Panchajanya
-
సీనియర్ జర్నలిస్టు పాంచజన్య కన్నుమూత
విజయవాడ/అవనిగడ్డ /సాక్షి, అమరావతి: కృష్ణాజిల్లా అవనిగడ్డ మండలంలోని అశ్వరావుపాలేనికి చెందిన పత్రికా సంపాదకుడు రేపల్లె నాగభూషణం అలియాస్ పాంచజన్య (60) విజయవాడలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతూ బుధవారం కన్నుమూశారు. జర్నలిజంలో కంట్రిబ్యూటర్ నుంచి ఎడిటర్ స్థాయి వరకు ఎదిగారు. దివిసీమలో పత్రికా విలేకరిగా ఆయన జర్నలిస్టు ప్రస్థానం మొదలయ్యింది. తరువాత హైదరాబాద్ వెళ్లి మహానగర్ పత్రికను స్థాపించి సంపాదకుడిగా వ్యవహరించారు. గతకొన్ని నెలల నుంచి ఆయన ఆంధ్రపత్రిక సంపాదకుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పాంచజన్యకు భార్య, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. పాంచజన్య మృతితో ఆయన స్వగ్రామమైన అశ్వరావుపాలెంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఈ వార్త తెలియగానే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగవీటి రాధాకృష్ణ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఐజేయూ, ఏపీయూడబ్ల్యూజే నాయకులు ఆస్పత్రికి వెళ్లి ఆయన మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించి కుటుంబసభ్యులను పరామర్శించారు. -
సంజయ్ దత్ గొప్పా.. ఎలా? : పాంచజన్య
న్యూఢిల్లీ : సంజయ్ దత్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘సంజూ’ చిత్రాన్ని ప్రశ్నిస్తూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) అధికారిక వార పత్రిక పాంచజన్య సమాజానికి బాలీవుడ్ ఏం సందేశం ఇవ్వాలనుకుంటోందో చెప్పాలని వ్యాఖ్యానించింది. ఈ మేరకు ఎడిటోరియల్ కాలమ్‌లో సంజూ సినిమాను ఉద్దేశించి ఓ కథనాన్ని ప్రచురించింది. హాలీవుడ్ ‘ది మ్యాన్ హూ న్యూ ఇన్ఫినిటీ’ పేరుతో గణిత శాస్త్రంలో మేధావి అయిన రామనుజం జీవిత చరిత్రను తెరకెక్కిస్తే, బాలీవుడ్ మాత్రం అండర్వరల్డ్కు సంబంధించిన వారిపై చిత్రాలను తీస్తోందంటూ మండిపడింది. అండర్‌వరల్డ్‌ను, సంజయ్ దత్ అవలక్షణాలను పొగుడుతూ సంజూ సినిమాను తీశారని వ్యాఖ్యానించింది. ముంబై పేలుళ్లలో సంజయ్ దత్ దోషిగా తేలడాన్ని, అతని అరెస్ట్‌ను, కూతురితో అతనికున్న సంబంధాలను కూడా ఈ సందర్భంగా పాంచజన్య ప్రస్తావించింది. సంజయ్ దత్‌కు లేని అవలక్షణం లేదు. అతడు 1993 బాంబు పేలుళ్లు, మత హింసలో పాలుపంచుకున్నాడు. మారణాయుధాలను తన దగ్గర దాచుకున్నాడు. మూడుసార్లు పెళ్లి చేసుకున్నాడు. తన కూతురిని కొన్నేళ్లుగా కనీసం కలవనేలేదు. సినిమాలో చూపించినట్లుగా అతనికి 308 మంది అమ్మాయిలతో శారీరక సంబంధం ఉంది. ఇదీ సంజయ్ దత్. అలాంటి వ్యక్తి జీవిత చరిత్రను తెరకెక్కించి పొగడ్తలతో ముంచెత్తడంపై తీవ్ర స్థాయిలో ఆ పత్రిక ధ్వజమెత్తింది. చిత్ర దర్శకుడు రాజ్‌కుమార్ హిరాణీపై కూడా పాంచజన్య విరుచుకుపడింది. గతంతో పీకే వంటి సినిమాను హిందువులకు వ్యతిరేకంగా హిరాణీ తీశారని, ఇప్పుడు అవలక్షణాలు ఎక్కువగా ఉన్న ఓ వ్యక్తిని సమాజానికి ఏదో చేసేసినట్లు హీరోను చేసి చూపించడం సరియైన పద్దతేనా? అని ప్రశ్నించింది. ఇలాంటి చిత్రాల నిర్మాణానికి గల్ఫ్ నుంచి నుంచి పెట్టుబడులు వస్తున్నాయా? అనే అనుమానాలు వ్యక్తం చేసింది. -
గోహంతకుల్ని చంపాలని వేదాలు చెప్పాయి
దాద్రిపై ఆరెస్సెస్ పత్రిక ‘పాంచజన్య’లో వ్యాఖ్యలు న్యూఢిల్లీ: ‘బీఫ్’పై చర్చకు ఆరెస్సెస్ పత్రిక ‘పాంచజన్య’ ఆజ్యం పోసింది. గోవధకు పాల్పడేవారిని చంపాలని వేదాల్లో ఉన్నదని వ్యాఖ్యానించింది. ‘హిందూ సమాజంలో గోవధ అనేది చాలా పెద్ద విషయం. హిందువుల్లో అనేకమందికి ఇది జీవన్మరణ సమస్య’ అని తన తాజా కవర్‌స్టోరీలో పేర్కొంది. దాద్రిలో ఇఖ్లాక్ అనే వ్యక్తి హత్య కారణం లేకుండా జరిగిందేమీ కాదని, వేదాల్లో సైతం గోవధకు పాల్పడిన వారిని చంపాలని నిర్దేశించినట్టు వ్యాఖ్యలు చేసింది. దాద్రి ఉదంతానికి నిరసనగా రచయితలు తమ అవార్డులను తిరిగివ్వడాన్ని తప్పుపట్టింది. దాద్రి గ్రామంలో గతంలో మతపరమైన ఉద్రిక్తతలు లేవని, అటువంటి గ్రామంలో చోటు చేసుకున్న ఈ ఘటన(ఇఖ్లాక్ హత్య) కారణం లేకుండా జరిగేందేమీ కాదన్న విషయాన్ని గమనించాలంది. ఇఖ్లాక్తోసహా ప్రస్తుతం భారత్‌లోని ముస్లిలు అందరూ కొన్ని తరాలకిందట హిందువులేనన్న ఆరెస్సెస్ వాదనను వ్యాసం పునరుద్ఘాటించింది. గోవధకు పాల్పడేవారిని శిక్షించే అనేకమంది ధైర్యశాలుల మాదిరిగానే ఇఖ్లాక్ పూర్వీకులు కూడా గోవుల రక్షకులేనని పేర్కొంది. వీరు గోసంరక్షకుల నుంచి గోవధకు పాల్పడేవారుగా మారడానికి మతమార్పిడులే కారణమంది. అయితే ఈ వ్యాఖ్యలు అవి రచయిత వ్యక్తిగతమైన అభిప్రాయాల సంపాదకుడు హితేశ్ శంకర్ అన్నారు. పాంచజన్యను నిషేధించాలి: అసదుద్దీన్ బిహార్‌లో ఉన్న ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ పాంచజన్య వ్యాఖ్యలను ఖండించారు. పాంచజన్యను నిషేధించాలని, పత్రిక యజమాని, ప్రచురణకర్తలపై కేసులు నమోదు చేయాలని అన్నారు. హిందుత్వ సిద్ధాంతకర్త సావర్కర్ గోవును పవిత్రంగా భావించలేదని, ఆయన అభిప్రాయాలను కొందరు తమ అవసరాలకు అనుకూలంగా మార్చుకున్నారని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ అన్నారు. ‘ఆవుతో ఉపయోగం తీరాక చంపి తినవచ్చు’ అని సావర్కర్ అన్నారని, దీన్ని ఆయన అనుచరులు ఆహ్వానించలేదని పేర్కొన్నారు.