అన్నదాత ఆగ్రహం
ఆదోని : వేరుశనగ విత్తనం కోసం గురువారం రైతులు ఆదోని పట్టణంలో రాస్తారోకో నిర్వహించారు. సబ్ డివిజన్ పరిధిలోని మూడు వందల మందికి పైగా రైతులు స్థానిక వ్యవసాయ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే విత్తనాలు లేవనే సమాధానంతో తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. వేరుశనగ విత్తనం సరఫరాలో ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ రోడ్డెక్కారు. రైతు సంఘం నాయకులు వెంకటేశ్వర్లు, ఈరన్న, మహానందరెడ్డి, రామాంజినేయులు, వైఎస్‌ఆర్సీపీ జెడ్పీటీసీ సభ్యుడు ఆనందు వీరికి మద్దతు పలికారు. సర్కిల్ వద్ద కొందరు రోడ్డుపై బైఠాయించగా మరి కొందరు రాస్తారోకోకు దిగారు.
సకాలంలో విత్తనం సరఫరా చేయని అధికారులు డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినదించారు. ట్రాఫిక్ స్తంబించిపోవడంతో వన్ టౌన్ పోలీసులు వచ్చి.. ఎన్నికల కోడ్ అమలులో ఉందని, ఆందోళన విరమించాలని కోరారు. తమ ఆవేదనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నామని.. జైలుకు పంపాలనుకుంటే పంపండి అంటూ ఎస్‌ఐ రామయ్యతో రైతులు వాగ్వాదానికి దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఎస్‌ఐ వెంటనే ఏడీఏ చెంగలరాయుడితో ఫోన్‌లో మాట్లాడగా.. జేడీఏ వస్తున్నారని చెప్పడంతో పోలీసులు రైతులను ఏడీఏ కార్యాలయాలనికి తీసుకు వెళ్లారు. అయితే అక్కడ జేడీఏ లేకపోవడంతో కార్యాలయం ఎదుట రైతులు ైబె ఠాయించారు.
టూ టౌన్ ఎస్‌ఐ ఇంతి యాజ్ బాషా, సిబ్బంది వచ్చి ఆందోళన కారులకు నచ్చచెప్పే ప్రయత్నం చేస్తుండగా జేడీఏ ఠాగూర్‌నాయక్ అక్కడి వచ్చారు. ఆయనను చుట్టుముట్టి రైతులు నిలదీశారు. సోమవారం జిల్లాకు దాదాపు వెయ్యి క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు సరఫరా అవుతాయని, ఇందులో ఐదు వందల క్వింటాళ్లు ఆదోనికి కేటాయిస్తామని ఆయన హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విమరించారు.
విత్తన పంపిణీలో నిర్లక్ష్యాన్ని సహించం
ఆదోని అర్బన్: సబ్సిడీ విత్తన పంపిణీలో నిర్లక్ష్యాన్ని ఎట్టిపరస్థితుల్లో సహించేది లేదని వ్యవసాయ అధికారులను కలెక్టర్ విజయమోహన్ హెచ్చరించారు. గురువారం సాయంత్రం ఆయన ఆదోనిలోని విత్తన పంపిణీ కేంద్రాన్ని పరిశీలించారు. ఆదోనిలో విత్తన పంపిణీ అస్తవ్యస్తంగా ఉందని దీనిపై అధికారులు పట్టించుకోకుండా ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక నుంచి విత్తన పంపిణీ విషయంలో నిర్లక్ష్యం జరగకుండా చూడాలని జేడీఏ ఠాగూర్ నాయక్‌కు సూచించారు. రోజూ విత్తన పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించాలని తహశీల్దార్ శ్రీనివాసరావును ఆదేశించారు. గోదాములో ఉన్న ఎరువులను తనిఖీ చేశారు.