పోలగరం
బంద్ సక్సెస్
పాలమూరు : పోలవరం ముంపు గ్రామాలను ఆంధ్రప్రదేశ్‌లో కలుపుతూ పార్లమెంట్‌లో సవరణ బిల్లును ఆమోదించడాన్ని నిరసిస్తూ వామపక్షపార్టీలు, టీజేఏసీ, టీఆర్‌ఎస్ ఇచ్చిన పిలుపుమేరకు శనివారం చేపట్టిన బంద్ ప్రశాంతంగా కొనసాగింది. జిల్లావ్యాప్తంగా వ్యాపార, వాణిజ్య, విద్యాసంస్థలు, బ్యాంకులు, పెట్రోల్‌బంకులు, సినిమా థియేటర్లు, హోటళ్లు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఆయా పార్టీలు, ప్రజాసంఘాలు నిరసన ర్యాలీలు, ధర్నాలు చేపట్టాయి.
బంద్ సందర్భంగా టీజేఏసీ,విద్యార్థి సంఘాలు, టీఆర్‌ఎస్, సీపీఐ, సీపీఎం, సీపీఐ(ఎంల్‌ఎల్) న్యూడెమోక్రసీ నాయకులు జిల్లాలోని పలు డిపోల వద్ద బైఠాయించారు. మహబూబ్‌నగర్ పట్టణంలోని తెలంగాణ చౌరస్తాలో ప్రధాని నరేంద్రమోడీ, చంద్రబాబుల దిష్టిబొమ్మలను దహనం చేశారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ పాల్గొని కేంద్రప్రభుత్వ వైఖరికి నిరసన తెలిపారు. బంద్‌లో భాగంగా సీపీఎం నాయకులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. స్థానిక బస్సు డిపో ప్రధానగేట్ ఎదుట బైఠాయించారు. తెలంగాణ సీపీఎం ఆధ్వర్యంలో తెలంగాణ చౌరస్తాలో ప్రధాని నరేంద్రమోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు.
జిల్లావ్యాప్తంగా నిరసనలు
కొడంగల్‌లో బంద్ విజయవంతంగా కొనసాగింది. టీజేఏసీ పిలుపు మేరకు టీఆర్‌ఎస్, టీవీవీ, టీఎన్‌జీఓస్, టీజేఏసీ, సీపీఐ నాయకులు నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కొడంగల్‌లో మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి బంద్‌లో పాల్గొన్నారు. షాద్‌నగర్‌లో అత్యవసర సేవలు మినహా వ్యాపార సముదాయలను స్వచ్ఛందంగా మూసివేశారు.
టీజేఏసీ నాయకులు ఆర్టీసీ బస్సులను అడ్డుకున్నారు. టీఆర్‌ఎస్, సీపీఐ, కాంగ్రెస్ నాయకులు బస్టాండ్ ఆవరణలో మానవహారం చేపట్టారు. నాగర్‌కర్నూల్‌లో టీఆర్‌ఎస్, సీపీఐ, సీపీఎం నాయకులు, కార్యకర్తలు ఆర్టీసీ డిపో వద్ద బైఠాయించారు. అంతకుముందే కొన్ని బస్సులు డిపో నుంచి వెళ్లిపోవడంతో మిగిలినవాటిని కూడా బయటకు రానివ్వకుండా అడ్డుకున్నారు. స్థానిక బస్టాండ్ కూడలిలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. పోలవ రం బిల్లును వ్యతిరేకిస్తూ టీజేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన బంద్ జడ్చర్ల నియోజకవర్గంలో ప్రశాంతంగా ముగిసింది. వనపర్తిలో ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. తెలంగాణవాదులు నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దహనం చేసి కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. బంద్‌లో భాగంగా దేవరకద్ర, కొత్తకోట, అడ్డాకుల, సీసీకుంట, భూత్పూర్ మండల కేంద్రాల్లో వ్యాపారసంస్థలను స్వచ్ఛందంగా మూసిఉంచారు.
‘పేట’, నియోజకవర్గాల పరిధిలో బంద్ ప్రశాంతంగా కొనసాగింది. కొల్లాపూర్, మక్తల్, గద్వాల నియోజకవర్గాల్లో వ్యాపారులు ముందుగానే వ్యాపారసంస్థలను స్వచ్ఛందంగా మూసివేశారు. అలంపూర్‌లో ఆర్టీసీ బస్సులు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులుపడ్డారు. కల్వకుర్తిలో సీపీఎం, కాంగ్రెస్‌పార్టీలు బంద్‌లో పాల్గొన్నాయి. అచ్చంపేటలో ఉదయం నాలుగు గంటల నుంచే సీపీఎం, టీఆర్‌ఎస్, జేఏసీ నాయకులు ఆర్టీసీ డిపోగేటు ఎదుట బైఠాయించి బస్సులను అడ్డుకున్నారు.