Pallavaram
-
పోలగరం
బంద్ సక్సెస్ పాలమూరు : పోలవరం ముంపు గ్రామాలను ఆంధ్రప్రదేశ్‌లో కలుపుతూ పార్లమెంట్లో సవరణ బిల్లును ఆమోదించడాన్ని నిరసిస్తూ వామపక్షపార్టీలు, టీజేఏసీ, టీఆర్ఎస్ ఇచ్చిన పిలుపుమేరకు శనివారం చేపట్టిన బంద్ ప్రశాంతంగా కొనసాగింది. జిల్లావ్యాప్తంగా వ్యాపార, వాణిజ్య, విద్యాసంస్థలు, బ్యాంకులు, పెట్రోల్‌బంకులు, సినిమా థియేటర్లు, హోటళ్లు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఆయా పార్టీలు, ప్రజాసంఘాలు నిరసన ర్యాలీలు, ధర్నాలు చేపట్టాయి. బంద్ సందర్భంగా టీజేఏసీ,విద్యార్థి సంఘాలు, టీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం, సీపీఐ(ఎంల్ఎల్) న్యూడెమోక్రసీ నాయకులు జిల్లాలోని పలు డిపోల వద్ద బైఠాయించారు. మహబూబ్‌నగర్ పట్టణంలోని తెలంగాణ చౌరస్తాలో ప్రధాని నరేంద్రమోడీ, చంద్రబాబుల దిష్టిబొమ్మలను దహనం చేశారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ పాల్గొని కేంద్రప్రభుత్వ వైఖరికి నిరసన తెలిపారు. బంద్‌లో భాగంగా సీపీఎం నాయకులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. స్థానిక బస్సు డిపో ప్రధానగేట్ ఎదుట బైఠాయించారు. తెలంగాణ సీపీఎం ఆధ్వర్యంలో తెలంగాణ చౌరస్తాలో ప్రధాని నరేంద్రమోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. జిల్లావ్యాప్తంగా నిరసనలు కొడంగల్‌లో బంద్ విజయవంతంగా కొనసాగింది. టీజేఏసీ పిలుపు మేరకు టీఆర్ఎస్, టీవీవీ, టీఎన్జీఓస్, టీజేఏసీ, సీపీఐ నాయకులు నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కొడంగల్‌లో మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి బంద్‌లో పాల్గొన్నారు. షాద్‌నగర్‌లో అత్యవసర సేవలు మినహా వ్యాపార సముదాయలను స్వచ్ఛందంగా మూసివేశారు. టీజేఏసీ నాయకులు ఆర్టీసీ బస్సులను అడ్డుకున్నారు. టీఆర్ఎస్, సీపీఐ, కాంగ్రెస్ నాయకులు బస్టాండ్ ఆవరణలో మానవహారం చేపట్టారు. నాగర్‌కర్నూల్‌లో టీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం నాయకులు, కార్యకర్తలు ఆర్టీసీ డిపో వద్ద బైఠాయించారు. అంతకుముందే కొన్ని బస్సులు డిపో నుంచి వెళ్లిపోవడంతో మిగిలినవాటిని కూడా బయటకు రానివ్వకుండా అడ్డుకున్నారు. స్థానిక బస్టాండ్ కూడలిలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. పోలవ రం బిల్లును వ్యతిరేకిస్తూ టీజేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన బంద్ జడ్చర్ల నియోజకవర్గంలో ప్రశాంతంగా ముగిసింది. వనపర్తిలో ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. తెలంగాణవాదులు నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దహనం చేసి కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. బంద్‌లో భాగంగా దేవరకద్ర, కొత్తకోట, అడ్డాకుల, సీసీకుంట, భూత్పూర్ మండల కేంద్రాల్లో వ్యాపారసంస్థలను స్వచ్ఛందంగా మూసిఉంచారు. ‘పేట’, నియోజకవర్గాల పరిధిలో బంద్ ప్రశాంతంగా కొనసాగింది. కొల్లాపూర్, మక్తల్, గద్వాల నియోజకవర్గాల్లో వ్యాపారులు ముందుగానే వ్యాపారసంస్థలను స్వచ్ఛందంగా మూసివేశారు. అలంపూర్‌లో ఆర్టీసీ బస్సులు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులుపడ్డారు. కల్వకుర్తిలో సీపీఎం, కాంగ్రెస్‌పార్టీలు బంద్‌లో పాల్గొన్నాయి. అచ్చంపేటలో ఉదయం నాలుగు గంటల నుంచే సీపీఎం, టీఆర్ఎస్, జేఏసీ నాయకులు ఆర్టీసీ డిపోగేటు ఎదుట బైఠాయించి బస్సులను అడ్డుకున్నారు. -
పొట్ట కొడుతున్నారు
పోలవరం, న్యూస్‌లైన్ : సంక్షేమ హాస్టళ్లలోని గిరిజన విద్యార్థులు అర్ధాకలితో అలమటిస్తున్నా రు. పౌష్టికాహారం మాట దేవుడెరుగు.. కనీసం అన్నంలో కూరకూడా వేయడం లేదు. ఇదేమని అడిగితే.. ధరలు పెరిగిపోయూయని, కాంట్రాక్టర్ వాటిని సరఫరా చేయడం లేదని అధికారులు చేతులు దులిపేసుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే... కేఆర్‌పురం ఐటీడీఏ పరిధిలోని పోలవరం, బుట్టాయగూడెం, జీలుగుమిల్లి మండలాల్లో మొత్తం 47 గిరిజన సంక్షేమ వసతి గృహాలు ఉన్నాయి. దాదాపు 5,004 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీటిలో ఎక్కడా మెనూ అమలు కావడం లేదు. పౌష్టికాహారంగా అందించే పాలు, అరటిపండు సైతం ఇవ్వడం లేదు. గిరిజనసంక్షేమ వసతి గృహాలకు నిత్యావసర సరుకులను సరఫరా చేసేందుకు ఐటీడీఏ ఏటా కాంట్రాక్టర్‌ను నియమిస్తుంది. టెండర్లో పేర్కొన్న ధరల ప్రకారం జూన్ నుంచి ఏప్రిల్ వరకు సంబంధిత కాంట్రాక్టర్ నిత్యావసర సరుకులను సరఫరా చేయాల్సి ఉంది. సెప్టెంబర్ నెలాఖరు వరకు నిత్యావసర సరుకులను సరఫరా చేస్తూ వచ్చిన కాంట్రాక్టర్ అక్టోబర్ 1 నుంచి పాలు, కూరగాయలు, పుల్లలు, సరుకుల సరఫరాను పూర్తిగా నిలిపివేశారు. అరటిపండు సరఫరా కూడా నిలిచిపోయింది. మండల ప్రధాన కేంద్రాల్లో ఉండే వసతి గృహాల్లోని విద్యార్థులకు అప్పుడప్పుడు అరటి పండ్లు సరఫరా చేస్తూ మూరుమూల ప్రాంతాల్లోని విద్యార్థులకు మొండిచేయి చూపిస్తున్నారు. నిబంధనల ప్రకారం వారానికి నాలుగుసార్లు విద్యార్థులకు అరటిపండ్లు ఇవ్వాలి. దాదాపుగా అమలు జరగడం లేదు. ఇదిలావుంటే టెండర్లో పేర్కొన్న ధరల ప్రకారం లీటరు పాలు రూ.26.50, కూరగాయలకు కిలో రూ.15 చొప్పున, పుల్లలు కిలో రూ.1.84 చొప్పున వాటిని సరఫరా చేసే కాంట్రాక్టర్‌కు ఐటీడీఏ చెల్లిస్తుంది. పాల ధర మార్కెట్లో లీటరు రూ.40 ఉంది. ఏజెన్సీ గ్రామాల్లో పాలు దొరకవు. అవి దొరకనిచోట కనీసం పాల ప్యాకెట్లను అయినా సరఫరా చేయాల్సి ఉండగా, పట్టించుకోవడం లేదు. విద్యార్థులకు ప్రతిరోజూ పాలు ఇవ్వాల్సి ఉండగా, ఎక్కడా ఇవ్వడం లేదు. మధ్యాహ్నం, సాయంత్రం భోజనాల్లో పల్చటి మజ్జిగ వాడుతున్నారు. ఏ కూరగాయ కొనాలన్నా మార్కెట్లో కిలో రూ.60కి తక్కువ లేవు. కాంట్రాక్టర్ వాటిని సరఫరా చేయకపోవడంతో కిలోకు రూ.15 చొప్పున వార్డెన్లకు చెల్లించి, కొనుగోలు చేయమంటున్నారు. వార్డెన్లు మెనూలో సగం కోత వేసి విద్యార్థులకు భోజనం పెడుతున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే విద్యార్థులకు కూరలు వడ్డించడమే మానేశారు. ఈ పరిస్థితికి కాంట్రాక్టరే కారణమని చెబుతున్న అధికారులు అతనిపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. వార్డెన్లను కొనమని చెప్పాం ఈ విషయమై గిరిజన సంక్షేమ శాఖ డెప్యూటీ డెరైక్టర్ పి.సావిత్రిని ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా, అక్టోబర్ నుంచి పాలు, కూరగాయలు తదితర సరుకులను కాంట్రాక్టర్ సరఫరా చేయటం లేదన్నారు. వాటిని వార్డెన్లే కొనుగోలు చేసి విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చూడాల్సిందిగా ఆదేశించామన్నారు. నిత్యావసర సరుకుల ధరలు పెరగడంతో టెండర్లో పేర్కొన్న ధరలకు, బహిరంగ మార్కెట్లో ధరలకు వ్యత్యాసం ఎక్కువగా ఉందన్నారు. తాము మాత్రం టెండర్లో పేర్కొన్న ధరలను మాత్రమే వార్డెన్లకు చెల్లిస్తామన్నారు. నిత్యావసర సరుకుల ధరలను పెంచాల్సిందిగా కోరుతూ జారుుంట్ కలెక్టర్ టి.బాబూరావునాయుడుకు నివేదిక పంపించామని చెప్పారు. కొత్త రేట్లకు అనుమతి వస్తే మెనూ సక్రమంగా అమలయ్యేలా చూస్తామన్నారు.