Mecca Masjid blast case
-
రవీందర్‌రెడ్డి వీఆర్ఎస్కు ఓకే
సాక్షి, హైదరాబాద్: మక్కా మసీదు బాంబు పేలుళ్ల కేసులో నిందితులందరినీ నిర్దోషులుగా ప్రకటిస్తూ సంచలన తీర్పు ఇచ్చిన న్యాయాధికారి కె.రవీందర్‌రెడ్డి స్వచ్ఛంద పదవీ విరమణకు హైకోర్టు శుక్రవారం ఆమోదం తెలిపింది. మే 31వ తేదీ నుంచే ఆయన వీఆర్ఎస్ అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. ఇప్పటివరకు ఆయన నిర్వర్తించిన హైదరాబాద్ నాలుగో అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి బాధ్యతలను.. 8వ అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జికి అప్పగించాలని సూచించింది. ఈ మేరకు హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ (ఆర్జీ) సీహెచ్ మానవేంద్రనాథ్ రాయ్ ఉత్తర్వులు జారీ చేశారు. వీఆర్ఎస్ దరఖాస్తు నోటీసు కాలం ముగియక ముందే హైకోర్టు ఆమోదం తెలపడం విశేషం. తీర్పు వెంటనే రాజీనామా కలకలం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ప్రత్యేక న్యాయస్థానం జడ్జిగా ఉన్న రవీందర్‌రెడ్డి.. మక్కా మసీదు బాంబు పేలుళ్ల కేసులో నిందితులందరినీ నిర్దోషులుగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తీర్పు ఇచ్చిన గంటలోపే ఆయన తన న్యాయాధికారి పదవికి రాజీనామా చేస్తున్నట్టుగా మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి (ఎంఎస్‌జే)కి లేఖ పంపడం కలకలం సృష్టించింది. అవినీతి ఆరోపణల వల్లే రవీందర్‌రెడ్డి రాజీనామా చేశారంటూ జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అయితే రాజీనామా చేస్తే పదవీ విరమణ ప్రయోజనాలేవీ దక్కవని సన్నిహితులు చెప్పడంతో రవీందర్‌రెడ్డి పునరాలోచన చేశారు. తన పదవీ విరమణకు కొద్ది నెలలే గడువు ఉండటం, సర్వీసు పొడిగించే అవకాశాలు లేకపోవడంతో రాజీనామాకు బదులుగా... వీఆర్ఎస్ కోసం హైకోర్టుకు దరఖాస్తు చేసుకున్నారు. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్ నేతృత్వంలోని కమిటీ ఇటీవల సమావేశమై.. దీనిపై నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఈ మేరకు రవీందర్‌రెడ్డి వీఆర్ఎస్ను ఆమోదిస్తూ.. ఉత్తర్వులు వెలువడ్డాయి. -
మక్కా పేలుళ్లపై పునర్విచారణ
సాక్షి, హైదరాబాద్ : మ క్కా మసీదు పేలుళ్ల కేసు పై పునర్విచారణ జరిపించాలని ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బుధవారం అర్ధరాత్రి సైదాబాద్‌లో జరిగిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. పునర్విచారణ జరపకుంటే కేసు పై సుప్రీంకోర్టుకు అప్పీల్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎన్ఐఏ తీరుతో ఐదుగురు నిందితులు సునాయాసంగా బయటపడ్డార న్నారు. వారు నిర్దోషులైతే, మరి పేలుళ్లు జరిపిందెవరని ప్రశ్నించారు. మక్కా ఘటనపై కోర్టు న్యాయం చేస్తుందనే నమ్మకం తమకుందని, నిందితులకు వ్యతిరేకంగా ఎన్ఐఏ బలమైన సాక్ష్యాలను ప్రవేశపెట్టలేకపోయిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి ఎన్ఐఏ తలొగ్గి కేసును నీరుగార్చిందని దుయ్యబాట్టారు. త్వరలో సంజోత కేసులోంచి కూడా నిందితులు బయటపడే అవకాశముందన్నారు. గవర్నర్‌ను కలిసిన ముస్లిం పెద్దలు మక్కా మసీదు పేలుళ్లపై పునర్విచారణ జరిపించాలని, లేదంటే సుప్రీం కోర్టుకు అప్పీల్ చేయాలని ప్రభుత్వానికి సూచించాలని ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఆధ్వర్యంలో ముస్లిం మత పెద్దలు గురువారం గవర్నర్ నరసింహన్‌ను కలిశారు. పేలుళ్ల కేసులో ఎన్ఐఏ ప్రదర్శించిన తీరును వివరిస్తూ వినతిపత్రం సమర్పించారు. -
జడ్జి రవీందర్ రెడ్డి రాజీనామాలో కొత్త ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్ : మక్కా మసీదు కేసులో సంచలన తీర్పును వెల్లడించిన ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జస్టిస్ రవీందర్ రెడ్డి రాజీనామాలో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. ఆయన రాజీనామా లేఖను హైకోర్టు చీఫ్ జస్టిన్ ఆమోదించలేదు. అంతేకాకుండా జడ్జి రవీందర్ రెడ్డి పెట్టుకున్న తాత్కాలిక సెలవును కూడా హైకోర్టు రద్దు చేసింది. దీంతో ఆయన గురురవారం యథావిధిగా విధులకు హాజరయ్యారు. కాగా మక్కా మసీదు పేలుళ్ల కేసుపై సోమవారం ఉదయం తీర్పు వెలువరించిన కొద్దిసేపటికే జస్టిస్ రవీందర్ రెడ్డి తన పదవికి రాజీనామా చేసిన విషయం విదితమే. అనంతరం ఆయన తన రాజీనామ లేఖను హైకోర్టు చీఫ్ జస్టిస్‌కు పంపించారు. అయితే మక్కా మసీదు బాంబు పేలుళ్ల కేసులో తీర్పు వెలువరించిన గంటల వ్యవధిలో రవీందర్ రెడ్డి రాజీనామా న్యాయవ్యవస్థలో తీవ్ర చర్చనీయాంశం, సంచలనంగా మారింది. కాగా రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే ఆయన రాజీనామా చేశారనే వార్తలు ప్రచారం జరిగింది. -
కాంగ్రెస్‌పై నెపం.. ఒవైసీ ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్ : మోదీ ప్రభుత్వంపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మరోసారి ఆగ్రహం వెలిబుచ్చారు. హిందూ ఉగ్రవాదం గత ప్రభుత్వాల నిర్వాకమేనని కొందరు బీజేపీ నేతలు వ్యాఖ్యానించటం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒవైసీ స్పందించారు. బుధవారం ఓ జాతీయ మీడియా ఛానెల్‌తో మాట్లాడిన ఆయన కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘మక్కా మసీదు పేలుడు తీర్పుపై బీజేపీ హర్షం వ్యక్తం చేస్తోంది. ఓ కేసులో బాధితుల తరపు కాకుండా.. నిందితుల వైపు ప్రభుత్వం నిలవటం బహుశా చరిత్రలో ఇదే ప్రథమం కాబోలు. హిందూ ఉగ్రవాదం కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ హయాంలోనే పుట్టిందని బీజేపీ చెబుతోంది. తప్పు మరొకరి మీదకు నెట్టేసి తప్పించుకునేందుకు యత్నిస్తున్నారు. అలాంటప్పుడు అజ్వీర్ దర్గా పేలుడు కేసులో దేవేంద్ర గుప్తా.. భావేశ్ పటేల్‌లు దోషులుగా నిర్ధారణ అయిన విషయాన్ని బీజేపీ మరిచిపోయిందేమో’ అంటూ ఒవైసీ పేర్కొన్నారు. ఇక కోర్టు తీర్పుపై మరోసారి స్పందించిన ఆయన.. ఇది పూర్తిగా ఎన్ఐఏ వైఫల్యమని వెల్లడించారు. ‘ ఈ విషయంలో కేంద్రాన్ని నేను హెచ్చరిస్తోంది ఒక్కటే.. నిందితులంతా ఇప్పుడు స్వేచ్ఛగా విహరిస్తూ.. దేశాన్ని ఓ స్మశానంలా మార్చే ప్రమాదం ఉంది’ అని ఒవైసీ పేర్కొన్నారు. తీర్పుపై అప్పీల్‌కు వెళ్లేందుకు బాధిత కుటుంబాలు సుముఖంగా ఉంటే న్యాయ సాయం అందించేందుకు సిద్ధమని ఆయన ప్రకటించారు. -
స్టార్ రైటర్‌కు బీజేపీ నేత కౌంటర్
సాక్షి, ముంబై : మక్కా మసీదు పేలుడు కేసు తీర్పు బాలీవుడ్ రచయిత, బీజేపీ నేతకు మధ్య ట్వీట్ల యుద్ధానికి దారితీసింది. తీర్పుపై స్పందించిన ప్రముఖ గేయ రచయిత జావెద్ అక్తర్.. ‘మిషన్ పూర్తయ్యింది. మక్కా పేలుడు కేసులో విజయం సాధించిన ఎన్ఐఏకు నా అభినందనలు. ఇక ప్రపంచంలో జరిగే కులాంతర వివాహలపై దర్యాప్తు చేపట్టేందుకు ఎన్ఐఏకు సమయం దొరికింది’ అంటూ బుధవారం ఓ ట్వీట్ చేశారు. దీనికి ఏపీ బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు(యూపీ తరపున ప్రాతినిథ్యం) తన ట్వీటర్లో స్పందించారు. ‘జావెద్ గారూ.. కాంగ్రెస్ చేస్తున్న హిందూ ఉగ్రవాదం ఆరోపణలను ఖండించే నిజాయితీ మీకుందని ఆశిస్తున్నా. సినిమాల్లో పాటలు రాసినట్లుగానే మీరు రాహుల్‌గాంధీ కోసం కల్పిత కథనాలను రాస్తున్నారేమో అనిపిస్తోంది. విద్వేషపూరిత చర్యలు మానుకుని.. మంచి సలహాలు ఇవ్వండి’ అంటూ నరసింహారావు ట్వీట్లు చేశారు. దీనికి కౌంటర్‌గా దిగ్గజ రచయిత మరో ట్వీట్ చేయగా.. దానికి బదులిస్తూ బీజేపీ ఎంపీ మరో ట్వీట్ చేశారు. ఇలా వాళ్ల ట్వీట్ల పర్వం కొనసాగుతున్న వేళ.. జావెద్ ట్వీట్లను ఆయన ఫ్యాన్స్, మరోవైపు బీజేపీ నేతలేమో నరసింహారావు ట్వీట్లను వైరల్ చేస్తూ విమర్శలు గుప్పించుకుంటున్నారు. Mission accomplished !! . My congratulations to NIA for their grand success in Mecca Masjid case. Now they have all the time in the world to investigate inter community marriages !!! — Javed Akhtar (@Javedakhtarjadu) 18 April 2018 Javed Ji, Wish you had the honesty to condemn @INCIndia for "Hindu Terror" formulation. Seems you are in awe of @RahulGandhi for writing a fictional script like you have done so well in films. OR, is "Hindu Terror" also your brainwave as your reported idea of "Maut Ka Saudagar?" https://t.co/35MTCJJal5 — GVL Narasimha Rao (@GVLNRAO) 18 April 2018 Dear Mr Rao , I don’t believe in terms like Hindu or Muslim terror . These terms wrongly accuse a whole community . An average person of every community wants peace and harmony . Troublemakers are the vested interest n the mad fringe and sadly no community is devoid of them — Javed Akhtar (@Javedakhtarjadu) 18 April 2018 Javed Ji, Pl do not attempt fake equivalence on terrorism with Islam. Jehadis wage a war in the name of Islam for "Zannat". Terror preachers like Zakir Naik aren't Buddhists but Islamists. @INCIndia paid a heavy price for your sordid ideas. Pl continue advising @RahulGandhi!! https://t.co/zVmBNO4GlZ — GVL Narasimha Rao (@GVLNRAO) 19 April 2018 -
‘కాంగ్రెస్ క్షమాపణలు చెప్పాలి’
సాక్షి, హైదరాబాద్ : 11 ఏళ్ల క్రితం హైదరాబాద్ మక్కా మసీదులో జరిగిన బాంబు పేలుడిపై కోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టులాంటిదని బీజేఎల్పీ నాయకుడు కిషన్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. బాంబు పేలుడిని అప్పటి కాంగ్రెస్ నాయకులు హిందూ టెర్రరిజమ్‌గా, కమల ఉగ్రవాదంగా ముద్ర వేయాలని యత్నించారని గుర్తు చేశారు. దేశ చరిత్రను మంట కలిపే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రవర్తించిందని అన్నారు. సోనియాగాంధీ, సుశీల్ కుమార్ షిండే, దిగ్విజయ్ సింగ్ లాంటి వారు ఆనాడు కాషాయ రంగు ఉగ్రవాదం మొదలైందని, ఇస్లాం, పాకిస్థాన్, మావోయిస్టుల ఉగ్రవాదం కంటే హిందూ ఉగ్రవాదం ప్రమాదకరమని వ్యాఖ్యానించారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ దివాలా కోరు రాజకీయానికి ఇది అద్దం పడుతుందని విమర్శించారు. ఉగ్రవాదానికి మతం, కులం ఉండదని అన్నారు. కాషాయ ఉగ్రవాదం అని వ్యాఖ్యానించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా బుద్ది తెచ్చుకోవాలని హితవు పలికారు. కోర్టుల్లో వాదనలు, సాక్ష్యాలు ఆధారంగానే తీర్పు చెబుతారే తప్ప మనుషులెవరో చూసి, ప్రాంతాలు ఏవో తెలుసుకుని తీర్పు చెప్పరని ఘాటుగా స్పందించారు. దేశంలో జరిగిన అన్ని మతకలహాలకు కాంగ్రెస్ పార్టీయే కారణమని అన్నారు. ‘దళితులను ఊచకోత కోసింది కాంగ్రెస్ పార్టీ. దేశంలో ఎక్కడ అల్లర్లు, ఉగ్రవాదం మూకలు చెలరేగినా దాని మూలాలు హైదరాబాద్‌లోనే ఉన్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో జరిగిన ఉగ్ర దాడులకు హైదరాబాద్, నల్గొండ, కరీంనగర్ల నుంచే మూలాలు ఏర్పడ్డాయి. అప్జల్ గురుపై ఇచ్చిన తీర్పు వెనక మన్మోహన్ సింగ్ ఉన్నారా?. కసబ్ తీర్పు వెనక సోనియాగాంధీ ఉన్నారా?. ఎంఐఎం పార్టీకి న్యాయవ్యవస్థ పై, పోలీసు వ్యవస్థపై గౌరవం లేదు. వాటి వెనక వారు ఉంటే నిన్న ఇచ్చిన తీర్పు పై మాట్లాడండి. ఇప్పటికైనా కాషాయ ఉగ్రవాదం అనే మాటలకు క్షమాపణ చెప్పాలి. జడ్జీ రాజీనామా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిగ్గు తేల్చాలి. టీవీల్లో వార్తలు చూశాం కానీ దీనిపై ఇంకా నిజాలు తెలియాల్సివుంది.’ అని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. -
జడ్జి రవీందర్ రెడ్డిపై అవినీతి ఆరోపణలు!
హైదరాబాద్: మక్కా మసీదులో బాంబు పేలుడు కేసులో సంచలన తీర్పు చెప్పిన జడ్జి రవీందర్‌రెడ్డికి సంబంధించి అనూహ్య కథనాలు వెలుగుచూస్తున్నాయి. ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు జడ్జిగా మక్కా పేలుళ్ల కేసును కొట్టివేసిన కొద్దిసేపటికే ఆయన రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. రెండు నెలల్లో పదవీ విరమణ పొందాల్సిన ఆయన హఠాత్తుగా వైదొలగడం, రాజీనామాకు గల కారణాలు స్పష్టంగా వెల్లడికాకపోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. రవీందర్ రెడ్డి రాజీనామాపై ఇటు నాంపల్లి కోర్టులో, అటు హైకోర్టులో ఎవరికి తోచిన కారణాలను వారు చెబుతున్నారు. కాగా, సదరు జడ్జిపై అవినీతి ఆరోపణలున్నాయని, ఇప్పటికే విజిలెన్స్ దర్యాప్తు కూడా సాగుతున్నదని ‘ఇండియా టుడే’ ఒక కథనాన్ని ప్రచురించింది. ఇప్పటికే హైదరాబాద్‌కు చెందిన పలువురు జడ్జిలు లంచాల కేసుల్లో అరెస్టై జైలుపాలైన నేపథ్యంలో తాజా కథనం ప్రాధాన్యం సంతరించుకుంది. (చదవండి: మక్కా మసీదు పేలుళ్ల కేసు కొట్టివేత) -
‘మక్కా’ పేలుడు కేసు.. ఆ ఆధారం ఏమైంది?
సాక్షి, హైదరాబాద్ : మక్కా మసీదు పేలుడు కేసులో ఎన్ఐఏ వైఫల్యంపై విమర్శలు వినిపిస్తున్న వేళ.. ఓ కీలక ఆధారం గురించి చర్చ మొదలైంది. పేలుడు తర్వాత ఘటనాస్థలం నుంచి ఓ ఎరుపు రంగు టీ షర్ట్‌ను స్థానిక పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. కేసులో ఇది కీలకంగా మారే అవకాశం ఉందని అప్పట్లో అంతా భావించారు. అయితే తర్వాత అది కనిపించకుండా పోవటం చర్చనీయాంశంగా మారింది. 2011లో సీబీఐ నుంచి ఈ కేసు ఎన్ఐఏకు బదిలీ కాబడింది. ఆ సమయంలో ఆ టీ షర్టును అధికారులు ఎన్ఐఏ బృందానికి అందజేయలేదంట. ఈ విషయాన్ని ఆ సమయంలో కేసు దర్యాప్తు చేపట్టిన ఎన్ఐఏ డైరెక్టర్(ప్రత్యేక) ఎన్ ఆర్ వాసన్ చెప్పినట్లు ఇప్పుడు ఓ ఆంగ్ల వెబ్సైట్ కథనం ప్రచురించింది.‘2007 మే 18 నిందితులు రెండు బాంబులతో పేలుళ్లకు యత్నించగా.. ఒక్కటి మాత్రమే పేలింది. ఘటన తర్వాత అక్కడికి చేరుకున్న పోలీసులు ఓ బ్యాగ్‌ను స్వాధీనపరుచుకున్నారు. అందులో పేలని బాంబును.. ఓ తాళపు చెవిని, ఓ ఎరుపు రంగు టీషర్ట్ ఉండగా.. వాటిని క్లూస్ టీం స్వాధీనపరుచుకుంది. తాళపుచెవి బహుశా పేలని ఐఈడీ(ఇంప్రూవ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్)కు చెందిందని భావించారు. అయితే ఫోరెన్సిక్ పరీక్షల్లో అది దానికి సరితూగకపోవటంతో ఆ ‘కీ’ మిస్టరీగా మిగిలిపోయింది. కానీ, అందులో దొరికిన ఎరుపు టీ షర్ట్ ఏమైందన్నది మాత్రం ఇప్పటిదాకా తేలలేదు. కేసు బదిలీ సమయంలో సీబీఐ ముఖ్యమైన పత్రాలను అందించిందే తప్ప.. ఆ టీషర్ట్‌ను మాకు ఇవ్వలేదు’ అని వాసన్ వ్యాఖ్యలను ఆ కథనం ఉటంకించింది. మరోవైపు 2013-బోధ గయ పేలుళ్ల కేసు.. అక్కడ దొరికిన ఓ బ్యాగ్ ఆధారంగానే చేధించబడింది. అందులో లభించిన దుస్తులపై ఉన్న రక్తపు మరకలు.. నిందితుడు హైదర్ అలీ డీఎన్‌ఐతో సరిపోలటంతో కేసు చిక్కుముడి వీడింది. అలాంటప్పుడు మక్కా పేలుళ్ల కేసులో అదృశ్యమైన ఆ ఎరుపు రంగు టీ షర్ట్ కూడా కీలకమే అయి ఉండేదన్న అభిప్రాయాన్ని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. మక్కా మసీద్ పేలుడు కేసులో తేజ్ పరమార్, రాజేంద్ర చౌదరీలు బాంబులు పెట్టినట్లుగా ఎన్ఐఏ పేర్కొంది. తేజ్ పరమార్ పెట్టిన బాంబు పేలకపోగా.. ఆ బ్యాగునే పోలీసులు స్వాధీనం చేసుకున్నారని వివరించింది. అయినప్పటికీ తేజ్ పరమార్ పేరును ఛార్జీ షీట్లో చేర్చకుండా.. పోలీసులు అతన్ని అరెస్ట్ మాత్రం చేశారు. 11 ఏళ్ల దర్యాప్తు తర్వాత సరైన ఆధారాలు లేకపోవటంతో మక్కా మసీద్ పేలుడు కేసును కొట్టేసిన నాంపల్లి ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానం.. ఐదుగురు నిందితులను నిర్దోషులుగా విడుదల చేసిన విషయం తెలిసిందే. మిగతా వారిపై మాత్రం విచారణ కొనసాగుతుందని కోర్టు ప్రకటించింది. -
మక్కా పేలుళ్ల కేసులో కేంద్ర వైఫల్యం
సాక్షి, హైదరాబాద్: మక్కామసీదు పేలుళ్ల కేసులో కేంద్రం సాక్ష్యా లు చూపించడంలో విఫలమైనందునే కేసును కొట్టివేశారని కాంగ్రెస్ నేత సర్వే సత్యనారాయణ విమర్శించారు. పేలుళ్లతో ఎవరికి సంబంధం ఉందో తెలియకుండా పోయిందని.. ఎవరూ దోషులు కాకపోతే పేలుళ్లు ఎలా జరిగాయని ప్రశ్నించారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా కూకట్పల్లి వైజంక్షన్‌లో జరిగిన ఘటనను ఆసరాగా చేసు కుని తనపై క్రిమినల్ కేసు పెట్టడం వెనుక ప్రభుత్వం కుట్ర ఉందన్నారు. తాను కలెక్టర్‌ను అవమానపరిచి ఉంటే ఆయనే తనపై కేసు పెట్టాలని, సభ అర్ధాంతరంగా ఆగిపోయిందంటూ తనపై ప్రభుత్వం కేసు ఎందుకు పెడుతుందని ప్రశ్నించారు. సీఎంకు దమ్ముంటే తనను అరెస్టు చేయాలని సవాల్ విసిరారు. -
‘మక్కా’ పేలుడు కేసు కొట్టివేత
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మక్కా మసీదు బాంబు పేలుడు కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ప్రత్యేక న్యాయస్థానం సోమవారం కొట్టివేసింది. నిందితులు నేరం చేసినట్టుగా నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని, ఏ ఒక్క అభియోగానికీ ఆధారాలు చూపలేకపోయిందని పేర్కొంది. ఈ కేసులో కీలకంగా భావిస్తున్న స్వామి అసీమానంద వాంగ్మూలానికి చట్టబద్ధత లేదని, చాలా మంది సాక్షులు తొలుత ఇచ్చిన సాక్ష్యానికి వ్యతిరేకంగా మళ్లీ సాక్ష్యం చెప్పారని స్పష్టం చేసింది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసు కుని కేసును కొట్టివేస్తున్నట్టు పేర్కొంది. ఈ మేరకు ఐదుగురు నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ.. నాలుగో అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి రవీందర్‌రెడ్డి తీర్పునిచ్చారు. పదకొండేళ్ల తర్వాత.. హైదరాబాద్‌లోని చరిత్రాత్మక మక్కా మసీదులో 2007 మే 18న బాంబు పేలుడు జరిగిన సంగతి తెలిసిందే. మసీదులో మధ్యాహ్నం ప్రార్థనలు ముగిసిన తర్వాత 1:25 గంటల సమయంలో సెల్‌ఫోన్ సహాయంతో బాంబును పేల్చారు. ఆ ఘటనలో తొమ్మిది మంది మరణించగా.. 58 మంది గాయపడ్డారు. దీనిపై తొలుత స్థానిక పోలీసులు, అనంతరం సీబీఐ, ఎన్ఐఏలు దర్యాప్తు చేసి.. చార్జిషీట్లు దాఖలు చేశాయి. మొత్తంగా పది మందిని నిందితులుగా చేర్చాయి. సుదీర్ఘంగా 11 ఏళ్లపాటు దర్యాప్తు, విచారణలు కొనసాగాయి. తాజాగా సోమవారం తీర్పు వెలువడింది. అభియోగాలకు ఆధారాలేవీ? ఈ కేసులో నిందితులుగా పేర్కొన్న వారు బాంబు పేలుళ్లకు పాల్పడినట్టు నిరూపించడంలో ఎన్ఐఏ విఫలమైందని న్యాయ మూర్తి రవీందర్‌రెడ్డి తన తీర్పులో పేర్కొన్నారు. నిందితులపై ఎన్ఐఏ మోపిన ఏ ఒక్క అభియోగానికి కూడా ఆధారాలు చూపలేకపోయిందని తెలిపారు. పేలుడుకు వాడిన సిమ్ కార్డులను నిందితులు ఉపయోగించారనేందుకు ఎటువంటి ఆధారాలు లేవన్నారు. అజ్మీర్ దర్గా పేలుడుకు, మక్కా మసీదు పేలుడుకు అవే సిమ్ కార్డులను ఉపయోగించారని ఎన్ఐఏ అభియోగం మోపిందని.. కానీ దీనిపై ఆధారాలను చూపలేకపోయిందని స్పష్టం చేశారు. బాబూలాల్ యాదవ్ పేరుతో దేవేందర్ గుప్తా సిమ్ కార్డులను కొనుగోలు చేశారనేందుకూ ఆధారాల్లేవన్నారు. ఆ వాంగ్మూలాలు చెల్లవు.. కేసులో కీలకంగా పేర్కొన్న స్వామి అసీమానంద నేరాంగీకార వాంగ్మూలానికి ఎటువంటి చట్టబద్ధత లేదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. పోలీసు కస్టడీలో ఉండగా ఢిల్లీలోని పంచకుల కోర్టులో అసీమానంద వాంగ్మూలాన్ని నమోదు చేశారని.. కస్టడీలో ఉన్న వ్యక్తి ఇచ్చిన వాంగ్మూలం చట్ట ప్రకారం చెల్లదని వెల్లడించారు. దర్యాప్తు అధికారులు అసీమానంద వాంగ్మూలం ఆధారంగానే కొందరిని నిందితులుగా చేర్చిన విషయాన్ని ప్రస్తావించారు. ఇక పేలుళ్లకు జరిపిన కుట్రలో భరత్ మోహన్‌లాల్‌కు సంబంధం ఉందని ఎన్ఐఏ నిరూపించలేక పోయిందని,. మిగతా కుట్రదారులకు డబ్బు ఇచ్చారనేందుకూ ఆధారాలు లేవని తెలిపారు. పేలుడుకు ముందురోజు రాజేంద్ర చౌదరి స్వయంగా మసీదుకు వెళ్లి బాంబు పెట్టారనేందుకు సైతం ఆధారాలు చూపలేకపోయిందన్నారు. ప్రధాన దర్యాప్తు అధికారి రాజా బాలాజీ ఇచ్చిన సాక్ష్యం కూడా పరస్పర విరుద్ధంగా ఉందని స్పష్టం చేశారు. 226 మంది సాక్షుల్లో 64 మంది తాము మొదట ఇచ్చిన సాక్ష్యానికి వ్యతిరేకంగా మళ్లీ సాక్ష్యం చెప్పారని వివరించారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటూ.. ఈ కేసును కొట్టివేస్తున్నట్టు న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు. పది మంది నిందితులు.. 226 మంది సాక్షులు ఈ కేసులో మొత్తం 10 మందిని నిందితులుగా చేర్చారు. తొలుత దర్యాప్తు చేసిన సీబీఐ.. హిందూ అతివాద గ్రూపు పేలుళ్లకు పాల్పడినట్టు ప్రాథమికంగా గుర్తించింది. 2010లో దేవేందర్ గుప్తా, లోకేశ్ శర్మలను అరెస్టు చేసింది. దేవేందర్ గుప్తా మొదటి నిందితుడిగా, లోకేశ్ శర్మను రెండో నిందితుడిగా చార్జిషీటు దాఖలు చేసింది. అనంతరం ఈ కేసు దర్యాప్తు ఎన్ఐఏ పరిధిలోకి వెళ్లింది. విస్తృతంగా దర్యాప్తు చేసిన ఎన్ఐఏ.. దేశవ్యాప్తంగా ఇదే తరహాలో జరిగిన దాడుల నుంచి సేకరించిన ఆధారాలను పరిగణనలోకి తీసుకుని.. మరికొందరు నిందితులను అరెస్టు చేసి, చార్జిషీట్లు దాఖలు చేసింది. సందీప్ దంగే, రామచంద్ర కల్సాంగ్ర, సునీల్ జోషి, స్వామి అసీమానంద అలియాస్ నంబకుమార్ సర్కార్ అలియాస్ ఓంకారానంద్ అలియాస్ రాందాస్, భరత్ మోహన్‌లాల్ రాఠేశ్వర్ అలియాస్ భరత్ భాయ్, రాజేంద్ర చౌదరి, తేజ్‌రామ్ పర్మార్, అమిత్ చౌహాన్లను తదుపరి నిందితులుగా చేర్చింది. ఇందులో ఐదుగురిపైనే అభియోగాలను నమోదు చేశారు. మధ్యప్రదేశ్‌కు చెందిన ఆర్ఎస్ఎస్ ప్రచారక్ సునీల్ జోషి.. కేసు దర్యాప్తు సమయంలోనే హత్యకు గురికాగా.. సందీప్ దంగే, రామచంద్ర కల్సంగ్రల ఆచూకీ ఇప్పటివరకు లభించలేదు. మరో ఇద్దరు నిందితులు తేజ్‌రామ్ పర్మార్, అమిత్ చౌహాన్‌లపై దర్యాప్తు కొనసాగుతోంది. మొత్తంగా నిందితుల నేరాన్ని నిరూపించేందుకు ప్రాసిక్యూషన్ మొత్తం 226 మంది సాక్షుల నుంచి వాంగ్మూలం సేకరించింది. 396 ఎగ్జిబిట్లు, 28 మెటీరియల్ ఆబ్జెక్ట్స్‌ను కోర్టు ముందుంచింది. పేలని బాంబు ఇచ్చిన ఆధారంతో.. మక్కా మసీదులో బాంబు పేలుడు అనంతరం క్లూస్ టీం తనిఖీలు చేస్తుండగా.. పేలకుండా ఉన్న మరో బాంబు లభించింది. దానిని నిర్వీర్యం చేసిన క్లూస్ టీం బృందం.. అందులో టైమర్‌గా సిమ్‌కార్డులను వినియోగించినట్టు గుర్తించింది. అంటే తొలి బాంబును కూడా అలా సిమ్ ఆధారంగానే పేల్చినట్టు నిర్ధారించారు. అటు రాజస్థాన్‌లోని అజ్మీర్ దర్గా పేలుళ్లలోనూ అచ్చు ఇదే తరహాలో సిమ్ ఆధారంగా బాంబులు అమర్చినట్టు గుర్తించారు. దాంతో దర్యాప్తు అధికారులు ఆ దిశగా దర్యాప్తు చేసి.. నిందితులను అరెస్టు చేశారు. భారీగా బందోబస్తు.. మక్కా పేలుడు కేసు తీర్పు సందర్భంగా నాంపల్లి కోర్టు పరిసరాల్లో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. తీర్పునిచ్చిన జడ్జి రవీందర్‌రెడ్డి చాంబర్ వద్ద కూడా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. సాయంత్రం ఆయన ఇంటికి తిరిగి వెళ్లేంత వరకు కూడా బందోబస్తు కొనసాగింది. నిందితులపై అభియోగాలివే.. దేవేందర్ గుప్తా: బాంబు పేలుళ్లకు మిగతా నిందితులతో కలసి కుట్ర పన్నాడు. మనోజ్‌కుమార్ పేరుతో తప్పుడు స్కూల్ సర్టిఫికెట్, బాబూలాల్ యాదవ్ పేరుతో తప్పుడు రేషన్‌కార్డు తయారు చేశాడు. ఈ తప్పుడు రేషన్‌కార్డుతో డ్రైవింగ్ లైసెన్స్ పొందాడు. దీని ఆధారంగా సిమ్ కార్డు తీసుకున్నాడు. ఈ ఫోన్ నంబర్ ద్వారానే మిగతా నిందితులతో మాట్లాడాడు. మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ప్రసంగాలు ఇవ్వడంలో దిట్ట. మొబైల్ ఫోన్‌ను ఉపయోగించి అజ్మీర్ దర్గా వద్ద ఎలా పేలుడు జరిపారో.. అదే తరహాలో మక్కా మసీదు వద్ద పేలుళ్లు జరిపారు. లోకేశ్ శర్మ: మొబైల్ ఫోన్లు సంపాదించి పెట్టడంలో కీలక పాత్ర పోషించాడు. మక్కా మసీదు పేలుళ్లు ఎలా జరపాలన్న స్కెచ్ రూపొందించింది ఇతనే. స్వామి అసీమానంద: హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులకు ప్రతీకారంగా.. మక్కా మసీదు, అజ్మీర్ దర్గాలలో పేలుళ్లు జరపాలని ప్రతిపాదించాడు. తన పథకాన్ని వివరించి రామచంద్ర కల్సాంగ్ర, భరత్ మోహన్‌లాల్ రాఠేశ్వర్ల ద్వారా సిమ్ కార్డులు సంపాదించాడు. పేలుళ్ల తరువాత స్వామి ఓంకారానంద్గా మారుపేరుతో హరిద్వార్ సమీపంలోని ఆత్మాల్పూర్ బొంగ్లా గ్రామంలో దాక్కున్నాడు. పోలీసులు అసీమానందను అరెస్ట్ చేసి.. హరిద్వార్ చిరునామాతో ఉన్న ఓటర్, రేషన్ కార్డులను, నాబాకుమార్ సర్కార్ పేరుతో ఉన్న పాస్‌పోర్టును స్వాధీనం చేసుకున్నారు. భరత్ మోహన్‌లాల్ రాఠేశ్వర్: పేలుడు కుట్రకు సంబంధించి కీలక పాత్ర పోషించాడు. గుజరాత్‌లోని మహదేవ్నగర్లో ఉన్న భరత్ ఇంట్లోనే అందరూ భేటీ అయి పేలుడుకు ప్రణాళిక రూపొందించారు. అక్కడే పేలుళ్ల కోసం రామచంద్ర కల్సాంగ్రకు రూ.40 వేలు ఇచ్చారు. సునీల్ జోషికి రూ.25 వేలు ఇచ్చి పిస్టళ్లు, సిమ్ కార్డులు పొందారు. రాజేంద్ర చౌదరి: మక్కా మసీదులో బాంబు పెట్టిన ప్రధాన వ్యక్తి. 2007 ఏప్రిల్‌లో మరో వ్యక్తితో కలసి మక్కా మసీదు వద్ద రెక్కీ నిర్వహించాడు. సంఝౌతా ఎక్స్‌ప్రెస్ బాంబు పేలుడు, మాలేగావ్ పేలుళ్ల కేసుల్లోనూ రాజేంద్ర నిందితుడు. జడ్జి రవీందర్‌రెడ్డి రాజీనామా! ఉదయం తీర్పు.. మధ్యాహ్నం రాజీనామా బెదిరింపుల వల్లేనంటున్న నాంపల్లి కోర్టు వర్గాలు రాజీనామాను ధ్రువీకరించని హైకోర్టు వర్గాలు సాక్షి, హైదరాబాద్: మక్కా మసీదు బాంబు పేలుడు కేసును కొట్టేస్తూ ఐదుగురు నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పునిచ్చిన జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ప్రత్యేక న్యాయస్థానం జడ్జి రవీందర్‌రెడ్డి.. న్యాయాధికారి పోస్టుకు రాజీనామా చేసినట్లు తెలిసింది. ఉదయం 11.50 గంటలకు తీర్పునిచ్చిన ఆయన, మధ్యాహ్నం కల్లా రాజీనామా సమర్పించారు. తన రాజీనామా లేఖను హైకోర్టుకు పంపినట్లు నాంపల్లి కోర్టు వర్గాలు తెలిపాయి. అయితే రాజీనామా లేఖ విషయాన్ని హైకోర్టు వర్గాలు ధ్రువీకరించడం లేదు. ప్రస్తుతం రవీందర్‌రెడ్డి తెలంగాణ న్యాయాధికారుల సంఘం అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. ఆయన రాజీనామాకు దారి తీసిన కారణాలు ఏంటన్నది నిర్దిష్టంగా తెలియడం లేదు. ఆయన వైపు నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడ లేదు. ఆయన్ను సంప్రదించేందుకు ‘సాక్షి’ యత్నించగా.. మాట్లాడేందుకు నిరాకరించారు. సాయంత్రం ఆరు గంటల సమయంలో రవీందర్‌రెడ్డి రాజీనామా వార్త బయటకు రావడంతో సర్వత్రా దీనిపైనే చర్చ జరిగింది. రాజీనామాపై ఎవరికి తోచిన కారణాలను వారు చెబుతున్నారు. తీర్పు అనంతరం బెదిరింపు కాల్స్ వచ్చాయని, అందువల్లే రాజీనామా చేశారని నాంపల్లి కోర్టు వర్గాలు చెబుతున్నాయి. న్యాయాధికారుల డిమాండ్ల పరిష్కారం, హైకోర్టు అనుసరిస్తున్న కంపల్సరీ రిటైర్మెంట్ విషయాల్లో ఇతర న్యాయాధికారుల నుంచి వస్తున్న ఒత్తిళ్ల కారణంతోనే ఆయన రాజీనామా చేశారని మరికొందరు చెబుతున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో ఒకట్రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
కోర్టుతీర్పును స్వాగతిస్తున్నాం: లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్ : మక్కా మసీదు పేలుళ్ల కేసులో ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ పేర్కొన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హిందూ సమాజాన్ని వ్యతిరేకించే కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలకు ఈతీర్పు చెంప పెట్టులాంటిదన్నారు. నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కేసులో అమాయకులని ఇరికించిందన్నారు. అసలు నిందితులపై కీలక సాక్ష్యాలు లేకుండా చేసిందని ఆరోపించారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులిద్దరూ కర్ణాటకలో బీజేపీని ఓడించే ప్రయత్నం చేస్తున్నారని, వాళ్ల జిమ్మిక్కులు అక్కడి ప్రజలు నమ్మరని వ్యాఖ్యానించారు. ప్రత్యేక విమానంలో బెంగాల్, బెంగళూరుకు వెళ్లే సమయం ఉన్న కేసీఆర్‌కు అంబేద్కర్‌కు నివాళులు అర్పించే సమయం లేదా అని నిలదీశారు. కర్ణాటక ఎన్నికల తర్వాత తెలంగాణలో అమిత్ షా పర్యటన ఉంటుందని లక్ష్మణ్ పేర్కొన్నారు. -
మక్కా పేలుళ్ల తీర్పునిచ్చిన జడ్జి రాజీనామా
సాక్షి, హైదరాబాద్ : మక్కా మసీద్ బాంబు పేలుళ్ల కేసులో సంచలన తీర్పును వెలువరిచిన అనంతరం కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితుల్లో ఐదుగురు నిర్దోషులు అంటూ సోమవారం ఉదయం తీర్పు ప్రకటించిన ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు జడ్జి జస్టిస్ రవీందర్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. సోమవారం తీర్పు వెలువరించిన కొద్దిసేపటికే రవీందర్ రెడ్డి రాజీనామ లేఖను హైకోర్టు చీఫ్ జస్టిస్‌కు పంపించారు. అయితే తీర్పు తరువాత బెదిరింపు కాల్స్ వచ్చాయని రవీందర్ రెడ్డి తన మిత్రులకు చెప్పినట్లు సమాచారం. రెండేళ్ల క్రితం ఏపీకి చెందిన వారిని తెలంగాణ జడ్జిలుగా నియమించొద్దంటూ తెలంగాణకు చెందిన 11 మంది న్యాయమూర్తులు ఆందోళనలు చేశారు. ఆ సమయంలో సస్పెండ్ అయిన 11 మందిలో ఆయన ఒకరు. అనంతరం తెలంగాణ ప్రత్యేక హైకోర్టు కోసం గతంలో రాజీనామా సైతం చేశారు. అయితే మక్కా మసీదు బాంబు పేలుళ్ల కేసులో తీర్పు వెలువరించిన గంటల వ్యవధిలో రవీందర్ రెడ్డి రాజీనామా న్యాయవ్యవస్థలో తీవ్ర చర్చనీయాంశం, సంచలనంగా మారింది. ఎన్ఐఏ జడ్జిగా రాజీనామా చేసిన రవీందర్ రెడ్డి స్వస్థలం కరీంనగర్ జల్లా. ప్రస్తుతం ఆయన తెలంగాణ జ్యుడీషియరీ అధికారుల సంఘం అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. మరో రెండు నెలల్లో ఆయన పదవీ కాలం ముగియనుంది. అయితే ఈ రాజీనామాకు కారణం ఒత్తిల్లేనని భావిస్తున్నారు. అయితే ఆయన గత కొంతకాలంగా తీవ్ర మనోవ్యధతో ఉన్నారని సన్నిహితులు చెబుతున్నా అసలు కారణం మాత్రం తెలియరాలేదు. -
‘అందరూ నిర్దోషులే.. పేలుళ్లు ఎలా?’
సాక్షి, హైదరాబాద్: నగరంలో సంచలనం సృష్టించిన మక్కా మసీదు పేలుళ్ల కేసును నాంపల్లి కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న నిందితులను ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. భారత్ సెక్యులర్ దేశమని.. అన్ని మతాలను గౌరవించాలన్నారు. గాంధీ కుటుంబం పాలించినప్పుడల్లా దేశం సంతోషంగా ఉందని, లౌకికవాదాన్ని కాపాడింది కాంగ్రెస్ మాత్రమే అని ఆయన తెలిపారు. నగరంలోని మక్కామసీదుకు ప్రపంచంలోనే పేరుందని ఈ సందర్బంగా ఆయన గుర్తు చేశారు. నేటి తీర్పుతో పేలుళ్లలో ఎవరున్నారో తెలియకుండా పోయిందన్నారు. ప్రాసిక్యూషన్ ఫెయిలయింది కాబట్టే నిందితులు నిర్దోషులుగా ప్రకటించబడ్డారన్నారు. సాక్ష్యాధారాలను నిరూపించడంలో ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం విఫలమయిందని ఆరోపించారు. ప్రాసిక్యూషన్ విఫలం వెనుక ఎవరున్నారని ఆయన నిలదీశారు. ఎవరూ దోషులు కాకపోతే.. పేలుళ్లు ఎలా జరిగాయని ఆయన ప్రశ్నించారు. బ్లాస్ట్ సూత్రధారులకు శిక్షపడాల్సిందేనని ఆయన వ్యాఖ్యానించారు. తీర్పు పూర్తిగా పరిశీలించాక స్పందిస్తామని ఆయన వెల్లడించారు. 11 ఏళ్ల నాటి మక్కా మసీదు పేలుళ్ల కేసులో ప్రధాన నిందితులు ఐదుగురినీ నిర్దోషులుగా ప్రకటిస్తూ ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు సోమవారం తీర్పు వెల్లడించిన సంగతి తెలిసిందే. నిందితులపై నేరారోపణలు నిరూపించటంలో ప్రాసిక్యూషన్ విఫలమైందన్న న్యాయమూర్తి.. 10 మంది నిదితుల్లో స్వామి అసిమానంద, భరత్, దేవెందర్ గుప్తా, రాజేందర్, లోకేశ్ శర్మలను నిర్దోషులుగా పేర్కొన్నారు. మిగిలినవారిపై చార్జిషీటు కొనసాగుతుందని తెలిపారు. 2007 మే 18 తేదీన మధ్యాహ్నం మక్కా మసీద్‌లో ప్రార్ధన సమయంలో టిఫిన్ బాంబు ద్వారా పేలుడు సంభవించింది. పేలుడు దాటికి 9 మంది చనిపోగా, అనంతరం చెలరేగిన అల్లర్లను నియంత్రించే క్రమంలో పోలీసులు కాల్పులు జరుపగా మరో ఐదుగురు మృతి చెందారు. -
కోర్టు తీర్పు; నిప్పులు చెరిగిన అసదుద్దీన్
సాక్షి, హైదరాబాద్: మక్కా మసీదు పేలుళ్ల కేసులో ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పు నూటికి నూరుపాళ్లూ అన్యాయమైనదని ఏఐఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అభిప్రాయపడ్డారు. సోమవారం తీర్పు వెలువడిన తర్వాత వరుస ట్వీట్లు చేసిన ఆయన.. జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ), మోదీ సర్కారులపై నిప్పులుచెరిగారు. ‘‘మక్కా మసీదు పేలుళ్లలో చనిపోయిన 9 మంది కుటుంబాలకు న్యాయం దక్కలేదు. ఉగ్రవాదాన్ని అంతం చేయాలన్న స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రం, ఎన్ఐఏలు వ్యవహరించాయి. అరెస్టైన ప్రధాన నిందితులకు 90 రోజుల లోపే బెయిల్ వచ్చినా, ఎన్ఐఏ సవాలు చేయలేదు. కేసులో కీలక సాక్షులు చాలా మంది 2014 తర్వాత మాటమార్చారు. కళ్లముందు ఇంత జరుగుతున్నా దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ గుడ్డి, చెవిటిదానిలా మిన్నకుండిపోయింది. అది రాజకీయ జోక్యానికి తలొగ్గింది. ఇదే పరిస్థితి కొనసాగితే దేశంలో న్యాయమన్నదే లేకుండాపోయే ప్రమాదం ఉంది’’ అని అసదుద్దీన్ పేర్కొన్నారు. 11 ఏళ్ల నాటి మక్కా మసీదు పేలుళ్ల కేసులో ప్రధాన నిందితులు ఐదుగురినీ నిర్దోషులుగా ప్రకటిస్తూ ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు సోమవారం తీర్పు వెల్లడించిన సంగతి తెలిసిందే. నిందితులపై నేరారోపణలు నిరూపించటంలో ప్రాసిక్యూషన్ విఫలమైందన్న న్యాయమూర్తి.. 10 మంది నిదితుల్లో స్వామి అసిమానంద, భరత్, దేవెందర్ గుప్తా, రాజేందర్, లోకేశ్ శర్మలను నిర్దోషులుగా పేర్కొన్నారు. మిగిలినవారిపై చార్జిషీటు కొనసాగుతుందని తెలిపారు. 2007 మే 18 తేదీన మధ్యాహ్నం మక్కా మసీద్‌లో ప్రార్ధన సమయంలో టిఫిన్ బాంబు ద్వారా పేలుడు సంభవించింది. పేలుడు దాటికి 9 మంది చనిపోగా, అనంతరం చెలరేగిన అల్లర్లను నియంత్రించే క్రమంలో పోలీసులు కాల్పులు జరుపగా మరో ఐదుగురు మృతి చెందారు. (చదవండి: మక్కా మసీదు పేలుడు కేసు కొట్టివేత) -
మక్కా మసీదు పేలుళ్ల కేసు కొట్టివేత
సాక్షి, హైదరాబాద్: మక్కా మసీద్ బాంబు పేలుళ్ల కేసును కొట్టివేస్తూ నాంపల్లి కోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. నిందితులపై నేరారోపణలు నిరూపించటంలో ప్రాసిక్యూషన్ విఫలమైందన్న ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు.. వారిని నిర్దోషులుగా ప్రకటించింది. ఈ కేసులో 11 ఏళ్ల సుదీర్ఘ దర్యాప్తు చేపట్టిన జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) 226 మంది సాక్ష్యులను విచారణ చేపట్టింది. ఛార్జీషీట్లో 10 మంది పేర్లను చేర్చగా.. వారిలో ఐదుగురిని నిర్దోషులుగా ప్రకటిస్తూ కేవలం రెండే నిమిషాల్లో కోర్టు తుది తీర్పు ఇచ్చింది. ఐదుగురు నిందితులు స్వామి అసిమానంద, భరత్, దేవెందర్ గుప్తా, రాజేందర్, లోకేశ్ శర్మలలో ఏ ఒక్కరిపైనా ఆరోపణలను ప్రాసిక్యూషన్ రుజువు చేయలేకపోయింది. దీంతో వారిని నిర్దోషులుగా ప్రకటించింది. అయితే మిగతా వారిపై మాత్రం ఛార్జీ షీట్ కొనసాగుతుందని కోర్టు(A-5.సునీల్ జోషి మృతి చెందారు) తెలిపింది. 2007 మే 18 తేదీన మధ్యాహ్నం మక్కా మసీద్‌లో ప్రార్ధన సమయంలో టిఫిన్ బాంబు ద్వారా పేలుడు సంభవించింది. పేలుడు దాటికి 9 మంది చనిపోయారు. తర్వాత చెలరేగిన అల్లర్లను నియంత్రించే క్రమంలో పోలీసులు కాల్పులు జరపగా.. ఐదుగురు మృతి చెందారు. అల్లర్లలో 58 మందికి గాయాలయ్యాయి. ఇక మక్కా బ్లాస్ట్ కేసులో 10 మంది నిందితులను గుర్తించిన ఎన్ఐఏ.. ఐదుగురి పేర్లను మాత్రం చార్జీషీట్లో చేర్చింది. హిందూ దేవాలయాల్లో బాంబులు పేలుస్తున్నారన్న ఆరోపణలకు ప్రతీకారంగానే నిందితులు ఈ దాడులకు పాల్పడినట్లు ఎన్ఐఏ కోర్టుకి తెలిపింది. తీర్పు నేపథ్యంలో హైదరాబాద్‌లో అలర్ట్ ప్రకటించిన పోలీస్ శాఖ.. పాతబస్తీ, నాంపల్లి కోర్టు దగ్గర ప్రత్యేక బలగాలతో భారీ భద్రత కట్టుదిట్టం చేసింది. మే 18, 2007 : మక్కా మసీదులో పేలుడు.. 9 మంది మృతి, 58 మందికి గాయాలు. 29 డిసెంబర్ 2007: గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో సునీల్ చనిపోయాడు. జూన్ 2010: ఈ కేసులో సీబీఐ దాఖలు చేసిన ఛార్జీషీట్లో సునీల్ జోషి పేరు నిందితుడిగా ఉంది నవంబర్ 19, 2010: హిందూ గ్రూప్ అభినవ్ భారత్ సభ్యుడు జతిన్ ఛటర్జీను (స్వామి అసిమానాంద) సీబీఐ అరెస్ట్ చేసింది. కొద్దిరోజులకే దేవేందర్ గుప్తా, లోకేష్ శర్మ అనే మరో ఇద్దరు నిందితులను కూడా అరెస్టు చేసింది. డిసెంబర్ 18, 2010: మక్కా మసీదు పేలుడు ఘటనలో తన పాత్రను అసీమానంద అంగీకరించాడు. 2011 డిసెంబర్ 3: గుజరాత్ వల్సాద్కు చెందిన భారత్ మోహన్‌లాల్ రతేశ్వర్ అలియాస్ భారత్‌భాయి అరెస్ట్. ఏప్రిల్ 2011: కేసు విచారణ సీబీఐ నుంచి జాతీయ దర్యాఫ్తు సంస్థ (ఎన్ఐఏ)కి బదిలీ అయ్యింది. 2013 మార్చి 2: మధ్యప్రదేశ్‌కు చెందిన రాజేందర్ చౌదరి అలియాస్ సముందర్ అరెస్ట్ మార్చి 23, 2017: హైదరాబాద్ కోర్టు అసిమానందకు బెయిల్ మార్చి 31, 2017: ఏడేళ్ల తర్వాత అసిమానంద చంచల్ గూడ జైలు నుంచి విడుదలయ్యాడు ఏప్రిల్ 16, 2018: ఈ కేసులో ఐదుగురు నిందితులను ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు నిర్దోషులుగా విడుదల చేసింది ఎన్ఐఏ సమర్పించిన జాబితాలో నిందితులు పేర్లు... A-1. దేవేందర్ గుప్తా A-2.లోకేష్ శర్మ, A-6.స్వామి ఆసిమానందా A-7.భరత్ భాయ్ A-8.రాజేందర్ చౌదరి పరారీలో ఉన్న వారు. A-3.సందీప్ డాంగే A-4.రామచంద్ర కళా సంగ్రా A-10.అమిత్ చౌహన్. ఈ కేసులో చనిపోయిన వ్యక్తి. A-5.సునీల్ జోషి. ఈ కేసులో బెయిల్ పై ఉన్న వాళ్లు A-6 .స్వామి ఆసిమానందా A-7.భరత్ భాయ్. A-9.తేజ్ పరమార్ -
మక్కా పేలుళ్ల నిందితులకు బెయిల్
సాక్షి, హైదరాబాద్: మక్కా మసీదు పేలుళ్ల కేసులో నిందితులు భరత్ మోహన్‌లాల్ రితేశ్వర్ అలియాస్ భరత్ భాయ్, స్వామి అశిమానందలకు నాంపల్లి కోర్టు గురువారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.50 వేల చొప్పున 2 పూచీకత్తు బాండ్లు సమర్పించడంతోపాటు హైదరాబాద్ వదిలి వెళ్లరాదని షరతు విధించింది. 2007 మే 18న మక్కా మసీదులో జరిగిన పేలుళ్లలో 9 మంది చనిపోగా, 70 మంది గాయపడ్డారు. ఈ పేలుళ్ల సందర్భంగా పోలీసులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు చనిపోయారు. ఈ కేసులో నిందితులుగా దేవేందర్ గుప్తా, లోకేశ్ శర్మ, స్వామి అశిమానంద, భరత్ భాయ్, రాజేందర్ చౌదరి, సందీప్ వీ డాంగే, రామచందర్ కల్సంగ్రా, సునీల్ జ్యోషిలు ఉన్నారు. ఇందులో అశిమానంద, భరత్ భాయ్‌లు కొన్ని నెలలుగా చర్లపల్లి జైలులో ఉండగా, లోకేశ్ శర్మ, రాజేందర్ చౌదరిలు అంబాలా జైలులో ఉన్నారు. అజ్మీర్‌లో జరిగిన పేలుళ్ల కేసులో దేవందర్ గుప్తాకు అక్కడి న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. ఇదే కేసులో మరో నిందితుడు సునీల్ జ్యోషిని 2007లో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేయగా, మరో ఇద్దరు నిందితులు సందీప్ వీ డాంగే, రామచందర్ కల్సంగ్రాలు పరారీలో ఉన్నారు. -
మక్కా మసీదు పేలుడు కేసులో ట్విస్ట్
హైదరాబాద్: మక్కా మసీదు బాంబు పేలుడు కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో సాక్షిగా ఉన్న జార్ఖండ్ వ్యవసాయ శాఖ మంత్రి రణధీర్ కుమార్ సింగ్ మాట మార్చారు. నాంపల్లి కోర్టులో ఈ నెల 18న వాంగ్మూలం ఇచ్చారు. ఈ కేసులో నిందితుడు కీలక సునీల్ జోషి ఎవరో తనకు తెలియదని కోర్టుకు తెలిపారు. సీబీఐ అధికారులు బలవంతపెట్టి గతంలో స్టేట్ మెంట్ తీసుకున్నారని చెప్పారు. దేవేందర్ గుప్తా అనే నిందితుడు ముస్లిం వ్యతిరేకి కాదని రణధీర్ పేర్కొన్నారు. మక్కా మసీదులో 2007 మే 18న మధ్యాహ్నం 1.18 గంటల ప్రాంతంలో బాంబు పేలడంతో 9 మంది మృతి చెందారు. 50 మందిపైగా గాయపడ్డారు. ఈ కేసులో జోషి, గుప్తాతో పాటు తొమ్మిది మందిని నిందితులుగా సీబీఐ పేర్కొంది. తర్వాత ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థకు బదిలీ చేశారు. 'సునీల్ జోషి, దేవేందర్ గుప్తా తనకు తెలుసునని రణధీర్ చెప్పినట్టు సీబీఐ మొదటి చార్జిషీటులో పేర్కొంది. వారిద్దరూ తనకు సన్నిహితులని, తనింటికి తరచూ వస్తుండేవారని తెలిపారని వెల్లడించింది. గుప్తా చాలా ఆవేశపరుడని, ముస్లింల పట్ల అతడికి వ్యతిరేకభావం ఉందని కూడా అన్నట్టు తెలిపింది. అయితే జోషి ఎవరో తనకు తెలియదని, స్టేట్ మెంట్ పై సీబీఐ బలవంతంగా తనతో సంతకాలు పెట్టించిందని రణధీర్ తాజాగా పేర్కొన్నారు. అజ్మీర్ దర్గా పేలుడు కేసులోనూ గతేడాది ఆయన ఇదేవిధంగా మాట మార్చారు. జార్ఖండ్ వికాస్ మోర్చా నుంచి నిరుడు బీజేపీలో చేరిన ఆయన తర్వాత మంత్రి అయ్యారు.