
సాక్షి, హైదరాబాద్ : మ క్కా మసీదు పేలుళ్ల కేసు పై పునర్విచారణ జరిపించాలని ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బుధవారం అర్ధరాత్రి సైదాబాద్‌లో జరిగిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. పునర్విచారణ జరపకుంటే కేసు పై సుప్రీంకోర్టుకు అప్పీల్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎన్‌ఐఏ తీరుతో ఐదుగురు నిందితులు సునాయాసంగా బయటపడ్డార న్నారు. వారు నిర్దోషులైతే, మరి పేలుళ్లు జరిపిందెవరని ప్రశ్నించారు. మక్కా ఘటనపై కోర్టు న్యాయం చేస్తుందనే నమ్మకం తమకుందని, నిందితులకు వ్యతిరేకంగా ఎన్‌ఐఏ బలమైన సాక్ష్యాలను ప్రవేశపెట్టలేకపోయిందని అన్నారు.
కేంద్ర ప్రభుత్వానికి ఎన్‌ఐఏ తలొగ్గి కేసును నీరుగార్చిందని దుయ్యబాట్టారు. త్వరలో సంజోత కేసులోంచి కూడా నిందితులు బయటపడే అవకాశముందన్నారు. గవర్నర్‌ను కలిసిన ముస్లిం పెద్దలు మక్కా మసీదు పేలుళ్లపై పునర్విచారణ జరిపించాలని, లేదంటే సుప్రీం కోర్టుకు అప్పీల్ చేయాలని ప్రభుత్వానికి సూచించాలని ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఆధ్వర్యంలో ముస్లిం మత పెద్దలు గురువారం గవర్నర్ నరసింహన్‌ను కలిశారు. పేలుళ్ల కేసులో ఎన్‌ఐఏ ప్రదర్శించిన తీరును వివరిస్తూ వినతిపత్రం సమర్పించారు.