హోరాహోరీగా రాష్ట్ర స్థాయి రాతిదూలం పోటీలు
మొదటి, రెండో స్థానంలో కర్నూలు జిల్లా ప్యాపిలి మండల ఎడ్లు
ఉరవకొండ : అనంతపురం జిల్లా విడపనకల్లు మండలంలోని పాల్తూరులో వెలసిన సుంకలా పార్వతీదేవి రథోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో శనివారం నిర్వహించిన రాష్ట్రస్థాయి రాతిదూలం లాగుడు పోటీలు హోరాహోరీగా సాగాయి. సర్పంచ్ నాగరాజు గౌడ్, ఉప సర్పంచ్ బసన్న గౌడ్, ఎంపీటీసీ సభ్యులు వజీమాబి, కుమార్‌స్వామి, గ్రామ పెద్దల అధ్వర్యంలో జరిగిన పోటీల్లో కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం పీఆర్ పల్లికి చెందిన చంద్ర అనే రైతు ఎడ్లు 20 నిమిషాల్లో 1400 అడుగుల వరకు దూలాన్ని లాగి మొదటి స్థానంలో నిలిచాయి.
అదే జిల్లా ప్యాపిలికి చెందిన బాషా ఎడ్లు 1032 అడుగులతో రెండో స్థానాన్ని దక్కించుకున్నాయి. అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం మదిగుబ్బకు చెందిన మాధవరాజు ఎద్దులు 1019 అడుగులతో మూడో స్థానం, ఆర్.ఆర్.పల్లికిచచెందిన కోటేశ్వరరావు ఎడ్లు 801 అడుగులతో నాల్గవ స్థానంలో నిలిచాయి. విజేతలకు వరుసగా రూ.40 వేలు, రూ.30 వేలు, రూ.20 వేలు, రూ.10 వేలు నగదు బహుమతులను నిర్వాహకులు అందించారు. పోటీల్లో పాల్గొన్న, చూసేందుకు వచ్చిన వేలాది మందికి భోజన సదుపాయం కల్పించారు.