ప్రతి నీటిబొట్టూ సద్వినియోగం చేసుకుందాం
– సీఎం పర్యటన ప్రాంతాల్లో కలెక్టర్ తనిఖీ
– జిల్లాకు త్వరలో వ్యసాయాధారిత పరిశ్రమలు
– నీటిని నిల్వకు రూ.500 కోట్లు వెచిస్తున్నట్టు వెల్లడి
వి.కోట:
ప్రతి వర్షపు చినుకునూ సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సిద్ధార్థ్ జైన్ పిలుపునిచ్చారు. వీకోట మండలంలో ఆదివారం ముఖ్యమంత్రి పర్యటించనున్న పాముగానిపల్లె, బైరుపల్లె పంచాయతీలోని వ్యవసాయ క్షేత్రాలను, పంట సంజీవని గుంతలను శనివారం కలెక్టర్ తనిఖీ చేశారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. భూగర్భ జలాల పెంపుతో పాటు, చెరువులు, కుంటల్లో నీటిని నిల్వ చేసేందుకు రూ.500 కోట్లు వెచ్చిస్తున్నామన్నారు. ఇందుకోసం హంద్రీనీవా కాలువ పనులు శరవేగంగా సాగుతున్నాయన్నారు. గ్రామజలదర్శిని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో జల వనరుల వినియోగాన్ని సమీక్షిస్తామన్నారు. రెయిన్ గన్లు, స్ప్రింక్లర్ల ద్వారా ఎండిపోతున్న వేరుశనగ పంటను పూర్తిస్థాయిలో కాపాడుతామన్నారు. రైతులు సంఘాలుగా ఏర్పడి ఆధునిక పద్ధతులను అవలంభించి లాభాల బాట పట్టాలని సూచించారు. పలవునేరు, కుప్పం, మదనపల్లె ప్రాంతాలు హార్టికల్చర్ హబ్‌గా తయారయ్యాయన్నారు. త్వరలోనే వ్యవసాయాధారిత పరిశ్రమలు జిల్లాకు తరలివస్తాయన్నారు. రైతులు, జన్మభూమి కమిటీలు, నీటి సంఘాలు, అధికారులను ఏకం చేసి నీటి నిల్వలు, సమర్థ వినియోగానికి కృషి చేస్తున్నామన్నారు. జిల్లాలో 10 క్లస్టర్లలో సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నామన్నారు. రాజుపేట రోడ్డు వద్ద మ్యాంగో మార్కెట్‌కు ప్రతిపాదనలు పంపావున్నారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ కృతికా భాత్ర, డీఆర్డీఏ పీడీ వేణుగోపాల్‌రెడ్డి, జెడ్పీ సీఈవో పెంచలకిషోర్, జేసీ–2 వెంకటసుబ్బారెడ్డి, ఎమ్మెల్యే అవురనాథ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రామచంద్రనాయుడు, ఎంపీపీ సులోచన తదితరులు పాల్గొన్నారు.