పాములపర్తి..వరాలు మస్తు..
- ఇచ్చిన మాట కోసం వచ్చిన సీఎం
- గంటసేపు గ్రామస్థులతో భేటీ
- రూ.10 కోట్ల మేర నిధులు మంజూరు
- తబ్బిబ్బయిన గ్రామస్తులు
- పదిరోజుల్లో మళ్లీ వస్తానన్న కేసీఆర్
వర్గల్: సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. శనివారం ఆ గ్రామం మీదుగా వెళ్తూ ఆగకపోవడంతో స్థానికులు నిరాశ చెందారు. కారులో నుంచే మళ్లీ వస్తానంటూ సైగ చేశారు. అన్నట్టుగానే ఆదివారం ఫాంహౌస్ నుంచి హైదరాబాద్ వెళ్తూ మార్గమధ్యంలో వర్గల్ మండలం పాములపర్తి గ్రామంలో ఆగారు. స్థానికులతో మాట్లాడారు. వరాలు కురిపించి వారిని ఆనందంలో ముంచెత్తారు. మధ్యాహ్నం 2.30 గంటలకు నేరుగా గ్రామ చావిడి వద్దకు చేరుకున్న సీఎం ప్రజా ప్రతినిధులు,మహిళలతో సమావేశమయ్యారు. గ్రామసభ మాదిరిగా దాదాపు గంటపాటు వారి సమస్యలు విన్నారు. దాదాపు రూ.10 కోట్ల విలువ చేసే పథకాలు మంజూరు చేశారు.
పేదలకు 150 ఇళ్లు, సీసీ రోడ్లు, మురుగు కాల్వలు, బస్సు, బస్టాండ్, బోర్లు, మోటార్లు తదితర అనేక సమస్యలను పరిష్కరించేందుకు నిధులు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. మొదట సర్పంచ్ చంద్రకళ, ఎంపీటీసీ సభ్యురాలు స్వప్నలు అందజేసిన వినతి పత్రాలు స్వీకరించారు. స్థానికులతో మాటలు కలుపుతూ వారి సమస్యలను ఆరా తీసి పలు పథకాలను మంజూరు చేస్తున్నట్టు తెలిపారు. 10 రోజుల తరువాత మళ్లీ వస్తా, కాలనీకి కొబ్బరికాయ కొట్టి ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ ఇళ్లతో ఆదర్శవంతమైన కాలనీగా తీర్చిదిద్దుతామని పేర్కొంటూనే పేదోళ్లకు చెందాల్సిన ఇళ్లు అనర్హుల పాలుకాకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇదే సభలో పాతూరు సమస్యల పరిష్కారానికి అవసరమైన నిధులు మంజూరు చేస్తున్నట్టు సీఎం తెలిపారు. కార్యక్రమంలో గడా అధికారి హన్మంతరావు, ఆర్డీఓ ముత్యంరెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు పోచయ్య, ఎంపీపీ కళావతి, టీఆర్ఎస్ నాయకులు హన్మంతరాావు, పార్టీ మండల అధ్యక్షుడు పిట్ల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.