రాయెల్ తమ పౌరుల పట్ల ఎంత శ్రద్ధ వహిస్తుందో హమాస్‌కు తెలుసు. అందుకే హమాస్ ఇప్పుడు బందీల ప్లాన్ అమలు చేస్తోందా?.. వీళ్ల ద్వారా ఎంతమందిని విడుదల చేయించాలనుకుంటోంది?.. అనేది త్వరలోనే తేలనుంది. మరోవైపు.. హమాస్ నుంచి తమ దేశస్థుల్ని సురక్షితంగా రప్పించాలంటూ ఇజ్రాయెల్ అంతటా నిరసనలు కొనసాగుతున్నాయి. దీంతో.. వాళ్లను విడిపించడం నెతన్యాహూ ప్రభుత్వానికే పెద్ద సవాల్‌గానే మారనుందనే చెప్పాలి.
హమాస్-ఇజ్రాయెల్ దాడుల్లో.. ఇరువైపులా మరణించినవారి సంఖ్య 4 వేలు దాటింది. ఇజ్రాయెల్ దాడుల్లో 700 మంది పిల్లలతో సహా 2,670 మంది పాలస్తీనియన్లు మృతి చెందగా.. హమాస్ దాడిలో ఇజ్రాయెల్ పౌరులు 1400 మంది మరణించారు.