68 రోజులుగా నిరాహారదీక్ష.. ఖైదీ ఆరోగ్యం విషమం
జైలులో గత 68 రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న ఖైదీ ఆరోగ్యం విషమించింది. ఈ విషయాన్ని పాలస్తీనా ఖైదీల వ్యవహారాల కమిటీ తెలిపింది. మహ్మద్ అల్ బల్బౌల్ (21) అనే ఈ ఖైదీ జూలై 4వ తేదీన నిరాహారదీక్ష మొదలుపెట్టాడు. ప్రస్తుతం అతడిని టెల్ అవివ్ సమీపంలోని అస్సఫ్ హరొఫె ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతడిని విడుదల చేయాల్సిందిగా ఇజ్రాయెల్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలుచేసినట్లు ఓ ప్రతినిధి చెప్పారు. తన అన్నతోపాటు జూన్ 9న బల్బౌల్‌ను పోలీసులు అరెస్టుచేసి జైల్లో పెట్టారు. ప్రస్తుతం అతడికి పోషకాహార లోపం వల్ల తాత్కాలిక అంధత్వం కూడా వచ్చింది. గంటగంటకూ అతడి ఆరోగ్యం బాగా విషమిస్తోంది.
అతడికి బలవంతంగా ఆహారం ఇవ్వొద్దని, అలా చేయడం కూడా ఒక రకమైన హింస అవ్వడంతో పాటు అది వైద్య పరమైన విలువలకు విరుద్ధమని పాలస్తీనా ఆరోగ్యశాఖ మంత్రి జవద్ అవాద్ జైలు అధికారులకు తెలిపారు. వైద్య చికిత్సను నిరాకరించే హక్కు రోగులకు ఉంటుందని ఆయన అన్నారు. ఎలాంటి ఆరోపణలు లేకపోయినా పాలస్తీనా పౌరులను ప్రభుత్వం అరెస్టు చేసి, జైళ్లలో పెడుతోంది. ఇలాంటి కేసులలో గరిష్ఠంగా ఆరు నెలల పాటే జైల్లో ఉంచే అవకాశం ఉన్నా.. తర్వాత దాన్ని ఎంతకాలమైనా పొడిగించవచ్చు.