సాక్షి, హైదరాబాద్: మక్కా మసీదు పేలుళ్ల కేసులో ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పు నూటికి నూరుపాళ్లూ అన్యాయమైనదని ఏఐఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అభిప్రాయపడ్డారు. సోమవారం తీర్పు వెలువడిన తర్వాత వరుస ట్వీట్లు చేసిన ఆయన.. జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ), మోదీ సర్కారులపై నిప్పులుచెరిగారు.
‘‘మక్కా మసీదు పేలుళ్లలో చనిపోయిన 9 మంది కుటుంబాలకు న్యాయం దక్కలేదు. ఉగ్రవాదాన్ని అంతం చేయాలన్న స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రం, ఎన్‌ఐఏలు వ్యవహరించాయి. అరెస్టైన ప్రధాన నిందితులకు 90 రోజుల లోపే బెయిల్ వచ్చినా, ఎన్‌ఐఏ సవాలు చేయలేదు. కేసులో కీలక సాక్షులు చాలా మంది 2014 తర్వాత మాటమార్చారు. కళ్లముందు ఇంత జరుగుతున్నా దర్యాప్తు సంస్థ ఎన్‌ఐఏ గుడ్డి, చెవిటిదానిలా మిన్నకుండిపోయింది. అది రాజకీయ జోక్యానికి తలొగ్గింది. ఇదే పరిస్థితి కొనసాగితే దేశంలో న్యాయమన్నదే లేకుండాపోయే ప్రమాదం ఉంది’’ అని అసదుద్దీన్ పేర్కొన్నారు.
11 ఏళ్ల నాటి మక్కా మసీదు పేలుళ్ల కేసులో ప్రధాన నిందితులు ఐదుగురినీ నిర్దోషులుగా ప్రకటిస్తూ ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు సోమవారం తీర్పు వెల్లడించిన సంగతి తెలిసిందే. నిందితులపై నేరారోపణలు నిరూపించటంలో ప్రాసిక్యూషన్ విఫలమైందన్న న్యాయమూర్తి.. 10 మంది నిదితుల్లో స్వామి అసిమానంద, భరత్, దేవెందర్ గుప్తా, రాజేందర్, లోకేశ్ శర్మలను నిర్దోషులుగా పేర్కొన్నారు. మిగిలినవారిపై చార్జిషీటు కొనసాగుతుందని తెలిపారు. 2007 మే 18 తేదీన మధ్యాహ్నం మక్కా మసీద్‌లో ప్రార్ధన సమయంలో టిఫిన్ బాంబు ద్వారా పేలుడు సంభవించింది. పేలుడు దాటికి 9 మంది చనిపోగా, అనంతరం చెలరేగిన అల్లర్లను నియంత్రించే క్రమంలో పోలీసులు కాల్పులు జరుపగా మరో ఐదుగురు మృతి చెందారు.
(చదవండి: మక్కా మసీదు పేలుడు కేసు కొట్టివేత)
Comments
Please login to add a commentAdd a comment