'మేం ఓడితే బీఫ్ మర్చిపోవాల్సిందే'
హైదరాబాద్: ఇటీవల కాలంలో సర్దుమణిగిన బీఫ్ వివాదం మరోసారి రాజుకునే అవకాశం ఏర్పడింది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ఈ అంశానికి మరోసారి తెరలేపినట్లు తెలుస్తోంది. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన సభలో ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ 'మీకో విషయం చెప్తున్నాను.. ఈ ఎన్నికల్లో ఎంఐఎం ఓడిపోతే.. మైనార్టీ వర్గ ప్రజానీకమంతా బీఫ్ తినడం మర్చిపోవాల్సిందే' అని అన్నారు. అలా జరగకుండా ఉండాలంటే తమకు ఓటేసి గెలిపించాలని అన్నారు.
ఇదే సమయంలో బీజేపీ సర్కార్ ను ఆయన టార్గెట్ చేశారు. మహారాష్ట్రలో పేద ముస్లింలను, దళితులను టార్గెట్ చేసి బీఫ్ నిషేధించిందని ఆరోపించారు. 'వారు మహారాష్ట్రలో బీఫ్ నిషేధించి ఉండొచ్చు. కానీ ప్రధాని నరేంద్రమోదీ అధికార బాధ్యతలు చేపట్టి నుంచి భారత్ నుంచి విదేశాలకు బీఫ్ మాంసం ఎగుమతి అమాంతం పెరిగింది, నాకు తెలిసిన సమాచారం మేరకు 17 శాతానికి బీఫ్ ఎగుమతి పెరిగింది. దీనిపై మోదీ ఏం చేస్తారు' అని ఆయన ప్రశ్నించారు. మోదీ సాధారణంగా ఎక్కడ మాట్లాడినా మిత్రో(స్నేహితులు) అనే పదాన్ని ఉపయోగిస్తారని, అయితే, ఆపదం ఎక్కడైనా పనిచేయోచ్చేమోగానీ, హైదరాబాద్లో మాత్రం బడా (బీఫ్) ఒక్కటే పనిచేస్తుందని గత వారంలో నిర్వహించిన ర్యాలీలో అన్న విషయం తెలిసిందే.