
హైదరాబాద్ : రామ మందిరం సమస్యను అడ్డుపెట్టుకుని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని 2019లో రక్షించాలని సంఘ్ పరివార్ ప్రయత్నిస్తోందని ఎంఐఎమ్ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆర్‌ఎస్‌ఎస్, వీహెచ్‌పీ, బీజేపీలు రామ మందిరం సమస్యతో పబ్బం గడుపుకోవాలని భావిస్తున్నారని అన్నారు.
సున్నీ వక్ఫ్ బోర్డు తరఫున సుప్రీంకోర్టులో కపిల్ సిబాల్ వాదనను సమర్థించారు. ఓ వీహెపీ నాయకుడు, ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భాగవత్‌లు అక్టోబర్ 2018లో రామ మందిరం నిర్మాణం అవుతుందని ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇలాంటి వ్యాఖ్యలతో ముస్లింలను రెచ్చగొట్టి.. పబ్బం గడుపుకోవాలని వారు భావిస్తున్నారని అన్నారు.
ఉద్యోగాలు కల్పించడం, రైతుల ఆత్మహత్యలను ఆపడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. నోట్ల రద్దు, జీఎస్టీలు పేదవాడిని మరింత కుంగదీశాయని చెప్పారు. ఇలాంటి సమస్యల నడుమ ఎన్నికలు జరగాలే గానీ.. రామ మందిరం సమస్యతో కాదని అన్నారు.
సుప్రీం కోర్టులో సిబాల్ వాదనపై ఓ సెక్షన్ మీడియా క్రిటిసైజ్ చేస్తూ వార్తలు రాసిందని చెప్పారు. క్లయింట్‌ను దృష్టిలో ఉంచుకుని ఓ లాయర్ తన వాదనలను వినిపిస్తారనే మాటను మర్చిపోకూడదన్నారు.