ఆవు అక్కడ 'మమ్మీ'.. ఇక్కడ 'యమ్మీ'!
గోవధ, పశుమాంసం విక్రయాల విషయంలో బీజేపీ 'ద్వంద్వ ప్రమాణాలను' పాటిస్తున్నదని ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. 'బీఫ్ విషయంలో బీజేపీ ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తున్నది. ఉత్తరప్రదేశ్‌లో ఆవును మమ్మీ (అమ్మ)గా ప్రచారం చేస్తున్న ఆ పార్టీ.. ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రం 'యమ్మీ' (రుచికరమైన మాంసం)గా చూస్తున్నది' అని ఎద్దేవా చేశారు.
ఒకవైపు యూపీలో కొత్త సీఎం యోగి ఆదిత్యనాథ్ గోవధ, అక్రమ మాంసం విక్రయాలపై ఉక్కుపాదం మోపుతుండగా.. మరోవైపు ఆ ప్రభావం ఈశాన్య రాష్ట్రాలపై ఉండబోదని బీజేపీ చెప్తోంది. వచ్చే ఏడాది ఈశాన్య రాష్ట్రాలలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ అధికారంలోకి వస్తే పశుమాంసంపై ఎలాంటి నిషేధం విధించబోమని నాగాలాండ్ బీజేపీ చీఫ్ విససోలీ లౌంగు స్పష్టం చేశారు.