‘బీఫ్’పై చర్చకు ఆరెస్సెస్ పత్రిక ‘పాంచజన్య’ ఆజ్యం పోసింది. గోవధకు పాల్పడేవారిని చంపాలని వేదాల్లో ఉన్నదని వ్యాఖ్యానించింది.
దాద్రిపై ఆరెస్సెస్ పత్రిక ‘పాంచజన్య’లో వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ‘బీఫ్’పై చర్చకు ఆరెస్సెస్ పత్రిక ‘పాంచజన్య’ ఆజ్యం పోసింది. గోవధకు పాల్పడేవారిని చంపాలని వేదాల్లో ఉన్నదని వ్యాఖ్యానించింది. ‘హిందూ సమాజంలో గోవధ అనేది చాలా పెద్ద విషయం. హిందువుల్లో అనేకమందికి ఇది జీవన్మరణ సమస్య’ అని తన తాజా కవర్‌స్టోరీలో పేర్కొంది. దాద్రిలో ఇఖ్లాక్ అనే వ్యక్తి హత్య కారణం లేకుండా జరిగిందేమీ కాదని, వేదాల్లో సైతం గోవధకు పాల్పడిన వారిని చంపాలని నిర్దేశించినట్టు వ్యాఖ్యలు చేసింది. దాద్రి ఉదంతానికి నిరసనగా రచయితలు తమ అవార్డులను తిరిగివ్వడాన్ని తప్పుపట్టింది. దాద్రి గ్రామంలో గతంలో మతపరమైన ఉద్రిక్తతలు లేవని, అటువంటి గ్రామంలో చోటు చేసుకున్న ఈ ఘటన(ఇఖ్లాక్ హత్య) కారణం లేకుండా జరిగేందేమీ కాదన్న విషయాన్ని గమనించాలంది.
ఇఖ్లాక్‌తోసహా ప్రస్తుతం భారత్‌లోని ముస్లిలు అందరూ కొన్ని తరాలకిందట హిందువులేనన్న ఆరెస్సెస్ వాదనను వ్యాసం పునరుద్ఘాటించింది. గోవధకు పాల్పడేవారిని శిక్షించే అనేకమంది ధైర్యశాలుల మాదిరిగానే ఇఖ్లాక్ పూర్వీకులు కూడా గోవుల రక్షకులేనని పేర్కొంది. వీరు గోసంరక్షకుల నుంచి గోవధకు పాల్పడేవారుగా మారడానికి మతమార్పిడులే కారణమంది. అయితే ఈ వ్యాఖ్యలు అవి రచయిత వ్యక్తిగతమైన అభిప్రాయాల సంపాదకుడు హితేశ్ శంకర్ అన్నారు.
పాంచజన్యను నిషేధించాలి: అసదుద్దీన్
బిహార్‌లో ఉన్న ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ పాంచజన్య వ్యాఖ్యలను ఖండించారు. పాంచజన్యను నిషేధించాలని, పత్రిక యజమాని, ప్రచురణకర్తలపై కేసులు నమోదు చేయాలని అన్నారు. హిందుత్వ సిద్ధాంతకర్త సావర్కర్ గోవును పవిత్రంగా భావించలేదని, ఆయన అభిప్రాయాలను కొందరు తమ అవసరాలకు అనుకూలంగా మార్చుకున్నారని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ అన్నారు. ‘ఆవుతో ఉపయోగం తీరాక చంపి తినవచ్చు’ అని సావర్కర్ అన్నారని, దీన్ని ఆయన అనుచరులు ఆహ్వానించలేదని పేర్కొన్నారు.