పేలుడు తర్వాత మక్కా మసీదులో దృశ్యం
సాక్షి, హైదరాబాద్ : మక్కా మసీదు పేలుడు కేసులో ఎన్‌ఐఏ వైఫల్యంపై విమర్శలు వినిపిస్తున్న వేళ.. ఓ కీలక ఆధారం గురించి చర్చ మొదలైంది. పేలుడు తర్వాత ఘటనాస్థలం నుంచి ఓ ఎరుపు రంగు టీ షర్ట్‌ను స్థానిక పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. కేసులో ఇది కీలకంగా మారే అవకాశం ఉందని అప్పట్లో అంతా భావించారు. అయితే తర్వాత అది కనిపించకుండా పోవటం చర్చనీయాంశంగా మారింది.
2011లో సీబీఐ నుంచి ఈ కేసు ఎన్‌ఐఏకు బదిలీ కాబడింది. ఆ సమయంలో ఆ టీ షర్టును అధికారులు ఎన్‌ఐఏ బృందానికి అందజేయలేదంట. ఈ విషయాన్ని ఆ సమయంలో కేసు దర్యాప్తు చేపట్టిన ఎన్‌ఐఏ డైరెక్టర్(ప్రత్యేక) ఎన్ ఆర్ వాసన్ చెప్పినట్లు ఇప్పుడు ఓ ఆంగ్ల వెబ్‌సైట్ కథనం ప్రచురించింది.‘2007 మే 18 నిందితులు రెండు బాంబులతో పేలుళ్లకు యత్నించగా.. ఒక్కటి మాత్రమే పేలింది. ఘటన తర్వాత అక్కడికి చేరుకున్న పోలీసులు ఓ బ్యాగ్‌ను స్వాధీనపరుచుకున్నారు. అందులో పేలని బాంబును.. ఓ తాళపు చెవిని, ఓ ఎరుపు రంగు టీషర్ట్ ఉండగా.. వాటిని క్లూస్ టీం స్వాధీనపరుచుకుంది. తాళపుచెవి బహుశా పేలని ఐఈడీ(ఇంప్రూవ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్)కు చెందిందని భావించారు. అయితే ఫోరెన్సిక్ పరీక్షల్లో అది దానికి సరితూగకపోవటంతో ఆ ‘కీ’ మిస్టరీగా మిగిలిపోయింది. కానీ, అందులో దొరికిన ఎరుపు టీ షర్ట్ ఏమైందన్నది మాత్రం ఇప్పటిదాకా తేలలేదు. కేసు బదిలీ సమయంలో సీబీఐ ముఖ్యమైన పత్రాలను అందించిందే తప్ప.. ఆ టీషర్ట్‌ను మాకు ఇవ్వలేదు’ అని వాసన్ వ్యాఖ్యలను ఆ కథనం ఉటంకించింది.
మరోవైపు 2013-బోధ గయ పేలుళ్ల కేసు.. అక్కడ దొరికిన ఓ బ్యాగ్ ఆధారంగానే చేధించబడింది. అందులో లభించిన దుస్తులపై ఉన్న రక్తపు మరకలు.. నిందితుడు హైదర్ అలీ డీఎన్‌ఐతో సరిపోలటంతో కేసు చిక్కుముడి వీడింది. అలాంటప్పుడు మక్కా పేలుళ్ల కేసులో అదృశ్యమైన ఆ ఎరుపు రంగు టీ షర్ట్ కూడా కీలకమే అయి ఉండేదన్న అభిప్రాయాన్ని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. మక్కా మసీద్ పేలుడు కేసులో తేజ్ పరమార్, రాజేంద్ర చౌదరీలు బాంబులు పెట్టినట్లుగా ఎన్‌ఐఏ పేర్కొంది. తేజ్ పరమార్ పెట్టిన బాంబు పేలకపోగా.. ఆ బ్యాగునే పోలీసులు స్వాధీనం చేసుకున్నారని వివరించింది. అయినప్పటికీ తేజ్ పరమార్ పేరును ఛార్జీ షీట్‌లో చేర్చకుండా.. పోలీసులు అతన్ని అరెస్ట్ మాత్రం చేశారు.
11 ఏళ్ల దర్యాప్తు తర్వాత సరైన ఆధారాలు లేకపోవటంతో మక్కా మసీద్ పేలుడు కేసును కొట్టేసిన నాంపల్లి ఎన్‌ఐఏ ప్రత్యేక న్యాయస్థానం.. ఐదుగురు నిందితులను నిర్దోషులుగా విడుదల చేసిన విషయం తెలిసిందే. మిగతా వారిపై మాత్రం విచారణ కొనసాగుతుందని కోర్టు ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment