బాబూ..పదవిని వదలండి
లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పంచాది రాంబాబు
శ్రీకాకుళం అర్బన్: ముఖ్యమంత్రి చంద్రబాబు తన పదవికి రాజీనామా చేయాలని లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పంచాది రాంబాబు డిమాండ్ చేశారు. శ్రీకాకుళంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజకీయాన్ని వ్యాపారంలా నడుపుతున్నారనడానికి తెలంగాణ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఉదంతమే సాక్ష్యమన్నారు. ఎమ్మెల్యే ఓటు కొనుగోలుకు పాత్రదారులతోపాటు తెరవెనుక పథక రచన చేసిన సూత్రధారులనూ ప్రాసిక్యూట్ చేయాలని డిమాండ్ చేశారు. ఇందుకు సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి పాత్రపై ఆరోపణలు వస్తున్నందున చంద్రబాబు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి తన నిర్ధోషిత్వాన్ని నిరూపించుకునేందుకు సీబీఐ దర్యాప్తును కోరాలన్నారు. సమావేశంలో ఆ పార్టీ నాయకులు పి.ప్రవీణ్‌కుమార్, వి.వైకుంఠరావు, ఎ.మల్లేశ్వరరావు పాల్గొన్నారు.