పాల్తూరు ఎస్‌ఐ వీరంగం
Published Fri, Jul 15 2016 12:49 PM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
టీడీపీ నాయకులు ఎంత చెబితే అంత..!
రైతును లాఠీలతో కుళ్లపొడిచిన వైనం
ఎస్‌ఐ ఖాన్‌పై చర్యలు తీసుకోవాలి
ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి డిమాండ్
విడపనకల్లు : పాల్తూరు ఎస్‌ఐ ఖాన్ ఆగడాలు రోజు రోజుకు మితిమీరుతున్నాయి. అధికార పార్టీ కనుసన్నల్లో పని చేస్తూ అమాయక రైతులను, వైఎస్సార్ సీపీ నాయకులను టార్గెట్ చేస్తూ వేధింపులకు గురి చేస్తున్నారు. టీడీపీ నాయకుల ఒత్తిడితో పాల్తూరు గ్రామానికి చెందిన రైతు తారాపురం బసవరాజును స్టేషన్‌కు తీసుకెళ్లి బట్టలు విప్పి లాఠీలతో కుళ్లబొడిచిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. తన సొంత పొలంలోకి పై నుంచి వర్షపు నీరు అధికంగా వస్తూ తన పొలం పాడవుతోందని వర్షపు నీరు బయటికి వెళ్లే విధంగా చిన్న కాలువ (కెనాల్) తవ్వించానని బాధితుడు చెప్పాడు. అధికార పార్టీ నాయకుల మాటలు విని తవ్విన కెనాల్‌ను పూడ్చకపోతే నీ అంతు చూస్తానని బెదిరించాడన్నారు. నా సొంత పొలంలో కెనాల్ తవ్వించుకున్నానని చెప్పినా వినకుండా స్టేషన్‌కు పిలిపించి టీడీపీ నాయకుల ఎదుట బట్టలు ఊడదీయించి లాఠీలతో కుళ్ల పొడిచాడని రైతు కన్నీటి పర్యంతమయ్యాడు.
వైఎస్సార్ సీపీ నాయకుల ఫిర్యాదు
ఎలాంటి తప్పు లేకున్నా అమాయక రైతులపైన, వైఎస్సార్ సీపీ నాయకులపైన ఎస్‌ఐ ఖాన్ దుర్మార్గంగా దాడి చేస్తున్నాడని వైఎస్సార్ సీపీ నాయకులు రైతు బసవరాజు, అక్కంగారి ఈశ్వర్,ఫకృద్దీన్,శ్రీనివాస గౌడ్,షన్ముఖ గౌడ్‌లు ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పాల్తూరు ఎస్‌ఐ ఖాన్ తెలుగుదేశం పార్టీ నాయకుల ఇళ్లలో పని చేస్తున్నారా ...? లేక ప్రజల కోసం పని చేస్తున్నారా...? అని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్యాయంగా రైతు బసవరాజును ఎస్‌ఐ ఖాన్ లాఠీలతో కొట్టడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. అమాయక రైతులు, వైఎస్సార్ సీపీ నాయకులను టార్గెట్ చేస్తున్న ఎస్‌ఐ ఖాన్ తీరుపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తామన్నారు. మానవ హక్కుల కమిషన్‌కు సైతం ఫిర్యాదు చేస్తామని ఆయన అన్నారు. ఎస్‌ఐ ఖాన్‌పై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
Advertisement