డిపాజిట్ దక్కితేనే గౌరవం..!
సాక్షి, మచిలీపట్నం : ఒక్క ఓటు తక్కువైనా పర్లేదు.. డిపాజిట్ మాత్రం వచ్చేటట్టు చూస్కో.. అన్నట్లుంది బరిలోకి దిగే అభ్యర్థుల పరిస్థితి. సార్వత్నిక ఎన్నికలకు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్నికలు ఇరు ప్రధాన పార్టీలకు జీవన్మరణ సమస్యగా మారడంతో విజయం సాధించేందుకు ఎవరికి వారు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ ఏడాది ఇండిపెండెంట్, ఇతర పార్టీల నుంచి అధిక మంది బరిలోకి దిగారు.
ఈ సారి పోటీ ప్రధాన పార్టీల మధ్యే ఉండటంతో.. అంతగా ప్రజాదరణ లేని పార్టీల తరపున, ఇండిపెండెంట్‌గా నామినేషన్ దాఖలు చేసిన వారు ఓట్లు రాబట్టుకుని ఎలాగైనా డిపాజిట్ మొత్తం వెనక్కు తీసుకునే ప్రయత్నాలు సైతం చేస్తుండగా.. మరి కొందరు తాము పోటీ చేశామన్న ప్రఖ్యాతి గడించేందుకు ఉర్రూతలు ఊగుతున్నారు. మరికొంత మంది తమకు డిపాజిట్లు దక్కకపోతే ప్రజల్లో శృంగభంగం తప్పదన్న భావనలో ఉన్నారు.
బరిలో 232 మంది అభ్యర్థులు
సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. నామినేషన్ల స్వీకరణ, ఉపసంహరణ ప్రక్రియ సైతం ఇప్పటికే ముగిసింది. దీన్ని బట్టి చూస్తే జిల్లాలోని 2 పార్లమెంట్ స్థానాలకు 27 మంది, 16 అసెంబ్లీకు 205 మంది పోటీలో నిలిచారు.
పార్లమెంట్‌కు రూ.25 వేలు, అసెంబ్లీకి రూ.10 వేలు
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు కొంత నగదు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. పార్లమెంట్ స్థానానికి పోటీ చేసే ఒక్కో అభ్యర్థి రూ.25 వేలు, అసెంబ్లీ అభ్యర్థి రూ.10 వేలు డిపాజిట్ చేయాల్సి ఉంది. ఎస్సీలకు రిజర్వు చేయడంతో అక్కడ మాత్రమే అభ్యర్థి కేవలం రూ.5 వేలు డిపాజిట్ చెల్లించారు. అయితే పోలైన ఓట్లలో కనీసం 1/6 వంతు ఓట్లు పొందితేనే డిపాజిట్లు ఇస్తారు. లేకపోతే ఆ డబ్బులన్నీ ఖజానాలోకి చేరుతాయని అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి.
ఇదంతా ఎన్నికల ఫలితాల అనంతరం పోలైన ఓట్లలో డిపాజిట్లు పొందిన వారికి మాత్రమే తిరిగి వస్తుంది. దీంతో గౌరవప్రదంగా డిపాజిట్ దక్కించుకునేలా ఓట్లు పొందాలని నాయకులు ప్రచారం చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల విషయానికొస్తే.. ఎస్సీ, ఎస్టీలు మాత్రమే అసెంబ్లీకు, పార్లమెంట్‌కు సగం డిపాజిట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఈ లెక్కన చూసుకుంటే తిరువూరు, పామర్రు, నందిగామ నియోజకవార్గల్లో పోటీ చేసే అభ్యర్థులు గెలిచినా, ఓడినా డిపాజిట్ నగదు వెనక్కు వస్తుంది.
రూ.26.95 లక్షల డిపాజిట్
త్వరలో జరగబోయే ఎన్నికలకు డిపాజిట్ నగదు పారింది. జిల్లాలో 2 పార్లమెంట్ స్థానాలకు 27 మంది బరిలో ఉండగా.. వారి ద్వారా రూ.6.75 లక్షలు, 16 శాసనసభ స్థానాలుండగా.. అందులో 3 ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గాలున్నాయి. 13 నియోజకవర్గాల పరిధిలో 172 మంది బరిలో ఉండగా..రూ.17.20 లక్షలు, మూడు ఎస్సీ నియోజకవర్గాల పరిధిలో 33 మంది అంటే.. రూ.1.65 లక్షలు సెక్యురిటీ డిపాజిట్‌గా ఎన్నికల అధికారులు సేకరించారు.