తీరు మారకుంటే చర్యలు
- అధికారులకు కలెక్టర్ సత్య నారాయణ హెచ్చరిక
- ఆలూరు, దేవనకొండ ఆస్పరి మండలాల్లో సుడిగాలి పర్యటన
ఆలూరు: ‘పల్లెప్రగతి కోసం పని చేయాలనే తపన ఉండాలి.. అలాంటి అధికారులు, ప్రజాప్రతినిధులను ప్రభుత్వంతోపాటు ప్రజలు కూడా గురిస్తారు’ అని జిల్లా కలెక్టర్ సత్యనారాయణ అన్నారు. అలా కాకుండా నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులు ఇప్పటికైనా పనితీరు మార్చుకోవాలని, లేదంటే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. పల్లె పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ గురువారం ఆలూరు నియోజకవర్గ పరిధిలోని ఆలూరుతోపాటు దేవనకొండ మండలం కరివేముల, ఆస్పరి మండలం వెంగళాయిదొడ్డి గ్రామాల్లో పరర్యటించారు. చెరువుల పూడిక తీత, కాల్వ మరమ్మతు పనులను ప్రారంభించారు. ఆలూరులోని జీన్స్ ప్యాంట్ కుట్టుశిక్షణ కేంద్రం, ప్రభుత్వాసుపత్రిని తనిఖీ చేశారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులను సక్రమంగా వినియోగిస్తే పల్లె ప్రగతికి డోకా ఉండదన్నారు. నిధులు మంజూరైనా పనుల్లో జాప్యం జరిగితే అధికారులపై చర్యలు తప్పవన్నారు. పల్లెపిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా ప్రతి పంచాయతీని వారంలో రెండు, మూడుసార్లు సందర్శించి అభివృద్ధి పనులపై ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలన్నారు.
వైద్యుల నియామకానికి హామీ ..
ఆలూరు ప్రభుత్వాసుపత్రిని జిల్లా కలెక్టర్ తనికీ చేశారు. రికార్డులు పరిశీలించారు. ఏఎన్ఎంల పనితీరు ఇంత దారుణంగా ఉందేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. పనితీరు మార్చుకోవాలని డాక్టర్లకు సూచించారు. ఎల్లార్తి రోడ్డులోని జీన్స్ప్యాంట్ కుట్టు శిక్షణ కేంద్రాన్ని పరిశీలించారు. శిక్షణ కేంద్రంలో మహిళలకు పూర్తిస్థాయిలో వసతులు కల్పించాలని డీఆర్డీఏ పీడీ రామకృష్ణను ఆదేశించారు. ఆయా కార్యక్రమాల్లో డ్వామా పీడీ పుల్లారెడ్డి, జెడ్పీ సీఈఓ ఈశ్వర్, మైనర్ ఇరిగేషన్ ఎస్ఈ రామచంద్రరావు, ఆదోని ఆర్డీఓ ఓబులేసు, రాష్ట్ర జల వనరుల అపెక్స్ కమిటీ సభ్యుడు కుమార్గౌడు, వెంగళాయిదొడ్డి చెరువు నీటి సంఘం అధ్యక్షుడు మల్లికార్జునగౌడు, ఆయా మండలాల అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
నేలకొరిగిన విద్యుత్ స్తంబాలు
చీకట్లోనే సమీక్ష..
పత్తికొండ రూరల్: మండల పరిధిలోని దూదేకొండ శివారులో గురువారం సాయంత్రం పెనుగాలుల కారణంగా విద్యుత్ స్తంభాలు నేలకూలడం, చెట్లు కూలి తీగలపై పడడంతో సరఫరాలో అంతరాయం ఏర్పడింది. అదే సమయంలో పత్తికొండ ఎంపీడీఓ కార్యాలయంలో కలెక్టర్ సి.సత్యనారాయణ చీకటీలో అధికారులతో సమీక్ష నిర్వహించారు.