పాలీసెట్ నిర్వహణపై తర్జనభర్జన
నేడు తుది నిర్ణయం: ఎంవీ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: పాలీసెట్-2016 పరీక్ష నిర్వహణపై సాంకేతిక విద్యాశాఖ తర్జనభర్జన పడుతోంది. ఈ నెల 21న జరగాల్సిన పరీక్షకు విద్యార్థులంతా హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకుని, సిద్ధమైన సమయంలో కాలేజీలు నిరవధిక బంద్కు పిలుపునివ్వడంతో కొంత గందరగోళంలో పడింది. పరీక్ష కేంద్రా ల కోఆర్డినేటర్లతో సంప్రదింపులు జరుపుతోంది. సాంకేతిక విద్యా డెరైక్టర్ ఎంవీ రెడ్డి మంగళవారం కూడా వారితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పరీక్ష నిర్వహణకు సహకరించాలని యాజమాన్యాలను కోరారు. 75 శాతం కాలేజీల వారే సమావేశానికి హాజరయ్యారు.
అందులో కొంతమంది పరీక్ష నిర్వహణకు సహకరించబోమని పేర్కొన్నారు. దీంతో పరీక్ష నిర్వహణకు ఏయే కాలేజీలు సహకరించవో రాత పూర్వకంగా తెలియజేయాలని ఎంవీరెడ్డి కోరారు. అలా రాతపూర్వకంగా ఇచ్చే కాలేజీల సంఖ్యను బట్టి పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని పేర్కొన్నారు. ఆ తర్వాత అవసరమైతే ప్రస్తుతానికి వాయిదా వేస్తామని చెప్పారు. ఏదేమైనా బుధవారం ఉదయం వరకైనా యాజమాన్యా లు పరీక్ష నిర్వహణకు సానుకూలత వ్యక్తం చేస్తాయని భావిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపైనా దృష్టి పెట్టామని పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల సమీపంలోని జూనియర్, డిగ్రీ కాలేజీలు, హైస్కూళ్లలో పాలీసెట్ నిర్వహణకు కసరత్తు చేస్తున్నామన్నారు. కాలేజీలు సహకరించకపోతే మాత్రం వాయిదా వేయక తప్పదన్నారు. దీనిపై బుధవారం అధికారికంగా నిర్ణయం ప్రకటిస్తామని తెలిపారు.