లారీ- కారు ఢీ: దంపతులు మృతి
కనగానపల్లి మండలం పర్వతదేవపల్లి వద్ద ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్న వాహనం ఈ రోజు తెల్లవారుజామున బోల్తా పడింది. ఆ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిలో వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు.పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని ఎర్రచందన దుంగలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మృతదేహన్ని పోస్ట్మార్టం నిమిత్తం అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. క్షతగాత్రుడిని కూడా అదే ఆసుపత్రికి తరలించారు. ఎర్రచందనం దుంగల అక్రమ రవాణపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
అదే జిల్లాలోని పామిడి మండలం గజరాంపల్లి సమీపంలో వేగంగా వెళ్తున్నలారీ, ఎదురుగా వస్తున్న కారుని ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో దంపతులు మరణించారు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.దాంతో పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహలను స్వాధీనం చేసుకుని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే మృతి చెందిన దంపతుల్లో భర్త సుబ్బరాయుడు రైల్వే అధికారి అని పోలీసులు తెలిపారు. అనంతరం లారీ డ్రైవర్ ను పోలీసులు ఆదుపులోకి తీసుకున్నారు. అతడిపై కేసు నమోదు చేశారు. అలాగే వైఎస్ఆర్ కడప జిల్లాని పుల్లంపేటలో హెచ్పీ గ్యాస్ గోడౌన్ వద్ద ఈ రోజు తెల్లవారుజామున లారీ - పాల వ్యాన్ ఢీ కొన్నాయి. ఆ ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని కడప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.