palturu
-
హోరాహోరీగా రాష్ట్ర స్థాయి రాతిదూలం పోటీలు
మొదటి, రెండో స్థానంలో కర్నూలు జిల్లా ప్యాపిలి మండల ఎడ్లు ఉరవకొండ : అనంతపురం జిల్లా విడపనకల్లు మండలంలోని పాల్తూరులో వెలసిన సుంకలా పార్వతీదేవి రథోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో శనివారం నిర్వహించిన రాష్ట్రస్థాయి రాతిదూలం లాగుడు పోటీలు హోరాహోరీగా సాగాయి. సర్పంచ్ నాగరాజు గౌడ్, ఉప సర్పంచ్ బసన్న గౌడ్, ఎంపీటీసీ సభ్యులు వజీమాబి, కుమార్‌స్వామి, గ్రామ పెద్దల అధ్వర్యంలో జరిగిన పోటీల్లో కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం పీఆర్ పల్లికి చెందిన చంద్ర అనే రైతు ఎడ్లు 20 నిమిషాల్లో 1400 అడుగుల వరకు దూలాన్ని లాగి మొదటి స్థానంలో నిలిచాయి. అదే జిల్లా ప్యాపిలికి చెందిన బాషా ఎడ్లు 1032 అడుగులతో రెండో స్థానాన్ని దక్కించుకున్నాయి. అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం మదిగుబ్బకు చెందిన మాధవరాజు ఎద్దులు 1019 అడుగులతో మూడో స్థానం, ఆర్.ఆర్.పల్లికిచచెందిన కోటేశ్వరరావు ఎడ్లు 801 అడుగులతో నాల్గవ స్థానంలో నిలిచాయి. విజేతలకు వరుసగా రూ.40 వేలు, రూ.30 వేలు, రూ.20 వేలు, రూ.10 వేలు నగదు బహుమతులను నిర్వాహకులు అందించారు. పోటీల్లో పాల్గొన్న, చూసేందుకు వచ్చిన వేలాది మందికి భోజన సదుపాయం కల్పించారు. -
పాల్తూరు ఎస్ఐ వీరంగం
టీడీపీ నాయకులు ఎంత చెబితే అంత..! రైతును లాఠీలతో కుళ్లపొడిచిన వైనం ఎస్ఐ ఖాన్‌పై చర్యలు తీసుకోవాలి ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి డిమాండ్ విడపనకల్లు : పాల్తూరు ఎస్ఐ ఖాన్ ఆగడాలు రోజు రోజుకు మితిమీరుతున్నాయి. అధికార పార్టీ కనుసన్నల్లో పని చేస్తూ అమాయక రైతులను, వైఎస్సార్ సీపీ నాయకులను టార్గెట్ చేస్తూ వేధింపులకు గురి చేస్తున్నారు. టీడీపీ నాయకుల ఒత్తిడితో పాల్తూరు గ్రామానికి చెందిన రైతు తారాపురం బసవరాజును స్టేషన్‌కు తీసుకెళ్లి బట్టలు విప్పి లాఠీలతో కుళ్లబొడిచిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. తన సొంత పొలంలోకి పై నుంచి వర్షపు నీరు అధికంగా వస్తూ తన పొలం పాడవుతోందని వర్షపు నీరు బయటికి వెళ్లే విధంగా చిన్న కాలువ (కెనాల్) తవ్వించానని బాధితుడు చెప్పాడు. అధికార పార్టీ నాయకుల మాటలు విని తవ్విన కెనాల్‌ను పూడ్చకపోతే నీ అంతు చూస్తానని బెదిరించాడన్నారు. నా సొంత పొలంలో కెనాల్ తవ్వించుకున్నానని చెప్పినా వినకుండా స్టేషన్‌కు పిలిపించి టీడీపీ నాయకుల ఎదుట బట్టలు ఊడదీయించి లాఠీలతో కుళ్ల పొడిచాడని రైతు కన్నీటి పర్యంతమయ్యాడు. వైఎస్సార్ సీపీ నాయకుల ఫిర్యాదు ఎలాంటి తప్పు లేకున్నా అమాయక రైతులపైన, వైఎస్సార్ సీపీ నాయకులపైన ఎస్ఐ ఖాన్ దుర్మార్గంగా దాడి చేస్తున్నాడని వైఎస్సార్ సీపీ నాయకులు రైతు బసవరాజు, అక్కంగారి ఈశ్వర్,ఫకృద్దీన్,శ్రీనివాస గౌడ్,షన్ముఖ గౌడ్లు ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పాల్తూరు ఎస్ఐ ఖాన్ తెలుగుదేశం పార్టీ నాయకుల ఇళ్లలో పని చేస్తున్నారా ...? లేక ప్రజల కోసం పని చేస్తున్నారా...? అని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్యాయంగా రైతు బసవరాజును ఎస్ఐ ఖాన్ లాఠీలతో కొట్టడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. అమాయక రైతులు, వైఎస్సార్ సీపీ నాయకులను టార్గెట్ చేస్తున్న ఎస్ఐ ఖాన్ తీరుపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తామన్నారు. మానవ హక్కుల కమిషన్‌కు సైతం ఫిర్యాదు చేస్తామని ఆయన అన్నారు. ఎస్ఐ ఖాన్‌పై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.