మనోళ్ల ‘ఉమ్మి’ తుడవడానికి వెయ్యి కోట్ల పైనే!
లాక్డౌన్ టైంలో మీరొకటి గమనించారా?.. రోడ్ల మీద బహిరంగ మలమూత్ర విసర్జనలు, ఉమ్మేయడాలు లాంటి చర్యలు బాగా తగ్గిపోయాయి. అఫ్కోర్స్.. బయటికి రాకపోవడం వల్ల చాలామందికి ఈ విషయం తెలియకపోయి ఉండొచ్చు. ఎప్పుడైతే జనసంచారం మొదలైందో.. మళ్లీ ఈ వ్యవహారం పుంజుకుంది. ‘దయచేసి ఇక్కడ ఉమ్మేయకండి’.. అని వాళ్ల వాళ్ల భాషల్లో అర్థమయ్యేలా బోర్డులు రాసి పెడుతున్నప్పటికీ.. మొహమాటానికి కూడా పోకుండా ఉమ్మేయడం మనవాళ్లకి అలవాటైన వ్యవహారమే!.
ఇక రోడ్ల సంగతి పక్కనపెడితే.. రైల్వే స్టేషన్లలో, రైళ్లలో, పట్టాల మీద.. ఆఖరికి రైళ్ల మీద కూడా నిర్మొహమాటంగా ఉమ్మేస్తుంటారు. మరి ఆ మరకల్ని పొగొట్టేందుకు భారతీయ రైల్వే శాఖ ఒక ఏడాదికి ఎంత ఖర్చు చేస్తోందో తెలుసా?
► పాన్ పరాగ్, గుట్కా(నిషేధం ఉన్నా కూడా), తంబాకు.. ఉమ్మి మరకల్ని, సిగరెట్ గుర్తులను పొగొట్టేందుకు సాలీనా 1,200 కోట్ల రూపాయల్ని ఖర్చు చేస్తోంది భారతీయ రైల్వే శాఖ.
► అదనంగా శుభ్రం చేయడం కోసం గాలన్ల గాలన్ల నీటిని ఉపయోగించాల్సి వస్తోంది.
► బహిరంగంగా ఉమ్మేయడం చాలామందికి అలవాటుగా ఉన్నా.. కొందరికి ఇదంతా ఇబ్బంది కలిగించే అంశం.
► ‘దయచేసి నన్ను వాడండి’.. అని రాసి ఉండే డస్ట్బిన్లను, మట్టి డబ్బాలను ఉపయోగించకుండా.. ఎక్కడపడితే అక్కడ ఉమ్మేయడం చూస్తుంటాం.
► శుభ్రతకు సంబంధించిన ఈ అంశంపై ప్రత్యేకించి గైడ్లైన్స్ లేకపోవడం, కఠిన చర్యలు లేకపోవడంతో గుట్కా బాబులు పద్దతి మార్చుకోలేకపోతున్నారు.
► ముఖ్యంగా కరోనా టైం కావడంతో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నా.. నిర్లక్ష్యం కనిపిస్తోంది.
► ఇంతకాలం విజ్ఞప్తులు-హెచ్చరిక బోర్డులు, ఛలానా వార్నింగ్ నోటీసులతో సరిపెట్టిన రైల్వే శాఖ.. తాజాగా వినూత్న ఆలోచనకు దిగింది.
► గ్రీన్ ఇన్నొవేషన్లో భాగంగా.. రీయూజబుల్, బయోడెగ్రేడబుల్ స్పిట్టూన్ను తీసుకొచ్చింది. పాకెట్ సైజులో ఉండే జీ స్పిట్టూన్ను డిస్పోజ్ చేసినప్పుడు మొక్కలు మొలుస్తాయి.
► దేశవ్యాప్తంగా 42 రైల్వే స్టేషన్లలో ఐదు నుంచి పది రూపాయల ధరకు ఈ పాకెట్సైజ్ డబ్బాల్ని అందిస్తున్నారు.
► ఎజైస్పిట్ అనే స్టార్టప్ పశ్చిమ, నార్తర్న్, సెంట్రల్ రైల్వే జోన్లలో కాంట్రాక్ట్ తీసుకుంది.
► ఈ స్పిట్టూన్ బ్యాగ్లు మట్టిలో సైతం కలిసిపోతాయి.
► మరకలు లేకుండా చూడొచ్చనే ఉద్దేశంతో తీసుకొచ్చింది. మరి ఈ మార్పు ఎంత వరకు వర్కవుట్ అవుతుందో చూడాలి!!
చదవండి: మారుమూల ప్రాంతాలకూ డిజిటల్ సేవలు