రోడ్డుపై ధర్నా చేస్తున్న గ్రామస్తులు, కాలర్ పట్టుకుని నాగిరెడ్డిని ఈడ్చుకువస్తున్న ఎస్‌ఐ అనిల్‌కుమార్
రెడ్డిగూడెం (మైలవరం) : శాంతి భద్రతలను పరిరక్షించాల్సిన ఎస్.ఐ. విధి నిర్వహణలో ఓ వీధి రౌడీలా వ్యవహరించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిన ఘటన మండలంలోని మిట్టగూడెం ప్రధాన సెంటర్‌లో గురువారం చోటు చేసుకుంది.
రెడ్డిగూడెం నుంచి సీఎం బందోబస్తుకు వెళ్తున్న స్థానిక ఎస్.ఐ. అనిల్‌కుమార్.. మండలంలోని మిట్టగూడెం సెంటర్‌లో రోడ్డు పక్కన ట్రాక్టర్‌లో మామిడి కాయల ఖాళీ బాక్స్‌లు వేసుకుంటున్న రైతుల దగ్గరకు వెళ్లి దురుసుగా ప్రవర్తించి చెయ్యి చేసుకున్నాడు. ‘ట్రాక్టర్ ఎవడిదిరా...’ అంటూ రైతు అలవాల నర్సారెడ్డిపై చెయ్యి చేసుకోవడంతో అక్కడే ఉన్న మరో మామిడి రైతు నరెడ్ల నాగిరెడ్డి ఇదేమని ప్రశ్నించాడు. దీంతో అతని కాలర్ పట్టుకుని లాక్కురావడంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎస్.ఐ. ఓవర్ యాక్షన్ చూస్తున్న గ్రామస్తులు అక్కడకు చేరుకున్నారు. వారిని చూసి కంగుతిన్న ఎస్.ఐ. అక్కడ నుంచి ఉడాయించాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు అధిక సంఖ్యలో మిట్టగూడెం ప్రధాన కూడలికి చేరుకుని రోడ్డుపై ధర్నాకు దిగారు. ఎస్.ఐ. అనిల్‌కుమార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
రైతులపై చెయ్యి చేసుకున్న ఎస్.ఐ.ని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. బాధిత రైతులకు క్షమాపణ చెప్పాలంటూ నినాదాలు చేశారు. సమాచారం తెలుసుకున్న మైలవరం సీఐ రామచంద్రరావు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో చర్చలు జరిపారు. రైతులను అనవసరంగా కొట్టిన ఎస్.ఐ.ని సస్పెండ్ చేసే వరకు ఆందోళన విరమింపచేసేది లేదని వారు భీష్మించుకుని కూర్చున్నారు. విచారణ జరిపి ఎస్.ఐ.పై చర్యలకు నివేదికను ఉన్నతాధికారులకు పంపుతామంటూ సీఐ సర్దిచెప్పడంతో ఆందోళనకారులు శాంతించారు. కాగా నాలుగు కూడలి సెంటర్‌లో రైతుల ధర్నాతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. నూజివీడు – గంపలగూడెం రహదారి, విజయవాడ – విస్సన్నపేట రహదారులపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. అనంతరం తమపై దాడి చేసిన ఎస్.ఐ.పై చర్యలు తీసుకోవాలంటూ అలవాల నర్సారెడ్డి, నరెడ్ల నాగిరెడ్డి రెడ్డిగూడెం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment