ఆదివారం మీడియాతో మాట్లాడుతున్న బోర్డు కార్యదర్శులు సైఫుల్లా, మహేఫుజ్, జఫర్ జిలానీ, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తదితరులు
సాక్షి, హైదరాబాద్ : మూడు రోజులుగా నగరంలో జరిగిన ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా ప్లీనరీ సమావేశాలు ఆసక్తికర పరిణామాలతో ముగిశాయి. కోర్ కమిటీ సభ్యుడు మౌలానా సల్మాన్ నద్వీ బోర్డు నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా కొత్త బోర్డు ఏర్పాటు చేస్తానని వెల్లడించారు. బోర్డు కూడా నద్వీని తొలగిస్తున్నట్లు ప్రకటించడంతో బోర్డులో చీలిక ఏర్పడినట్లయింది. బోర్డు ప్లీనరీ తొలి రోజు సమావేశాలకు సల్మాన్ గైర్హాజరు కావడమే కాకుండా అదేరోజు బాబ్రీ మసీదు వివాదాన్ని పరిష్కరించడానికి శ్రీ శ్రీ రవిశంకర్‌ను బెంగళూరులో కలవడం వివాదానికి దారి తీసింది. దీనికి తోడు షరియత్ ప్రకారం బాబ్రీ మసీదును వేరే చోటుకు తరలించ వచ్చని రవిశంకర్‌కు సల్మాన్‌తో చెప్పడం పట్ల బోర్డు సభ్యులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు.
సల్మాన్‌పై బోర్డు ఆగ్రహం
రెండో రోజు సమావేశాలకు సల్మాన్ హాజరు కావడంతో ఎజెండా పక్కకు వెళ్లింది. పలువురు సభ్యులు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రవిశంకర్‌తో భేటీపై వివరణ ఇవ్వాలని పట్టుపట్టారు. దానికి సల్మాన్ బదులిస్తూ బాబ్రీ మసీదు వివాదాన్ని రాజకీయం చేస్తున్నారని.. అందుకే ఏళ్లుగా ఈ వివాదం కొనసాగుతోందన్నారు. కోర్టులో కాకుండా బయటే ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు రవిశంకర్‌తో కలసినట్లు చెప్పారు. దీంతో బోర్డు సభ్యులు అతని తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బోర్డుకు తెలపకుండా ఇలా ప్రవర్తించడం సరికాదన్నారు. దానికి ఆయన ఒప్పుకోలేదు. సల్మాన్‌కు ఇరువురు మత గురువులు మౌలానా రషీద్ మదనీ, మౌలానా మహమూద్ మదనీ మద్దతు ప్రకటించారు. ఈ నేపథ్యంలో సల్మాన్ బోర్డు నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించారు.
హైదరాబాద్ డిక్లరేషన్
ఆదివారం చివరి రోజున బోర్డు హైదరాబాద్ డిక్లరేషన్ పేరుతో కొన్ని నిర్ణయాలను ప్రకటించింది. బోర్డు కార్యదర్శులు మౌలానా ఖలీద్ సైఫుల్లా, జఫర్ జిలానీ, ఉమరైన్ మహేఫుజ్, డాక్టర్ అస్మ జహేరా, యాసీన్ ఉస్మానీ, రహీముద్దీన్, అసదుద్దీన్ ఒవైసీ విలేకరులతో మాట్లాడారు. భారతదేశంలో మైనారిటీలు ముఖ్యంగా ముస్లింలపై దాడులు పెరుగుతున్నాయన్నారు. ఫలితంగా ముస్లింలను అభద్రతాభావం వెన్నాడుతోందన్నారు. ముస్లింలను అనైక్యం చేయడానికి పలు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో షరియత్‌ను కాపాడుకుంటూ ముస్లింలను ఐక్యం చేయడమే తమ ముందున్న కర్తవ్యమని వారు పేర్కొన్నారు. బాబ్రీ మసీదు విషయంలో రాజీ పడే అవకాశం లేదని స్పష్టం చేశారు. షరియత్ దృష్టిలో మసీదు ఒకసారి నిర్మిస్తే ప్రళయం వచ్చినా అది మసీదుగానే ఉంటుందన్నారు. దాన్ని తరలించే ప్రసక్తే లేదన్నారు. ట్రిపుల్ తలాక్ బిల్లును రాజ్యసభలో ఆపడానికి తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తామన్నారు. ఇప్పటికే విపక్షాలతో మంతనాలు జరుపుతున్నామని, ఒకవేళ రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందితే ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు. ముస్లిం సముదాయంలో ట్రిపుల్ తలాక్‌పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ప్రస్తుతం షరియత్‌పై అవగాహన కల్పించడానికి కేంద్ర స్థాయిలో కమిటీ ఉందని.. దీన్ని రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి వరకు వ్యాపింపజేస్తామన్నారు.
కొత్త బోర్డు ఏర్పాటు: సల్మాన్
వివాదం నేపథ్యంలో శనివారం అర్ధరాత్రి సల్మాన్ నద్వీ మీడియాతో మాట్లాడుతూ.. ‘బాబ్రీ మసీదు వివాదాన్ని రాజకీయం చేస్తున్నారు. అందుకే ఏళ్లు గడిచినా అది పరిష్కారం కావడం లేదు. బోర్డును ఓ రాజకీయ పార్టీ హైజాక్ చేస్తోంది. బోర్డును అంతా భ్రష్టుపట్టించారు. అందుకే బోర్డు నుంచి నేను బయటికి వచ్చాను. కొత్తగా షరియత్ ఆధారిత బోర్డును ఏర్పాటు చేస్తున్నాను’అని ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment