'ట్విటర్ లో బెదిరింపులు వస్తున్నాయి'
హైదరాబాద్: తాను ఏం మాట్లాడినా కొందరు వివాదస్పదం చేస్తున్నారని ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ట్విటర్ లో తనకు బెదిరింపులు వస్తున్నాయని తెలిపారు. ఐసిస్ సానుభూతిపరులుగా అనుమానించి ఎన్ఐఏ అరెస్ట్ చేసిన నిందితులకు న్యాయసహాయం అందించడంలో తప్పేముందని ఆయన ప్రశ్నించారు. ప్రజ్ఞాసింగ్ ఠాకూర్, స్వామి అసిమానంద్ పైనా తీవ్రవాద ఆరోపణలు ఉన్నాయని గుర్తుచేశారు. వీరిపై ప్రాధమిక ఆధారాలున్నాయని కోర్టు చెప్పినా ఎందుకు పట్టించుకోవడం లేదని బీజేపీ నేతలను ప్రశ్నించారు.
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ(ఐసిస్) అంతం కావాలని తాము కూడా కోరుకుంటున్నామన్నారు. దేశానికి శత్రువు తమకు కూడా శత్రువేనని అసదుద్దీన్ ఓవైసీ పేర్కొన్నారు. కాగా, ఎన్ఐఏ అరెస్ట్ ఐదుగురికి న్యాయసహాయం అందిస్తామని ఆయన ప్రకటించారు. నిందితులు న్యాయసహాయం పొందడం వారి హక్కు అన్నారు.